
న్యూఢిల్లీ: సైనిక సంస్కరణలతో భాగంగా త్రివిధ సైనిక దళాలను ఒకే కూటమిగా తీసుకొచ్చి సర్వీసుల ఏకీకరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆర్మీ , నేవీ, ఎయిర్ ఫోర్స్ లకు ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు జరుగుతున్న చర్చలలో కచ్చితమైన పురోగతి సాధించగలమని ఎయిర్ చీఫ్ మార్షల్ వి ఆర్ చౌదరి తెలిపారు.
త్రివిధ సర్వీసుల ఏకీకరణకు భారత వైమానిక దళం (ఐఎఎఫ్) కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ట్రై సర్వీస్ ఆధ్వర్యంలో దేశం మరింత పటిష్ఠంగా, శక్తివంతంగా భవిష్యత్తులో వచ్చే ముప్పులను ఎదుర్కోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
“భారత సాయుధ దళాల థియేటరైజేషన్ ప్రక్రియ చర్చల దశలో ఉంది. కొన్ని అంశాలు చర్చిస్తున్నాం. ఈ అంశంలో కచ్చితమైన పురోగతి సాధిస్తామన్న నమ్మకం ఉంది” అని ఆయన చెప్పారు. ప్రణాళిక ప్రకారం ప్రతి థియేటర్ కమాండ్‌లు ఆర్మీ, నేవీ, వైమానిక దళానికి చెందిన యూనిట్‌లను కలిగి ఉంటాయి. అవన్నీ ఒక నిర్దిష్ట భౌగోళిక భూభాగంలో ఒక కార్యాచరణ కమాండర్ కింద భద్రతా సవాళ్ళను ఎదుర్కొనేందుకు ఒకే సంస్థగా పనిచేస్తాయని ఐఎఎఫ్ చీఫ్ చౌదరి చెప్పారు.
Source: Nijamtoday





