ArticlesNews

బడ్జెట్‌ ప్రకటనకు ముందే గరిట పట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. ఎందుకో తెలుసా?

New Delhi: Union Minister for Finance Nirmala Sitharaman and MoS Anurag Thakur distribute halwa to officials during the 'Halwa Ceremony' to mark the beginning of printing of budgetary documents, in New Delhi, Saturday, June 22, 2019. (PTI Photo/ Shahbaz Khan)(PTI6_22_2019_000066B)
362views

కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న బడ్జెట్ (Union Budget 2023) ప్రవేశపెట్టనుంది. ఈనేపథ్యంలో దీనికి ముందుగానే హల్వా వేడుకను నిర్వహిస్తారు. అసలు బడ్జెట్‌కు ముందు నిర్వహించే ఈ హల్వా వేడుక (Halwa Ceremony) ప్రత్యేకత ఏమిటి.. ? ఏటా ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారు? అనే విషయాలు తెలుసుకుందామా మరి..

వేడుక చేసేది ఇందుకే..
ఏ పనైనా విజయవంతంగా పూర్తయితే మనం ఆనందపడతాం. ఆ సంతోషాన్ని వివిధ రకాలుగా పంచుకుంటాం. అందులో భాగంగానే నోరు తీపి చేసుకుంటాం. అలా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌కు సంబంధించి కూడా హల్వా కార్యక్రమం జరుగుతుంటుంది. బడ్జెట్‌ రూపకల్పన అనంతరం శుభానికి సూచికగా ఈ మిఠాయిని సిద్ధం చేస్తుంటారు. స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేతుల మీదుగా ఈ హల్వాను తయారు చేయడం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు.

బడ్జెట్ రూపకల్పనలో పాత్ర వహించిన అధికారులు ఈ వేడుకలో పాల్గొంటారు. వీరి కృషికి మెచ్చి కృతజ్ఞతతో ఈ మిఠాయిని అందిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రతి ఒక్కరికీ ఈ మిఠాయిని పంచుతారు. ఓ భారీ కడాయిలో ఈ హల్వాను తయారు చేస్తుంటారు. పార్లమెంట్‌లోని నార్త్ బ్లాక్‌లో ఈ వేడుక జరుగుతుంటుంది. అయితే, గతేడాది హల్వా వేడుకను నిర్వహించలేదు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఈ కార్యక్రమాన్ని నిలిపివేశారు. బడ్జెట్ రూపకల్పనలో భాగస్వాములైన వారికి మిఠాయిలు మాత్రమే పంపిణీ చేశారు.

10 రోజుల ముందే వేడుక..
సాధారణంగా హల్వా కార్యక్రమం బడ్జెట్‌ ప్రవేశ పెట్టే తేదీకి 10 రోజులు ముందు జరుగుతుంటుంది. ఈ వేడుక పూర్తయ్యాక బడ్జెట్ పత్రాలను ప్రింట్ చేయడం ప్రారంభిస్తారు. బడ్జెట్ రూపకల్పన అనంతరం అదే నార్త్ బ్లాక్‌లోని ‘బడ్జెట్ ప్రెస్’ హాలులో బడ్జెట్ పత్రాల ముద్రణ చేస్తారు. ఈ సమయంలో అధికారులను బయటికి పంపించరు. పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం వరకు వీరి లోపలే ఉంటారు. కుటుంబ సభ్యులతో సహా ఎవరితోనూ మాట్లాడటానికి వీల్లేదు. బడ్జెట్‌ విశేషాలను రహస్యంగా ఉంచడానికే ఇలా చేస్తుంటారు.