నంద్యాలలో… స్థానిక స్వయంసేవకులు కిశోర బాల బాలికలకు ఉచితంగా ఆత్మరక్షణ నైపుణ్యాలను నేర్పిస్తున్నారు.
వేసవి సెలవుల్లో పిల్లలు టీవీలకు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోవడం లేదా రాత్రి పొద్దుపోయే వరకు టీవీలు చూసి, ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం లాంటి అలవాట్లకు లోనుకాకుండా ఉండేలా మే 6వ తేది నుండి జూన్ 14 పాఠశాలలు ప్రారంభం అయ్యే వరకు ఉదయం 6:30 నుండి 8:00 గంటల వరకు స్థానిక స్టేట్ బ్యాంక్ కాలనీ రామాలయం నందు కర్రసాము (దండ), కరాటే (నియుద్ధ), యోగాతో పాటు హనుమాన్ చాలీసా పారాయణ కూడా నేర్పిస్తున్నారు. 100 నుండి 180 మంది కిశోర బాలబాలికలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమాన్ని ఆనందంగా స్వాగతిస్తున్నారు.
సంఘ సేవకులు శ్రీ సముద్రాల ఆంజనేయులు, శ్రీ సముద్రాల పాండురంగయ్య, శ్రీ కటకం నాగదీప్ ఈ కార్యక్రమంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. గత సంవత్సరంగా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో శ్రీ సముద్రాల ఆంజనేయులు కిశోర బాలికలకు కర్రసాము, కరాటే నేర్పిస్తూ ఉండటం విశేషం.
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ విభాగ్ కార్యకారిణి సభ్యులు డాక్టర్ ఉదయశంకర్, స్థానిక బిజెపి నాయకులు శ్రీ మేడా మురళీధర్, శ్రీ సముద్రాల నాగరాజు ఇతర పెద్దలు తరచూ శిక్షణ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో ముచ్చటించి నిర్వాహకులను ప్రోత్సహించడం జరిగింది.
ఇలాంటి ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవడం వల్ల పిల్లలలో ఆత్మస్థైర్యం, ధైర్యం పెరుగుతుందని, తమను తాము రక్షించుకోవడం తో పాటు, అసహాయులకు అండగా ఉండగలరని, నేరాలు తగ్గుముఖం పడతాయని తెలిపారు.
ఈ శిక్షణా కార్యక్రమం యొక్క ముగింపు కార్యక్రమం 12-6-2022 న జరిగింది. స్థానిక దేవాలయం అధ్యక్షులు శ్రీ వెంకట సుబ్బయ్య, నారాయణ కాలేజ్ ప్రిన్సిపాల్, శిక్షార్థుల తల్లి దండ్రులు నిర్వాహకుల కృషిని అభినందించడం తో పాటు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్ లు నిర్వహిస్తే బోధకులను అందుబాటులో ఉంచగలనని నారాయణ కాలేజ్ ప్రిన్సిపాల్ తెలిపారు. అనంతరం శిక్షార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. నిర్వాహకులకు మొమెంటోలతో సన్మానించారు. ఓంకారం, హనుమాన్ చాలీసాతో ప్రారంభమైన కార్యక్రమం, శాంతిపాఠంతో సంపన్నమైనది.