
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్, సంఘ్ సీనియర్ కార్యకర్తలతో కలిసి ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసితో భేటీ అయ్యారు. ఢిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గ్ మసీదులో గంటకు పైగా ఈ భేటీ కొనసాగింది. భాగవత్ తో పాటు ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్తలైన కృష్ణ గోపాల్, రామ్‌లాల్, ఇంద్రేష్ కుమార్ ఉన్నారు.
దేశంలో మత సామరస్యాన్ని బలోపేతం చేయడం కోసం డాక్టర్ భాగవత్ కొంతకాలంగా ప్రముఖ ముస్లిం మేధావులతో చర్చలు జరుపుతున్నారు. ఈ భేటీలో పాల్గొన్న రామ్‌లాల్ గతంలో బిజెపి సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉండగా, ఇంద్రేశ్ కుమార్ ముస్లిం రాష్ట్రీయ మంచ్‌కు పోషకుడిగా ఉన్నారు. సమావేశ వివరాలను తెలుపుతూ అహ్మద్ ఇల్యాసీ సోదరుడు సుహైబ్ ఇల్యాసి “మా తండ్రి వర్ధంతి సందర్భంగా భగవత్ జీ మా ఆహ్వానంపై రావడం చాలా గొప్ప విషయం. ఇది దేశానికి మంచి సందేశాన్ని కూడా పంపుతుంది” అని సంతోషం వ్యక్తం చేశారు.
“ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ అన్ని వర్గాల ప్రజలను కలుస్తారు. ఇది నిరంతర సాధారణ ‘సంవాద్’ ప్రక్రియలో భాగం” అని ఆర్‌ఎస్‌ఎస్ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు. భాగవత్ ఇటీవల ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, మాజీ ప్రధాన ఎలక్షన్ కమిషనర్ ఎస్ వై ఖురైషీ, అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ మాజీ ఛాన్సలర్ లెఫ్టినెంట్ జనరల్ జమీర్ ఉద్దీన్ షా, మాజీ ఎంపీ షాహిద్ సిద్ధిఖీ, వ్యాపారవేత్త సయీద్ షెర్వానీలను కలిశారు ఈ సమావేశంలలో భాగవత్ హిందువులకు “కాఫిర్” అనే పదాన్ని ఉపయోగించడం గురించి ప్రస్తావిస్తూ ఇది మంచి సందేశాన్ని పంపదని స్పష్టం చేశారు. మరోవైపు కొందరు మితవాద కార్యకర్తలు ముస్లింలను “జిహాదీ”, “పాకిస్తానీలు” అని పిలవడం పట్ల ముస్లిం మేధావులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ముస్లిం మేధావులు భాగవత్ తో మాట్లాడుతూ ‘కాఫిర్’ వాడకం వెనుక అసలు ఉద్దేశ్యం వేరే ఉందని, అయితే ఇప్పుడు కొన్ని వర్గాలలో దీనిని “దుర్వినియోగం”గా ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. భాగవత్ ముస్లిం మేధావుల భయాందోళనలను అంగీకరిస్తూ ‘హిందువులు, ముస్లింలందరి డిఎన్ఎ ఒకటే అని స్పష్టం చేశారు.
Source: Nijamtoday