News

స్విస్ బ్యాంక్ ఖాతాల వెల్ల‌డి!

339views
  • సమాచార మార్పిడి ఒప్పందంలో భాగంగా జాబితాను భారత్‌కు అంద‌జేసిన స్విట్జర్లాండ్

స్విట్జర్లాండ్‌: స్విస్‌ బ్యాంకుల్లో భారతీయ పౌరులు/సంస్థలకు చెందిన అకౌంట్ల వివరాలతో కూడిన నాలుగో జాబితా భారత్‌కు చేరింది. అందులో వ్యాపారస్థులతోపాటు కార్పొరేట్‌లు, ట్రస్టులకు చెందిన వందల అకౌంట్ల వివరాలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. స్విట్జర్లాండ్‌తో కుదుర్చుకున్న సమాచార మార్పిడి ఒప్పందంలో భాగంగా బ్యాంకు అకౌంట్లకు సంబంధించి తాజా జాబితాను అందించింది.

అటోమేటిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఎక్ఛేంజ్‌లో భాగంగా ప్రతిఏటా ఈ జాబితా స్విట్జర్లాండ్‌ అందిస్తుండగా.. తాజాగా 101 దేశాలకు చెందిన 34లక్షల అకౌంట్ల వివరాలను విడుదల చేసింది. ఈ జాబితాలో కొత్తగా నైజీరియా, పెరూ, టర్కీ, అల్బేనియా, బ్రూనీ వంటి దేశాలు చేరినట్టు ఫెడరల్‌ టాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ వెల్లడించింది.

దీంతో దాదాపు లక్ష అకౌంట్లు పెరిగినట్టు తెలిపింది. అయితే, 101 దేశాల పేర్లు, వాటి అకౌంట్ల వివరాలను బహిరంగంగా చెప్పనప్పటికీ ఆ జాబితాలో భారత్‌ ఉందని ఎఫ్‌టీఏ పేర్కొంది. ఆ వివరాలను ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే భారత ప్రభుత్వానికి అందించినట్టు వెల్లడించింది.

ఏఈఓఐలో భాగంగా స్విట్జర్లాండ్‌లో మన దేశస్థుల అకౌంట్ల వివరాలతో కూడిన తొలి జాబితా 2019లో అందింది. ఆ ఏడాది మొత్తం 75 దేశాలకు చెందిన అకౌంట్ల జాబితాను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. అనంతరం 2020 సెప్టెంబర్‌లో రెండో జాబితా, 2021 మూడో జాబితాలో 86 దేశాల వివరాలను వెల్లడించింది.

ఐడీ, పేరు, అడ్రస్‌, నివాస దేశం, టాక్స్‌ ఐడీ, సంస్థకు చెందిన వివరాలు, అకౌంట్లో నగదు, మూలధనం వంటి అకౌంట్‌ వివరాలు ఆయా ప్రభుత్వాలకు అందించిన నివేదికలో ఉంటాయని ఎఫ్‌టీఏ తెలిపింది. అయితే, 2018 ఆ తర్వాత క్రియాశీలంగా ఉన్న అకౌంట్ల వివరాలు మాత్రమే ఎఫ్‌టీఏ వెల్లడిస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి