పంజాబ్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మహిళ పట్ట పాకిస్తాన్ ఎంబసీలో ఉన్న ఓ అధికారి అనుచితంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. 2021లో కరాచీలో నిర్వహిస్తున్న ఓ సమావేశానికి ఆమె హాజరయ్యేందుకు వెళ్లే క్రమంలో వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈక్రమంలో ఆమె ఢిల్లీలోని పాక్ ఎంబసీకి వెళ్లగా.. అక్కడి అధికారి ఒకరు తనపట్ల అనుచితంగా ప్రవర్తించారన్నారు. వీసా మంజూరు చేసే క్రమంలో పలు ఇబ్బందికర ప్రశ్నలు వేస్తూ తన చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు. వీసా ఇంటర్వ్యూ కోసం రెండుసార్లు వెళితే.. రెండు సార్లు ఇలాగే జరిగిందని పంజాబ్‌కు చెందిన ఆమె చెప్పుకొచ్చారు. ఈ ఘటన గురించి పాక్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్‌కు లేఖ రాయగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
లేఖలో ఏముందంటే..
‘నేను మార్చి 2021, గత సంవత్సరం జూన్‌లో న్యూ ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌కు వీసా ఇంటర్వ్యూ కోసం వెళ్లాను. నన్ను లాంజ్‌లో చాలా సేపు వెయిట్ చేయించారు. ఆ తర్వాత నాకు వీసా మంజూరు చేయలేమని చెప్పారు. ఇక కార్యాలయం నుంచి బయటకు వెళ్తుండగా.. పాక్ హైకమిషన్‌లో పనిచేసే ఓ వ్యక్తి నా దగ్గరికి వచ్చారు. మీరు నా దగ్గరకు వచ్చి ఉంటే, మీకు వీసా చేయించేవాడిని అన్నాడు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత వీసా అధికారి వస్తారని చెప్పి, నన్ను మళ్లీ లాంజ్‌లో వెయిట్ చేయించాడు’ అని ఆమె తెలిపారు. కాసేపటి తర్వాత తనను ఓ గదిలోకి పిలిచిన సదరు అధికారి.. అనుచిత ప్రశ్నలు వేశాడని బాధితురాలు వెల్లడించారు. ‘అతడు నా వీసా అవసరం గురించి అడిగాడు. నాతో సాధారణంగా మాట్లాడటం ప్రారంభించాడు. నేను సమాధానం ఇస్తూనే ఉన్నాను. మీకు పెళ్లైందా అని అడిగాడు. నేను ఇంకా కాలేదని చెప్పా. బోర్ కొడితే తాము నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటామని అతడు చెప్పాడు. ఆపై పెళ్లి ఎందుకు చేసుకోలేదని అతడు అడిగాడు. అంతటితో ఆగకుండా మీరు మీ లైంగిక కోరికను ఎలా తీర్చుకుంటారు? అని అడిగాడు. నేను చాలా ఇబ్బందికి గురయ్యా’ అని ఆమె చెప్పుకొచ్చారు. దీంతో విసిగిపోయిన తాను పైకి లేచి వీసా అధికారిని పిలవమని అడిగానని తెలిపారు. తానొక ప్రొఫెసర్ అని, లాహోర్‌లోని చారిత్రక ప్రదేశాల్ని పరిశీలించాలి అనుకుంటున్నానని తెలిపింది. అలాగే అక్కడి యూనివర్సిటీలో లెక్చర్ కూడా ఇవ్వబోతున్నట్లు చెప్పింది. ఇంటర్వ్యూ ముగిసే సమయానికి మరో అధికారి కలుగజేసుకుని, వ్యక్తిగత ప్రశ్నలు అడిగాడు. ఆ మహిళా ప్రొఫెసర్‌ను ఎందుకు పెళ్లి చేసుకోలేదని ప్రశ్నించాడు ఆ అధికారి. పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటున్నారని, సెక్స్ కోరికలు ఎలా తీర్చుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలతో తాను చాలా ఇబ్బందిపడినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ప్రస్తుతం అధికారులు విచారణ జరుపుతున్నారు.
భారత్‌కు, కాశ్మీర్‌కు, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కథనాలు రాయాలని పాక్ హైకమిషన్‌కు చెందిన అధికారి తనను కోరారని ఆ మహిళ ఆరోపించారు. తనకు డబ్బు ఆశజూపారని తెలిపారు.
దీనిపై స్పందించిన పాక్ విదేశాంగ ప్రతినిధి..
పాక్ ఎంబసీలో పనిచేసే అధికారిపై వస్తున్న లైంగిక ఆరోపణల గురించి.. పాక్ విదేశాంగ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ స్పందించారు. తమ దౌత్య కార్యాలయానికి వచ్చే వారితో తాము ఎప్పుడు తప్పుగా ప్రవర్తించమని తెలిపారు. వాస్తవాలు నిరూపితమైతే తప్పకుండా అధికారిపై చర్యలు తీసుకుంటాం.. దీనిపై లోతైన దర్యాప్తు చేపడతామని వారు తెలిపారు.