News

హిజాబ్‌ లేదని జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇవ్వని ఇరాన్‌ అధినేత

80views

వాషింగ్ట‌న్: ఇంటర్వ్యూ చేయడానికి సిద్ధంగా ఉన్న యాంకర్‌ ఎదుట ఖాళీ కుర్చీ ఉన్న ఈ చిత్రం వెనుక ఓ ఆసక్తికర ఘటన ఉంది. ఆ మహిళ పేరు క్రిస్టియన్‌ అమన్పూర్‌. ఇరానీ-బ్రిటన్‌ కుటుంబంలో జన్మించిన ఈమె సీఎన్‌ఎన్‌లో చీఫ్‌ ఇంటర్నేషనల్‌ యాంకర్‌. అమెరికా ప్రభుత్వ నిర్వహణలోని పీబీఎస్‌లోనూ ఓ షో చేస్తున్నారు. అమన్పూర్‌ తన ట్విటర్‌ ఖాతాలో ఈ ఫొటోను పోస్టు చేసి.. దీని వెనుక ఉన్న కథను వివరించారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో జనరల్‌ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. వీటిలో ప్రసంగించేందుకు ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇటీవల న్యూయార్క్‌కు వచ్చారు.

రైసీ ఇంటర్వ్యూ తీసుకోడానికి అమన్పూర్‌ కొన్ని వారాల ముందే ప్లాన్‌ చేశారు. అన్నీ సిద్ధం చేసుకున్నారు. మరో 40 నిమిషాల్లో ఇరాన్‌ అధ్యక్షుడు వస్తారనగా ఆయన సహాయకుడు ప్రత్యక్షమయ్యారు. అమన్పూర్‌ను హిజాబ్‌ ధరించాల్సిందిగా అధ్యక్షుడు కోరుతున్నట్టు తెలిపారు. తాము న్యూయార్క్‌లో ఉంటున్నామంటూ ఆ మాటను ఆమె తిరస్కరించారు. ససేమిరా అన్న సహాయకుడు అమన్పూర్‌ హిజాబ్‌ ధరిస్తేనే ఇంటర్వ్యూ జరుగుతుందని తేల్చి చెప్పారు. అమన్పూర్‌ ఇంటర్వ్యూ రద్దు చేసుకున్నారు. “ఓ పక్క ఇరాన్‌లో హిజాబ్‌ గురించే జరుగుతున్న తీవ్ర ఆందోళనల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇరాన్‌ అధ్యక్షుడితో మాట్లాడటానికి ఇది చాలా కీలక సమయం” అంటూ ఆమె విచారం వ్యక్తం చేశారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి