News

మహిళా పోలీసు అధికారిని హ‌త్య చేసిన ప‌శు స్మ‌గ్ల‌ర్లు!

354views

రాంచీ: ప‌శువులను స్మ‌గ్లింగ్ చేసే స్మ‌గ్ల‌ర్లు ఓ మ‌హిళా పోలీసు అధికారిని పొట్ట‌న‌పెట్టుకున్నారు. సంధ్యా తోప్నో అనే మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్‌ గత రాత్రి వాహనాల‌ను త‌నిఖీ చేసేందుకు వెళ్ళారు. ఈ క్ర‌మంలో ఆమె హ‌త్య‌కు గురైంది. ఈ ఘ‌ట‌న‌లో ఒక నిందితుడిని అరెస్టు చేశారు. ఆమెను తూపుదాన పోలీస్ స్టేషన్‌కు ఇంచార్జ్‌గా నియమించారు.

ఒక వాహనం పశువులను రవాణా చేస్తున్నట్టు ఆమెకు (టాప్నో) సమాచారం అందింది. ఆమె ఆ వాహ‌నాన్ని ఆపడానికి ప్రయత్నించగా, డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా ఆమెపైకి దూసుకెళ్ళాడ‌ని ఈరోజు ఉదయం ANIతో మాట్లాడుతూ, రాంచీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) కౌశల్ కిషోర్ తెలిపారు.

ఈ దుర్ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన సంధ్యా.. చికిత్స పొందుతూ ఆస్ప్ర‌తిలో మృతి చెందారు. నిందితుడిని అరెస్టు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంద‌న్నారు.

హర్యానాలో డీఎస్పీ హ‌త్య‌!

హర్యానాలో జరిగిన మరో ఘటనలో, నుహ్ జిల్లాలో అక్రమ రాళ్ళ తవ్వకాలపై విచారణ చేస్తుండగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) సురేంద్ర సింగ్ బిష్ణోయ్‌ను నిందితులు ట్రక్కుతో ఢీకొట్టారు.

ఈ కేసులో నూహ్ పోలీసు అధికారి ఈరోజు ANIకి సమాచారం అందించారు, “నుహ్‌లో అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు చేయడానికి వెళ్ళిన‌ తవడు (మేవాత్) DSP సురేంద్ర సింగ్ బిష్ణోయ్, డంపర్ డ్రైవర్ చేతిలో మరణించాడు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయ‌ని తెలిపారు.

కాగా, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించారు. ‘దోషులను విడిచిపెట్టబోమని, రాష్ట్రంలో మైనింగ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో మైనింగ్ మాఫియాను నియంత్రిస్తాం, దోషులను వదిలిపెట్టబోం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.

మైనింగ్ ప్రాంతాలకు సమీపంలో పోలీసు పోస్టులను ఏర్పాటు చేస్తామని, మైనింగ్ వాహనాలు, వాటి సామగ్రిని కూడా నిర్దేశిస్తామని ఖట్టర్ చెప్పారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి