
13,15 సంవత్సరాల వయసు కలిగిన ఇద్దరు హిందూ మైనర్ బాలికలను అపహరించి బలవంతంగా వివాహం చేసుకుని ఇస్లాంలోకి మార్చిన సంఘటన పాకిస్థాన్ లో చోటు చేసుకుంది. మార్చ్ 20న పాకిస్తాన్లోని సింధు ప్రాంతంలోని ఘోట్కి జిల్లా ధార్కి నగరంలో అక్క చెల్లెళ్ళయిన రవీనా, రీనా అనే ఇద్దరు బాలికలు హోళీ సంబరాల్లో వుండగా వారిని కొందరు ముస్లిం యువకులు అపహరించారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా కధనం ప్రకారం వారికి ముస్లిం యువకులతో బలవంతంగా వివాహం జరిపి మతం మార్చారు. దీనిపై కుటుంబ సభ్యుల ఫిర్యాదుననుసరించి ఎఫ్. ఐ . ఆర్ నమోదు చెయ్యడానికి కూడా పోలీసులు తిరస్కరించడం గమనార్హం. దీనిపై ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, హిందూ మైనారిటీ సంస్థలు హైవేపై బైఠాయించి తీవ్ర నిరసన తెలిపిన అనంతరం పోలీసులు కేసు రిజిష్టర్ చేశారు. పాకిస్తాన్ హిందూ సేవా వెల్ఫేర్ ట్రస్ట్ ప్రతినిధి సంజేష్ ధన్జా పత్రికలతో మాట్లాడుతూ బాలికల్ని అపహరించి, మతం మార్చి, బలవంతంగా పెళ్లి చేసుకున్న ఘటనపై పోలీసులు ఫిర్యాదు కూడా స్వీకరించక పోవడం దారుణమన్నారు. పాకిస్తాన్ లో ఇలాంటి ఘటనలు సర్వ సాధారణమైపోతున్నాయన్నారు.
కానీ కరాచి పోలీసుల కధనం మాత్రం మరోలా వుంది. బాలికలు ఇరువురూ ఇష్ట పూర్వకంగానే ఇస్లాం స్వీకరించారని, ఇందులో బలవంతమేదీ లేదని చెప్పుకొచ్చారు. అయితే బాలికల కుటుంబ సభ్యులు, హిందూ మైనారిటీ సంస్థల ప్రతినిధులు మాత్రం ఇలాంటి సంఘటనలు జరిగినపుడు పోలీసులు ఇలాగే కధలు చెబుతారని, అది ఇక్కడ సహజమేనని చెబుతున్నారు.
బాలికలకు ముస్లిం అబ్బాయిలతో వివాహం జరిగిపోవడమే కాకుండా, స్థానిక అధికారులు ఆ బాధిత బాలికలిరువురూ ఇస్లాం స్వీకరించినట్లుగా ధృవీకరిస్తూ సర్టిఫికేట్ జారీ చెయ్యడంతో బాలికల కుటుంబ సభ్యులు అయోమయంలో పడ్డారు.
కాగా బాలికల పెళ్లి, వారు మతం మారినట్లు ధృవీకరిస్తూ అధికారులు చేసిన ప్రకటన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్త్గున్నాయి. బాలికలిద్దరూ మైనర్లు కావడంతో, తరచుగా జరుగుతున్న ఇలాంటి దుర్మార్గాల నుంచి బాలికలను ప్రభుత్వం కాపాడలేక పోతోందంటూ మానవ హక్కుల కార్యకర్తలు, పాత్రికేయులు పాక్ ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నారు.
2016లో బలవంతపు మత మార్పిడులను అడ్డుకుంటూ, మైనారిటీల హక్కుల రక్షణ నిమిత్తం సింధ్ అసెంబ్లీ బిల్లు పెట్టినా అది అమలుకు నోచుకోకపోవడం విశేషం.





