News

75ఏళ్ల తర్వాత పాక్‌లో అన్న కుమారుడిని కలుసుకున్న పంజాబ్‌ వృద్ధుడు

164views

దేశ విభజన నేపథ్యంలో పాకిస్థాన్ ‌లో ఉండిపోయిన తన అన్నయ్య కుమారుడు మోహన్‌సింగ్ ‌ను పంజాబ్ ‌కు చెందిన 92 ఏళ్ల సర్వణ్‌ సింగ్‌ దాదాపు 75ఏళ్ల తరువాత సోమవారం కలుసుకున్నారు.

పాక్ ‌లోని చారిత్రక కర్తార్ ‌పుర్‌ సాహెబ్‌ గురుద్వారా ఇందుకు వేదికైంది. ”కర్తార్ ‌పుర్‌ సాహిబ్‌ దగ్గరకు వచ్చిన మోహన్ ‌సింగ్‌ (ఖలిక్‌ సాహిబ్‌) తన చిన్నాన్న పాదాలను తాకి నమస్కరించారు. కొన్ని నిమిషాలపాటు కౌగిలించుకుని ఉండిపోయారు” అని ఖలిక్‌ కుటుంబసభ్యుడు తెలిపారు. ఇద్దరూ నాలుగు గంటలపాటు మాట్లాడుకున్నారని, ఇన్నాళ్లూ ఎలా జీవించిందీ, ఎలాంటి కష్టనష్టాలు అనుభవించిందీ పంచుకున్నారని చెప్పారు.

పంజాబ్ ‌కు చెందిన సర్వణ్ ‌సింగ్‌ కుటుంబం పాక్ ‌లోని సింధ్‌ ప్రాంతంలో ఉండేది. దేశ విభజన సమయంలో చెలరేగిన మతఘర్షణల్లో ఆయన కుటుంబంలోని 22 మంది మరణించారు. సర్వణ్ ‌సింగ్‌ భారత్ ‌కు వచ్చేశారు. ఆ అల్లర్ల నుంచి తప్పించుకున్న మోహన్‌సింగ్‌ ప్రాణాలతో బయటపడినా భారత్ ‌లోకి ప్రవేశించలేకపోయాడు.

పాకిస్థాన్ ‌లోనే ఉండిపోయాడు. మరోవైపు, మోహన్‌సింగ్ ‌ను పెంచి పెద్దచేసిన పాకిస్థాన్‌లోని ముస్లిం కుటుంబం అతడికి ఖలిక్‌ సాహిబ్‌ అని పేరుపెట్టింది. అప్పటి నుంచీ ఎవరి బతుకులు వారివి. ఇటీవల పంజాబ్‌లోని జాండియాలాకు చెందిన ఓ యూట్యూబర్‌ దేశ విభజన నాటి కథనాలను రూపొందిస్తూ…

సర్వణ్‌ సింగ్‌ జీవిత వివరాలతో కూడిన ఒక ఇంటర్వ్యూని యూ ట్యూబ్ ‌లో పోస్ట్‌ చేశారు. ఆ వీడియోలో మాట్లాడుతూ.. తన్న అన్న కుమారుడి చేతికి ఆరు వేళ్లు ఉంటాయని.. తొడపై పెద్ద పుట్టుమచ్చ ఉంటుందని సర్వణ్ ‌సింగ్‌ పేర్కొన్నారు. అలాగే పాకిస్థాన్ ‌కు చెందిన మరో యూట్యూబర్‌ కూడా మోహన్‌ సింగ్‌ వివరాలను పోస్ట్‌ చేస్తూ ఈ ఆధారాలనే ప్రస్తావించారు. కాకతాళీయంగా ఈ రెండు కథనాలనూ ఆస్ట్రేలియాలో ఉంటున్న పంజాబీ ఒకరు చూసి ఆ ఇద్దరినీ కలిపేందుకు సహకరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.