ArticlesNews

భోగి మంట వేసేవారు ఈ జాగ్రత్తలు పాటించాలి!

501views

సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాలకు పెద్ద పండుగ.. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఈ పండుగ మూడు రోజులు అంటే భోగి, సంక్రాంతి, కనుమ నాడు సంబరాలు చేసుకుంటారు. భోగి వేడుక నుంచే ప్రారంభమయ్యే ఈ పండుగకు ఎన్నో ప్రత్యేకతలు, దాని వెనుక ఆచారాలు, సంస్కృతీ సంప్రదాయాలు ముడిపడి ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 14వ తేదీ భోగి పండుగను జరుపుకునేందుకు అందరూ సన్నద్ధమవుతున్నారు. అయితే భోగి మంటలు వేసే వారు కొన్ని నియమాలు పాటించాలని వేదపండితులు, పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా….

ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి..
భోగిమంటలు అంటే చలిమంటలు కాదు. అగ్నిని ఆరాధించే ఓ సందర్భం అని అందరూ భావించాలి. హోమాన్ని ఎంత పవిత్రంగా రాజేస్తామో భోగిమంటను కూడా అంతే పవిత్రంగా వెలిగించాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించాలి. ఇలా శుచిగా ఉన్న వ్యక్తే భోగి మంట వెలిగించాల్సి ఉంటుంది. అది కూడా కర్పూరంతో వెలిగిస్తే ఇంకా మంచిదని పండితులు చెబుతున్నారు.

ఒకప్పుడు భోగిమంటల్లో చెట్ల బెరడులు, పాత కలప వేసేవారు. ధనుర్మాసమంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బిళ్లను పిడకలుగా చేసి భోగిమంటలో వాడేవారు. ఇవి బాగా మండేందుకు ఆవు నెయ్యి వేసేవారు. పిడకలు, ఆవునెయ్యితో ఏర్పడే మంట నుంచి వచ్చే వాయువులో ఔషధగుణాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు.

పిడకలు, చెట్ల బెరడు ఉపయోగించలేని వారు కనీసం తాటి, కొబ్బరి ఆకులు , ఎండిన కొమ్మలతో భోగిమంట వేసుకోవచ్చు. కానీ ఇటీవల భోగిమంట కూడా ఫ్యాషన్ గా మారిపోయింది. ఇంట్లో ఉన్న చెత్తా చెదారం, రబ్బర్‌ టైర్లు, విరిగిపోయిన ప్లాస్టిక్‌ కుర్చీలను కూడా భోగిమంటల్లో వేస్తున్నారు. ప్లాస్టిక్ సామాన్లు మంటల్లో వేయడమే సరికాదంటే.. అవి సరిగా మండనప్పుడు పెట్రోల్, కిరోసిన్ పోస్తునారు… దీంతో భోగిమంటల వెచ్చదనం, సంక్రాంతి సందడి మాటేమో కానీ అనారోగ్యం పాలవడం ఖాయమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. పైగా రబ్బర్‌, ప్లాస్టిక్, పెట్రోల్, కిరోసిన్‌ నుంచి వెలువడే పొగతో పర్యావరణం కలుషితమవుతోందని వాపోతున్నారు.

భోగి పండుగ ఉద్దేశం ఇదే..
సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి… తెల్లవారు జామునే భోగిమంటలు వేసుకుని వెచ్చగా పండుగకు స్వాగతం పలుకుతారు. సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి. ఈ రోజు చలి తారాస్తాయిలో ఉంటుంది కాబట్టి, భోగిమంటలు వేసుకోవాలంటారు పండితులు.. భోగినాటికి ఉధృతంగా ఉండే చలి వల్ల క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో భోగిమంటలు వాతావరణంలో వెచ్చదనాన్ని నింపుతాయి. పైగా సంక్రాంతినాటికి పంట కోతలు పూర్తవడంతో పొలాల నుంచి వచ్చే పురుగులను తిప్పికొట్టేందుకు కూడా భోగిమంటలు ఉపయోగపడతాయి. భోగి మంట వెనక మరో విశేషం ఏంటంటే సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి మళ్లుతాడు. దీని వలన ఎండ వేడిలో ఒక్కసారిగా చురుకుదనం మొదలవుతుంది. ఉష్ణోగ్రతలలో ఒక్కసారిగా వచ్చే ఈ మార్పులు తట్టుకునేందుకు శరీరాన్ని సిద్ధం చేయడం భోగి మంటల ఉద్దేశం అన్నమాట. మరి భోగి పండుగ ప్రత్యేకత గురించి తెలుసుకున్నాం.. కదా.. పర్యవరణాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటారు కదూ..!