News

సావర్కర్‌పై రాహుల్‌ వ్యాఖ్యలు సరికావు: ఉద్ధవ్‌

347views

ముంబయి: సావర్కర్‌ అంటే తమకు అపార గౌరవం ఉందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. అలాంటి వ్యక్తిపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను సమర్థించబోనని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుడైన సావర్కర్‌కు కేంద్రం ఎందుకు భారత రత్న ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

‘భారత్‌ జోడో యాత్ర’లో భాగంగా వాసిం జిల్లాలో నిర్వహించిన ఓ సభలో రాహుల్‌ గాంధీ సావర్కర్‌పై విమర్శలు చేశారు. భారతీయ జనతా పార్టీకీ, ఆరెస్సెస్‌కు ఆయనో చిహ్నమని పేర్కొన్నారు. అండమాన్‌ జైల్లో 2-3 ఏళ్ళ పాటు ఉన్న సావర్కర్‌.. క్షమాభిక్ష కోరుతూ బిట్రీష్‌ వారికి అర్జీలు పెట్టుకున్నారని అన్నారు. సావర్కర్‌ గొప్ప ధైర్యసాహసాలు కలిగిన వ్యక్తి అంటూ ఆయనే వేరే పేరుతో పుస్తకాలు రాశారని పేర్కొన్నారు.

బ్రిటీషర్ల నుంచి పింఛన్‌ తీసుకుంటూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేశారంటూ రాహుల్‌ విమర్శలు గుప్పించారు. దీనిపై భారతీయ జనతా పార్టీ మండిపడింది. చరిత్రను రాహుల్‌ గాంధీ వక్రీకరిస్తున్నారంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడణవీస్‌ తప్పుబట్టారు. అలాంటి వ్యక్తితో కలిసి కొందరు యాత్రల్లో పాల్గొంటున్నారని శివసేనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బాల్‌ థాక్రే ఆశయాలకు వ్యతిరేకంగా ఉద్ధవ్‌ పనిచేస్తున్నారని దుయ్యబట్టారు.

Source: eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి