News

రెండేళ్ల తర్వాత భక్తుల సమక్షంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు

453views

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా ఏకాంతంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలను ఈసారి భక్తుల మధ్య నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఏర్పాట్లు చేస్తోంది. రెండేళ్ల తర్వాత మాడవీధుల్లో స్వామివారు విహరించనున్న నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు వచ్చే అవకాశం ఉందని తితిదే అంచనా వేస్తోంది. ఇందుకు తగ్గట్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. సెప్టెంబరు 20న ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఆలయంలో సంప్రదాయబద్ధంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 27 నుంచి అక్టోబరు 5 (9 రోజులు) వరకు ఆలయ మాడవీధుల్లో వివిధ రకాల వాహనసేవల్లో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నట్లు తితిదే పేర్కొంది.

బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు, కార్యక్రమాలు

– సెప్టెంబర్ 26 – అంకురార్పణ
– సెప్టెంబరు 27 – ధ్వజారోహణం, పెద్దశేష వాహనసేవ
– సెప్టెంబరు 28 – చిన్నశేష వాహనం (ఉదయం), స్నపన తిరుమంజనం (మధ్యాహ్నం), హంస వాహనసేవ (రాత్రి)
– సెప్టెంబర్ 29 – సింహ వాహనసేవ (ఉదయం), ముత్యపుపందిరి వాహనసేవ (రాత్రి)
– సెప్టెంబర్ 30 – కల్పవృక్ష వాహనసేవ (ఉదయం), సర్వభూపాల వాహనసేవ (రాత్రి)
– అక్టోబర్ 1 – మోహినీ అవతారంలో స్వామి దర్శనం (ఉదయం), గరుడ వాహనసేవ (రాత్రి)
– అక్టోబర్ 2 – హనుమంత వాహనసేవ (ఉదయం), గజ వాహనసేవ(రాత్రి)
– అక్టోబర్ 3 – సూర్యప్రభ వాహనసేవ (ఉదయం), చంద్రప్రభ వాహనసేవ (రాత్రి)
– అక్టోబర్ 4 – రథోత్సవం (చెక్క రథం), అశ్వ వాహనసేవ (రాత్రి)
– అక్టోబర్ 5 – ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు ధ్వజారోహణం.

ఈనాడు సౌజన్యంతో…

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.