News

గోవులను వధించి కొవ్వు, చర్మం, మాంసం విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు!

252views

గోవులను వధించి.. వాటి చర్మం, కొవ్వు, మాంసం వేరు చేసి విక్రయిస్తున్న ఇద్దరిని తుని పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుని పట్టణంలోని రామకృష్ణాకాలనీ శివారు జ్యోతినగర్ ఆవులను వదిస్తున్నారని కాకినాడకు చెందిన యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ ప్రతినిధులు గోపాల్ తదితరులు పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ నాగదుర్గారావు, ఎస్సై గోపాలకృష్ణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో వధించిన గోవు, 14 ఆవు చర్మాలు, వాటి కొవ్వు నింపిన 84 డబ్బాలు, మాంసాన్ని వారు గుర్తించారు. బతికున్న నాలుగు ఆవులను జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. తుని పట్టణానికి చెందిన మహహ్మద్ షంషీర్, మహమ్మద్ హరీఫ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జంతు కళేబరాలు, మాంసం, చర్మాలను అధికారుల సమక్షంలో పూడ్చారు. డబ్బాల్లో ఉన్న కొవ్వును సీజ్ చేశారు.

చర్మం రంగు ఆధారంగా ధర నిర్ణయిస్తూ..
ఆవులను తెచ్చి వధించి వాటి చర్మాన్ని వేరు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చర్మం పాడవకుండా, దుర్వాసన రాకుండా ఉప్పు, ఇతర పదార్థాలతో శుభ్రం చేసి విక్రయిస్తున్నారని తెలుస్తోంది. చర్మం రంగు ఆధారంగా ధర నిర్ణయిస్తారని సమాచారం. ఆవు మాంసం విక్రయ ధరలు గోడపై రాసి ఉన్నాయి. ఆరోగ్యంగా ఉన్న వాటిని వధిస్తున్నారని తెలుస్తోంది. ఇక్కడ ఉన్న ఆవులు నాలుగు కూడా ఆరోగ్యంగా ఉన్నాయని పశు వైద్యుడు గోపి తెలిపారు. గోవులను ఎక్కడి నుంచి తెస్తున్నారనే విషయమై విచారణ చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

ఏం చేస్తున్నారంటే..
గోవధ తరువాత వాటి నుంచి కొవ్వును వేరుచేసి మరిగించి డబ్బాల్లో వేసి ఉంచుతున్నారు. బ్రాండెండ్ కంపెనీల నూనె డబ్బాలు పాతవి సేకరించి వాటిలో నింపుతున్నారు. డబ్బాల్లో ఉన్న కొవ్వును జిల్లా సహాయ ఆహార నియంత్రణ అధికారి శ్రీనివాస్ పరిశీలించారు. డబ్బాల్లో నిల్వ చేసిన తర్వాత కొద్ది రోజులకు ఒకసారి రాజమహేంద్రవరం, సామర్లకోట వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. అక్కడ నుంచి గౌహతి, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. దీన్ని సబ్బులు, బ్యూటీక్రీముల తయారీకి వాడుతున్నట్లు తెలిసిందని ఆయన తెలిపారు. అయితే నూనె తయారు చేస్తున్నారన్న వార్తల్లో నిజం లేదన్నారు. దీన్ని నూనెగా తయారు చేస్తే దుర్వాసన వస్తుందని, అంతేకాకుండా వినియోగిస్తే ప్రజలు చనిపోయే అవకాశం కూడా ఉందని ఆయన తెలిపారు. అయినప్పటికీ ఈ కొవ్వు నమూనాలు పరీక్షలకు పంపించామన్నారు. పట్టణ శివారులో ఉన్న ఈ కేంద్రంలో గోవులను వధించిన తర్వాత రక్తం, వ్యర్థాలను నేరుగా పక్కనే ఉన్న కాలువలో కలుపుతున్నారు. దీంతో ఈ ప్రాంతంలో దుర్వాసన వస్తోంది.