
అభివృద్ధి చెందుతున్న దేశాలు చేతులు కలపాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అభివృద్ధి పథం నుంచి పక్కకు తప్పుకోకుండా ఉండటం కోసం, అసమానతలను తొలగించడం కోసం అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిపాలనను పునర్నిర్మించడానికి చేతులు కలపాలని కోరారు. గ్లోబల్ సౌత్ నేతల వర్చువల్ సదస్సులో గురువారం ఆయన మాట్లాడారు.
జీ20 ప్రెసిడెన్సీ మన దేశానికి వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం ఓ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే ‘ది వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్’ (The Voice of Global South Summit). ఈ సదస్సులో బంగ్లాదేశ్, కాంబోడియా, గుయానా, మొజాంబిక్, మంగోలియా, పపువా న్యూ గినియా, సెనెగల్, థాయ్‌లాండ్, ఉజ్బెకిస్థాన్, వియత్నాం దేశాల నేతలు పాల్గొన్నారు. జీ20 ప్రెసిడెన్సీ సమయంలో తాను గ్లోబల్ సౌత్‌కు ప్రతినిధిగా వ్యవహరిస్తానని భారత దేశం పేర్కొంది.
గ్లోబల్ సౌత్ సదస్సును ఉద్దేశించి మోదీ వర్చువల్ విధానంలో మాట్లాడారు. వాతావరణ మార్పులు, ఉక్రెయిన్ యుద్ధం వంటి సవాళ్ళను ప్రపంచం ఎదుర్కొంటోందని, వీటిలో అత్యధిక సవాళ్ళు గ్లోబల్ సౌత్ దేశాలు సృష్టించినవి కాదని చెప్పారు. మరోవైపు ఇటువంటి సమస్యలకు పరిష్కారాల అన్వేషణ నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలను మినహాయించారని పేర్కొన్నారు.
అభివృద్ధి ఫలాలను అందుకోకుండా గ్లోబల్ సౌత్ దేశాల ప్రజలను ఇక ఎంతో కాలం మినహాయించకూడదన్నారు. మనమంతా కలిసికట్టుగా అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిపాలనను పునర్నిర్మించడానికి ప్రయత్నించాలన్నారు. ఇది అసమానతలను తొలగిస్తుందని, అవకాశాలను విస్తరిస్తుందని, వృద్ధికి ఊతమిస్తుందని, ప్రగతిని, సౌభాగ్యాన్ని వ్యాపింపజేస్తుందని తెలిపారు.
ప్రపంచాన్ని తిరిగి శక్తిమంతం చేసేందుకు స్పందించు, గుర్తించు, గౌరవించు, సంస్కరించు (respond, recognise, respect and reform) ఆధారంగా నూతన గ్లోబల్ ఎజెండాను మోదీ ప్రతిపాదించారు. గ్లోబల్ సౌత్‌కు ఉండే ముఖ్యమైన అవసరాల పట్ల సమ్మిళిత, సమతుల్యతతో కూడిన అంతర్జాతీయ ఎజెండాను రూపొందించడం ద్వారా స్పందించాలన్నారు. ఉమ్మడిగా ఉన్నప్పటికీ, ప్రత్యేక బాధ్యతలు అన్ని రకాల ప్రపంచ సవాళ్ళకు వర్తిస్తాయని గుర్తించాలని చెప్పారు. అన్ని దేశాల సార్వభౌమాధికారాన్ని, శాసన నియమాలను గౌరవించాలని, విభేదాలు, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని తెలిపారు. ఐక్యరాజ్య సమితితో సహా అంతర్జాతీయ వ్యవస్థలను ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఉండేవిధంగా సంస్కరించాలని తెలిపారు.
కష్టకాలంతో కూడిన మరో సంవత్సరపు పేజీని తిప్పిన తర్వాత ప్రపంచం సంక్షోభ స్థితిలో ఉందన్నారు. గత ఏడాది యుద్ధం, ఘర్షణలు, ఉగ్రవాదం, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ఆహారం, ఎరువులు, ఇంధనాల ధరల పెరుగుదల వేధించాయన్నారు. వీటితోపాటు వాతావరణ మార్పుల వల్ల ప్రకృతి వైపరీత్యాలు, కోవిడ్ మహమ్మారి వల్ల ఆర్థిక పతనం కూడా వేధించాయని చెప్పారు.
రానున్నవి మంచి రోజులే
కోవిడ్ మహమ్మారి సమయంలో భారత దేశం సుమారు 100 దేశాలకు మందులు, వ్యాక్సిన్లను సరఫరా చేసిందని తెలిపారు. ఉమ్మడి భవిష్యత్తును నిర్ణయించుకోవడంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు అత్యధిక పాత్ర ఉండాలని భారతదేశం ఎల్లప్పుడూ గట్టిగా చెప్తుందని తెలిపారు. సవాళ్ళు ఎదురవుతున్నప్పటికీ, మన సమయం ఆసన్నమవుతోందనే ఆశాభావం తనకు ఉందని చెప్పారు. మన సమాజాలు, ఆర్థిక వ్యవస్థలను మార్చగలిగే తేలికైన, సుస్థిరమైన పరిష్కారాలను గుర్తించవలసిన సమయం ఇదేనని చెప్పారు. ఇటువంటి వైఖరితో మనం మన సంక్లిష్ట సవాళ్ళను అధిగమించవచ్చునని తెలిపారు. పేదరికం, సార్వజనీన ఆరోగ్య సంరక్షణ, మానవ సామర్థ్యాల నిర్మాణం వంటి సవాళ్ళను మనం అధిగమించవచ్చునన్నారు.





