
పనాజీ: `కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం ద్వారా 1990లలో కాశ్మీరీ పండిట్‌లకు జరిగిన అన్యాయం, వారు అనుభవించిన క్షోభ, జరిగిన నష్టాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు తెలిసిందని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ తెలిపారు. కాశ్మీర్ ఫైల్స్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన అనుపమ్ ఖేర్ గోవాలోని పనాజీలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో భాగంగా నిర్వహించిన టేబుల్ టాక్‌లో పాల్గొన్నారు.
‘వాస్తవ సంఘటనల ఆధారంగా కాశ్మీర్ ఫైల్స్ చిత్రం నిర్మాణం జరిగింది. చిత్రం తీయడానికి ముందు చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 500తో సుదీర్ఘంగా మాట్లాడారు. హింస చెలరేగడంతో 1990 జనవరి 19 రాత్రి కాశ్మీర్ లోయకు చెందిన అయిదు లక్షల మంది కాశ్మీరీ పండిట్లు తమ ఇళ్ళను వీడి, అనుబంధాన్ని తెంపుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది’ అని తెలిపారు.
“కాశ్మీరీ హిందువుగా నేను కూడా వ్యధను అనుభవించాను. అయితే, విషాదానికి దారి తీసిన కారణాలు తెలుసుకోవడానికి ఎవరూ ప్రయత్నించలేదు. వాస్తవాలను దాచి పెట్టడానికి ప్రయత్నాలు జరిగాయి. విషాదాన్ని తెరకెక్కించడం ద్వారా ద్వారా కాశ్మీర్ ఫైల్స్ చిత్రం ఉపశమనం కలిగేలా చేసింది” అని అనుపమ్ ఖేర్ చెప్పారు.
తాను అనుభవించిన విషాదాన్ని గుర్తు చేసుకున్న అనుపమ్ ఖేర్ ది కాశ్మీర్ ఫైల్స్ తనకు కేవలం సినిమా కాదని, భావోద్వేగంతో చిత్రంలో జీవించానని అనుపమ్ ఖేర్ పేర్కొన్నారు. “నేను తమ ఇళ్ళ నుంచి బహిష్కృతులు అయిన వ్యక్తులకు నేను ప్రాతినిధ్యం వహిస్తాను. కాబట్టి, దాన్ని సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో వ్యక్తీకరించడం గొప్ప బాధ్యత అని నేను భావిస్తున్నాను. ఈ సినిమాలో మీరు చూసే నా కన్నీళ్ళు, కష్టాలు.. అన్నీ నిజమే’’ అని వివరించారు.
కాశ్మీర్ ఫైల్స్ చిత్రంలో తాను ఒక నటుడిగా కాకుండా ఒక మనిషిగా నటించి నిజజీవితంలో జరిగిన సంఘటనల వెనుక ఉన్న కారణాలు ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేలా పాత్రకు న్యాయం చేశానని ఆయన చెప్పారు. అంతా అయిపోయిందని భావించడం తప్పు అన్నది చిత్రం ప్రధాన ఇతివృత్తం అని తెలిపారు.
Source: Nijamtoday





