News

కేంద్రంపై దుష్ప్రచారానికి పాక్ నుంచి నిధులు. ఎన్.ఐ.ఏ దర్యాప్తులో వెల్లడి.

746views

క‌శ్మీర్ లోని వేర్పాటువాద నాయకులకు ఉగ్రవాద సంస్థల నుంచి వచ్చిన నిధులపై ఎన్ఐఏతోపాటు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఆదాయపుపన్ను శాఖ అధికారులు దృష్టి సారించారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో స్థానిక యువతను మిలిటెంట్లుగా రిక్రూట్ చేయించుకునేందుకు ఉగ్రవాద సంస్థలు, పాక్ అధికారిక ఐఎస్ఐ వేర్పాటు వాద నాయకులకు నిధులు సమకూర్చారని వెల్లడైంది. పాక్ ఉగ్రవాద సంస్థలు అందించిన నిధులతో వేర్పాటువాదులు కేంద్రానికి వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తూ ఉగ్రవాదాన్ని లోయలో పెంచి పోషిస్తున్నారని ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది.

జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని వేర్పాటువాదులైన 18మంది హురియత్ నేతలకు లష్కరే తోయిబా అధినేత హాఫిజ్ సయీద్ తో సంబంధాలున్నాయని.. ఆ వేర్పాటు వాద నాయకులకు లష్కరే తోయిబా నుంచి నిధులు అందాయని వెల్లడైంది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న జహూర్ అహ్మద్ షా వటాలికి చెందిన పది ఆస్తులను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జహూర్ అహ్మద్ షా వటాలికి శ్రీనగర్ లోని ఛహన్ పోరాలో ఓ భవనం, ట్రిసాన్, నర్బల్, నగరొతా ప్రాంతాల్లో భూములున్నాయి. శ్రీనగర్ జిల్లాలోని ఓ స్థలంలో ఆసుపత్రి నిర్మిస్తున్నారని తేలింది. వటాలికి చెందిన గురుగ్రామ్ లోని ఇంటిని ఈడీ అధికారులు ఇప్పటికే సీజ్ చేశారు.