ArticlesNews

కంటి రెప్పల్ని కాపాడుకుందాం…..

83views

ప్రేమించడం తప్పు కాదు. ఆ పేరుతో ముక్కూ ముఖం తెలియని కొత్త వ్యక్తులతో ఎక్కడపడితే అక్కడ చెట్టాపట్టాలేసుకుని తిరగడమే తప్పు. వారితో మన కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాలు, ఫోటోలు, వస్తువులు పంచుకోవడమే తప్పు. కొంతకాలం పోయాక ఏ అభిప్రాయ బేధాలో, మనస్పర్ధలో వచ్చి విడిపోవాల్సి వస్తేనో, ఇంట్లో వాళ్ల బలవంతంమీదనో, వారి మాట కాదనలేకో వేరే పెళ్ళి చేసుకోవలసి వస్తేనో అవతలి వ్యక్తి మనకు అత్యంత ఆప్తుడు, ఆత్మీయుడు, హితుడు, సన్నిహితుడు అన్న గ్రుడ్డి నమ్మకంతో మనం గతంలో వారితో పంచుకున్న/చెప్పుకున్న మన వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు, ఫోటోలు, వస్తువుల ఆధారంగా బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతూ ఉండడం అనేకం గమనిస్తూ ఉన్నాం.

ఈ విషయంలో అబ్బాయిలనే కాదు, అమ్మాయిలు కూడా తక్కువేం కాదు. కొందరు యువతులు, యువకులకు ప్రేమ పేరుతో దగ్గరై వారు తమని రేప్ చేయబోయారని, కేసు పెడతామని బెదిరించి వారి నుంచి డబ్బు గుంజిన సంఘటన ఈ మధ్యనే చోటు చేసుకుంది.

ఒక వ్యక్తి పక్కింటి అమ్మాయితో ప్రేమ పేరుతో సన్నిహితంగా మెలిగి, యువతి కుటుంబం దగ్గర పొలం అమ్మిన డబ్బు ఉన్నదని తెలుసుకుని, తన దగ్గరున్న అమ్మాయి వ్యక్తిగత ఫోటోలను బయటపెడతానని ఆమెను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి ఆమె వద్ద నుంచి డబ్బు గుంజిన ఘటన ఒకటి తాజాగా వెలుగుచూసింది.

ఇవనే కాదు. ఇలాంటివి తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ప్రసార మాధ్యమాల ద్వారా మనకు తెలుస్తూనే ఉన్నాయి. అయినా సరే మనకు మాత్రం అలా జరగదు అని మనం అనుకోవటమే అవివేకం.

మళ్లీ చెప్తున్నాను ప్రేమించడం తప్పు కాదు. ఆ పేరుతో అవతలి వారితో అతి సన్నిహితంగా మెలగడం తగదంటున్నాను. భవిష్యత్తులో పరిణామాలు ఎలా ఉంటాయో తెలీదు. ఎప్పుడు ఎవరి నిజస్వరూపం బయట పడుతుందో తెలీదు. ఆ క్షణంలో ఆ బంధాన్ని తొలగించుకోవాలంటే మనం గతంలో వారితో పంచుకున్న మన వ్యక్తిగత విషయాలే పెద్ద అడ్డంకిగా మారే ప్రమాదముంది. అప్పుడు… ఇష్టం లేకపోయినా, బలవంతంగా వారితో ఆ బంధాన్ని కొనసాగించవలసి రావడమో, వారి గొంతెమ్మ కోర్కెలకు తలొగ్గడమో లేదా వారి చేతిలో అఘాయిత్యానికి బలైపోవడమో చెయ్యాల్సి ఉంటుంది.

అసలు ప్రతి విషయాన్నీ తల్లిదండ్రులకి లేదా ఇంట్లోని ఇతర పెద్దలకి ఎవరికైనా చెప్తూ ఉండటం మంచి అలవాటు. అలా కాదనుకుంటే…. కనీసం ఇబ్బందులెదురైనప్పుడైనా పెద్దల దృష్టికి తీసుకెళ్లడం తప్పనిసరి. అలా కాకపోతే ఆ తెలిసీ తెలియని వయసులో అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. పరిస్థితులు చేయి దాటి పోయిన తర్వాత ఎవరైనా చెయ్యగలిగింది ఏమీ లేదు. మహా అయితే పెద్దలేం చేస్తారు? ఓ రెండు తిట్లు తిడతారు. ఇంకా కోపం వస్తే ఓ రెండు దెబ్బలేస్తారు. అంతేగా? కానీ మీరు విషయాన్ని పెద్దలకు చెబితే సమస్య సాల్వ్ కావడం మాత్రం పక్కా.

ఇక ‘లవ్ జీహాద్’ కష్టాలైతే చెప్పనలవికాదు. ముస్లిం యువకుల కల్లబొల్లి కబుర్ల మాయలో పడి వారి కుటుంబాలలో సెక్స్ బానిసలుగా మారిపోయిన యువతులెందరో. వాడు పెట్టే టార్చర్ భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నవారు, మానవ బాంబులుగా, తీవ్రవాదులుగా మలచబడి ప్రాణాలు పోగొట్టుకునే వారు, విదేశాలకు అమ్మేయబడేవారు కోకొల్లలు. ఇలాంటి వార్తలన్నీ మనకు తెలుస్తూనే ఉంటాయ్. వింటూ, చూస్తూనే వుంటాం. కానీ మన వెంట పడుతున్న బాషా మాత్రం అలాంటి వాడు కాదని గ్రుడ్డిగా నమ్ముతాం. మనకేమీ కాదనుకుంటాం. అంతా అయిపోయాక కానీ మనం ఊబిలో కూరుకుపోయామన్న సంగతి అర్థం కాదు. అప్పుడు అర్థమైనా చెయ్యగలిగిందేమీ ఉండదు.

అలాగే ‘లవ్ జిహాద్’ విషయంలో హిందూ అమ్మాయిల తల్లిదండ్రులూ అత్యంత జాగరూకతతో, అవగాహనతో వ్యవహరించవలసిన అవసరం ఉన్నది. చాలామందికి ‘లవ్ జీహాద్’ పై తగిన అవగాహన లేకపోవడమే, మనమ్మాయి అలాంటిది కాదులే, మనకలా జరగదులే, మనింటికొచ్చే/ మనింట్లో పనిచేసే/ మనింటి ప్రక్కనుండే రఫీ అలాంటివాడు కాదులే అనుకోవడమే అసలు సమస్యలకు మూలం.

పెద్దలు కూడా పిల్లల్ని ఓ కంట గమనిస్తూ ఉండాలి. వారు ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నారు? వారి స్నేహితుల బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? పిల్లలు ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నారు? అసలు వారి దగ్గరున్న స్మార్ట్ ఫోన్ లో/తో వారు ఏమి చూస్తున్నారు/చేస్తున్నారు? అనే విషయాలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండాలి. అవసరమైన సూచనలను చేస్తూనే ఉండాలి. నిజమే ఆ వయసు పిల్లలు తల్లిదండ్రులకంటే తమకే ఎక్కువ తెలుసుననుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు చెప్పేది వినిపించుకోరు. తల్లిదండ్రుల మాటలకంటే స్నేహితుల సలహాలు, సూచనలనే మిన్నగా భావిస్తారు. అయినా తప్పదు. తల్లిదండ్రులు సహనం కోల్పోకుండా అనుక్షణమూ పిల్లల్ని హెచ్చరిస్తూ ఉండాల్సిందే. సమాజంలో జరుగుతున్న సంఘటనలను వారి దృష్టికి తీసుకెళ్లి వారిని అప్రమత్తం చేయాల్సిందే. వారు మన మాట వినటం లేదు, చెయ్యి దాటి పోతున్నారు అనిపించినప్పుడు మన కుటుంబ మిత్రులు, సన్నిహితులు, బంధువులలో ఎవరు చెబితే వింటారో వారి చేత చెప్పించే ప్రయత్నం చేయాలి. పరువు పోతుందేమోనని చాలామంది సన్నిహితులకు కూడా ఇలాంటి విషయాలు చెప్పుకోరు. కానీ మనకు తోడ్పడగలరనుకున్న సన్నిహితులకు విషయం చెప్పుకుని వారి సహకారం తీసుకోవడం తప్పేమీ కాదు. అదీ కాదనుకుంటే నిపుణుల సహాయం తీసుకోవడం ఉత్తమం. మనకెన్ని పనులున్నా, ఏదేమైనా మన కంటి రెప్పల్ని కాపాడుకోవడమే మన ప్రథమ కర్తవ్యం కదా? చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే, ఘోరాలు జరిగిపోయాక గుండెలు బాదుకుంటే ఏమిటి ప్రయోజనం? పిల్లలారా! పిల్లల తల్లిదండ్రులారా! తస్మాత్ జాగ్రత్త!

– శ్రీరాంసాగర్.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.