
న్యూఢిల్లీ: వాతావరణ మార్పులు, తద్వారా సంభవించే విపత్తుల వల్ల నష్టపోయిన దేశాలను ఆదుకోవడానికి నిధిని ఏర్పాటు చేస్తూ ఒప్పందానికి రావడం చరిత్రాత్మకమని భారత్ అభివర్ణించింది. ఇలాంటి ఒప్పందం కోసమే ప్రపంచం చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తోందని గుర్తుచేసింది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం కాప్–27 సదస్సు శుక్రవారమే ముగిసిపోవాలి. కానీ, కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడంతోపాటు ‘లాస్ అండ్ డ్యామేజీ ఫండ్’పై చర్చించాలని, ఒప్పందం కుదుర్చుకోవాలని పలు దేశాల ప్రతినిధులు పట్టుబట్టడంతో ఒక రోజు ఆలస్యంగా ముగిసింది.
కాప్–27 అధ్యక్షుడు సమీ షౌక్రీ ముగింపు ఉపన్యాసం చేశారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఈజిప్ట్‌లోని షెర్మ్–ఎల్–షేక్ నగరంలో నిర్వహించిన భాగస్వామ్య పక్షాల సదస్సు(కాప్–27) ముగిసింది. వాతావరణ మార్పుల వల్ల విధ్వంసానికి గురైన, నష్టపోయిన దేశాలకు పరిహారం చెల్లించేందుకు ఒక నిధిని ఏర్పాటు చేయాలని కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని ప్రపంచ దేశాలన్నీ దశలవారీగా తగ్గించుకోవాలంటూ భారత్ ఇచ్చిన పిలుపునకు సానుకూల స్పందన లభించింది.