ArticlesNews

భళా…. కుంభమేళా….

1.2kviews

– సాధుసంతులతో నిత్యశోభితం…హిందూ జనవాహినీ సందోహం
– భక్తకోటి పుణ్యస్నానాలతో..పులకించిన పవిత్ర సంగమం

– నేత్ర కుంభలో లక్షలాది భక్తులకు ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లు.
– ప్రపంచ రికార్డులతో ముగిసిన..సాంస్కృతిక మహోత్సవం

యూపీలోని ఆధ్యాత్మిక నగరం ప్రయాగ్‌ రాజ్‌ భక్తి పారవశ్యంతో ఓలలాడింది. సాధు సంతులతో పాటు, దేశ విదేశాల నుంచి క్యూకట్టిన భక్తజనులతో 45 రోజుల పాటు తళుకులీనింది. మకర సంక్రాంతి రోజున ప్రారంభమైన అర్థ కుంభ మేళా మహోత్సవం.. మహా శివరాత్రి పర్వదినం వరకు అంగరంగవైభవంగా సాగింది. అలహాబాద్‌ను పేరును ప్రయాగ్‌ రాజ్‌ గా మార్చిన తర్వాత జరిగిన తొలి అర్ధ కుంభమేళా ఆద్యంతం ఆధ్యాత్మిక శోభతో అలరారింది.

‘కుంభ్’ సంప్రదాయం ఎప్పుడు మొదలైంది..? అసలు కుంభమేళా అంటే ఏమిటి..? పురాణేతిహాసాల్లో కుంభమేళా ప్రస్తావన వుందా..? ఈ మహోత్సవాలను ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు..? ఎన్ని రకాల కుంభమేళాలు ఉన్నాయి..?

హిందువులకు అత్యంత పవిత్ర క్రతువుగా భావించే కుంభమేళా.. ప్రధానంగా నాలుగు ప్రాంతాల్లో జరుగుతుంది. అవి హరిద్వార్, ప్రయాగ్‌ రాజ్, ఉజ్జయినీ, నాసిక్. అసలు ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు నిర్వహిస్తారు..? ఆ ప్రాంతాల ప్రత్యేకతేంటి..? కుంభ మేళాకూ.. గంగానదికీ సంబంధం ఏమిటి..?

ప్రపంచంలోని లక్షలాది మంది ప్రజలు ఒక చోట కలిసే ఉత్సవం కుంభమేళా. విశ్వంలో మరెక్కడా ఇంత పెద్ద ఎత్తున ఒక మతపరమైన ఉత్సవం జరగదు. ఈ ఏడాది జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి రోజున ప్రయాగ్ రాజ్ లో ప్రారంభమైన అర్థ కుంభమేళా.. మార్చి 4వ తేదీ మహాశివరాత్రి పర్వదినంతో ముగిసింది. గంగా, యమున, సరస్వతి పవిత్ర సంగమంలో స్నానం చేసేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా దేశదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో ప్రయాగ్ రాజ్ భక్తజనసంద్రంగా మారింది. చివరిరోజైన మహాశివరాత్రి పర్వదినం రోజున ప్రయాగరాజ్ భక్తజనసంద్రమే అయ్యింది. శివరాత్రి పుణ్యస్నానం చేస్తే పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. దీంతో ఈ ఒక్కరోజే ఏకంగా కోటీ 10 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. పవిత్ర సంగమం ఘాట్లన్నీ హరహర మహాదేవ నామస్మరణతో మార్మోగాయి. అర్ధరాత్రి వరకూ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. చివరి రోజుతో కలిపి ఈ ఏడాది కుంభమేళాలో 24 కోట్ల 5 లక్షల మందికిపైగా పుణ్యస్నానాలు చేశారని కుంభమేళా అధికారులు తెలిపారు. ఒక ఆధ్యాత్మిక ఉత్సవంలో ఇన్నికోట్లమంది పుణ్యస్నానాలు ఆచరించడం ఇంతవరకు ఎక్కడా జరగలేదు.

ప్రయాగ్ రాజ్ అర్థ కుంభమేళా మునుపెన్నడూ లేనివిధంగా ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. 10 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు నాలుగు రోజుల పాటు పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా వుంచి గిన్నిస్ రికార్డును నెలకొల్పారు. మరోవైపు, ఫిబ్రవరి 28న 19వ జాతీయ రహదారిపై 3.2 కి.మీ. దూరం.. 503 బస్సులతో పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్ అతిపెద్ద బస్సుయాత్రగా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించింది. అలాగే, మార్చి 1న నిర్వహించిన చేతిముద్రల పెయింటింగ్ కూడా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకుంది. ‘పెయింట్‌ మై సిటీ’ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో 7 వేల 664 మంది వాలంటీర్లు 8 గంటల వ్యవధిలో చేతితో పెయింటింగ్‌ రూపొందించారు. ఇక అర్థ కుంభమేళాలో ప్రధాని మోదీ సహా ఎందరో ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రయాగ్ రాజ్ కుంభమేళా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన మోదీ.. గంగానదిలో పుణ్యస్నానం ఆచరించారు. తాను పుణ్యస్నానం ఆచరించిన వీడియోను ట్వీట్ చేస్తూ.. 130 కోట్లమంది ప్రజలు బాగుండాలని కోరుకున్నానని తెలిపారు. అంతేకాదు, అవిశ్రాంతంగా పనిచేసి అశేషమైన సేవలందించిన పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగారు ప్రధాని. ‘స్వచ్ఛ్ కుంభ్, స్వచ్ఛ అభర్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇందులో భాగంగా ఇద్దరు మహిళలు సహా ఐదుగురు శానిటేషన్ వర్కర్ల కాళ్లు కడిగారు.

ప్ర‌యాగ్‌ రాజ్‌ లో అర్ధ కుంభభ‌మేళా ఆరంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఇరవై నాలుగు గంటలు శానిటేషన్ వర్కర్లు సెలవులు లేకుండా అవిశ్రాంతంగా ప‌నిచేశారు. ఈ విష‌యం తెలుసుకున్న ప్ర‌ధాని మోదీ వారికి పాదాలు కడగాలని, సన్మానించాలని నిర్ణయించారు. ఆ ప్రకారమే పారిశుద్ధ్య కార్మికుల పాదాలు కడిగారు ప్రధాని. ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి స్వచ్ఛ భారత్‌ మరింత ముందుకు వెళ్తుందని చెప్పారు మోదీ. కుంభమేళాలో పరిశుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మొత్తం భారతదేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. తనకు ఇటీవల సియోల్ శాంతి బహుమతి వచ్చిందని, దీనికి వచ్చిన మొత్తాన్ని తాను గంగమ్మ తల్లి పరిశుభ్రత కోసం ఇచ్చానని చెప్పారు. గత నాలుగేళ్లుగా తనకు అవార్డుల ద్వారా వచ్చిన మొత్తాన్ని ఈ కార్యక్రమం కోసమే ఇచ్చానని చెప్పారు. తాను శానిటేషన్ వర్కర్ల పాదాలు కడిగిన విషయం ఎప్పటికీ గుర్తుకు ఉంటుందని మోదీ అన్నారు. తన జీవితంలో ఎప్పుడూ వారు తనతోనే ఉంటారని చెప్పారు. అలాగే వారీ ఆశీర్వాదాలు తనకు జీవితాంతం ఉంటాయన్నారు.

ప్రపంచంలోనే మతపరంగా అతిపెద్ద కార్యక్రమమమే కాకుండా ఖరీదైన ఉత్సవంగా కూడా కుంభమేళా నిలిచిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కుంభమేళాకు యూపీ ప్రభుత్వం 4,200 కోట్లు కేటాయించింది. 2013లో మహాకుంభమేళాకు కేటాయించిన నిధులకన్నా ఇది మూడు రెట్లు ఎక్కువ. ఈసారి కుంభమేళా కోసం యూపీ సర్కార్ ఏకంగా తాత్కాలిక నగారాన్నే నిర్మించింది. కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. ఈసారి కుంభమేళాలో పాల్గొనే భక్తులకు ‘అక్షయ్ వాత్’, ‘సరస్వతి కూప్’ వద్ద ప్రార్థనలు చేసుకునే అవకాశం కల్పించింది. 450 ఏళ్ల కుంభమేళ చరిత్రలో ఈ అవకాశం కల్పించడం ఇదే తొలిసారి.

ఈ వేడుకలకు పూర్తిగా కార్పొరేట్‌ కళను అద్దింది యూపీ సర్కార్. గంగ, యమున నది ఒడ్డున 100 హెక్టార్ల స్థలంలో అత్యంత ఆధునిక సౌకర్యాలతో ‘టెంట్‌ సిటీ’ని నిర్మించింది. 250 కిలోమీటర్ల పొడవైన రోడ్లు, 22 తాత్కాలిక వంతెనలు, 40 వేల ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేసింది. ఫుడ్‌ కోర్టులు, రెస్టారెంట్లు, ఎంటర్‌ టైన్‌ మెంట్‌ సెంటర్లు భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాయి. కుంభమేళా భక్తులకు అసౌకర్యం తలెత్తకుండా లక్షా 25 వేల తాత్కాలిక టాయిలెట్స్‌ ను ఏర్పాటు చేశారు. కుంభమేళా జరిగే ప్రాంతం పరిశుభ్రంగా ఉండటం కోసం 20 వేల చెత్తడబ్బాలను ఏర్పాటు చేశారు. ఈ పండుగను యునెస్కో అపురూపమైన సాంస్కృతిక వారసత్వ ప్రతీకగా గుర్తించడంతో యూపీ ప్రభుత్వం మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అర్థ కుంభమేళాను విజయవంతం చేసింది.

ఇక భద్రత ఏర్పాట్లలో యూపీ సర్కార్ ఎక్కడా రాజీ పడలేదు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 1,150 సీసీకెమెరాలు, 40 పోలీసు స్టేషన్లు, 62 పోలీసు పోస్టులు ఏర్పాటు చేశారు. 22,000– 24,000 మంది పారామిలటరీ జవాన్లు పహారా కాశారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి అణువణువునూ పర్యవేక్షించారు. భక్తులు నది వద్దకు చేరడం, ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ మళ్లింపులు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ పర్యవేక్షిస్తుంది. అడుగడుగునా సీసీటీవీ నిఘా పెట్టారు. మొత్తం 20 వేల మంది భద్రతా సిబ్బంది విధులను నిర్వర్తించారు.

భక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా.. ఇబ్బందులు ఎదురుకాకుండా 11 తాత్కాలిక ఆసుపత్రులు నిర్మించారు. అంతేకాదు, పర్యాటకరంగాన్ని ప్రోత్సహించేందుకు యోగి సర్కార్‌ ఈసారి కుంభమేళాలో ప్రత్యేకంగా పడవ ప్రయాణాన్ని ఏర్పాటు చేసింది. కాశీ నుంచి త్రివేణీ సంగమానికి చేరేందుకు చాలామంది భక్తులు పడవలనే ఉపయోగించారు. గంగానదీ అందాలను ఆస్వాదిస్తూ 60 కిలోమీటర్ల దూరాన్ని గంటలోపే చేరుకునే సౌలభ్యం వుండటంతో.. భక్తులు పడవ ప్రయాణానికి మొగ్గుచూపారు. ఇందుకోసం గంటకి 80 కిలోమీటర్ల వేగంతో నడిచే ఎయిర్‌ బోట్లను ఏర్పాటు చేసింది. మొత్తానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా.. యోగి సర్కార్ అర్థకుంభమేళాకు కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది.

లక్షలాది భక్తులకు నేత్ర కుంభ ద్వారా నేత్ర చికిత్సలు:

కుంభ మేళా సందర్భంగా సక్షం మరియు ఇతర 5 సేవా సంస్థలు కలిసి నిర్వహించిన నేత్ర కుంభలో మొత్తం రెండు లక్షలా రెండు వేలా ఇరవై (202020) మందికి ఉచిత నేత్ర పర్రేక్షలు నిర్వహించి, ఒక లక్షా యాభై ఐదు వేలా రెండు వందలా పది మందికి ఉచితంగా కంటి అద్దాలను అందించారు. ఈ కార్యక్రమంల 800 మంది నేత్ర వైద్య నిపుణుల పర్యవేక్షణలో జరిగింది. మొత్తం 2500 మంది వాలంటీర్లు మొత్తం 51 రోజుల పాటు తమ సేవలందించారు. వచ్చిన భక్తులకు నేత్రానందకరమైన కుంభ మేళా దర్శనం తోపాటు ఉచిత నేత్ర వైద్యసేవలు కూడా లభించడం విశేషం.

నదులను పవిత్రంగా భావించడం-నదుల్లో పుణ్యస్నానాలు చేయడం-నదీమతల్లికి పూజలు నిర్వహించడం భారతీయ సంప్రదాయం. వందల ఏళ్లుగా ఈ సనాతన ఆచారం కొనసాగుతూ వస్తోంది. అలాంటి ఆధ్యాత్మిక వ్యవహారాల్లో కుంభమేళా ఒకటి. పరమ పావన గంగానదికి భక్తులు చేసుకునే వేడుకే కుంభమేళా. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం కుంభమేళా. సాధారణ కుంభమేళాను ప్రతి నాలుగేళ్లకోసారి నిర్వహిస్తారు. అర్థ కుంభమేళాను ఆరేళ్లకోసారి, పూర్ణ కుంభమేళాను పన్నెండేళ్లకోసారి, మహాకుంభమేళాను 144 సంవత్సరాలకోసారి జరుపుకుంటారు. ఈసారి అర్థకుంభమేళాకు ప్రయాగ అతిథ్యమిచ్చింది.

ప్రయాగరాజ్ గా పేరు మార్చిన తరువాత తొలిసారి అర్ధ కుంభమేళాకు వేదికగా నిలిచింది ప్రయాగ. మకర సంక్రాంతి పర్వదినం రోజున ప్రారంభమైన అర్థకుంభమేళా 45 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగి.. మహా శివరాత్రి పర్వదినం రోజున ముగిసింది. ఈ నెలన్నర రోజులు త్రివేణి సంగమ ప్రాంతమైన అలహాబాద్.. ప్రపంచ ఆధ్యాత్మిక వేత్తలతో లక్షలాదిమంది భక్తులతో పోటెత్తింది. ఇది అర్థ కుంభమేళానే అయినా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం దీనిని ‘కుంభ్’ అనాలని ప్రకటించడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు, పూర్ణ కుంభ్‌, మహా కుంభ్ అని కూడా పిలుచుకున్నారు. ఈ మహావేడుకను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించడంతో.. అర్థకుంభ మేళాకు మరింత ప్రాచుర్యం లభించింది.

ఎలాంటి ఆహ్వానం లేకుండానే కొన్ని లక్షల మంది భక్తులు, సాధు సంతులు హాజరుకావడంతో.. ఈ సాంస్కృతిక మహోత్సవం తళుకులీనింది. కుంభమేళా నిర్వహణలో బృహస్పతి గ్రహ స్థితికి చాలా ప్రాధాన్యం ఉంటుందని జ్యోతిషులు చెబుతారు. ఈ గ్రహం మేష రాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో పూర్ణ కుంభమేళా, వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు అర్థ కుంభమేళా జరుగుతుంది. దాని ప్రకారం ఇప్పుడు ప్రయాగలో ముగిసిన కుంభమేళా.. అర్థ కుంభమేళా.

అర్థ కుంభమేళా, కల్పవాస్ సంప్రదాయాలు కేవలం ప్రయాగ, హరిద్వార్‌లో మాత్రమే ఉన్నాయనేది చాలా ముఖ్యమైన అంశం. పురాణాలు, వేదాలలో కుంభమేళా గురించి ఉందని, దానికి శతాబ్దాల పురాతన చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. పురాణ పండితుల వివరాల ప్రకారం పురాణాల్లో కుంభ్ అనే మాట ఉంది. కాలక్రమంలో అదే కుంభమేళాగా మారిందని అంటారు. అర్థ కుంభమేళాకు సంబంధించి మరో వాదన కూడా వుంది. 12 ఏళ్లకు ఒకసారి ఒకేచోట గుమిగూడే మతాచార్యులు.. మధ్యలో కూడా ఒకసారి అంతా కలిస్తే బాగుంటుందని.. 19వ శతాబ్దంలో అనుకున్నారట. అందుకే ఆరేళ్లకు ఒకసారి అర్థ కుంభమేళా సంప్రదాయం ప్రారంభమైందని ఇంకొదరు చరిత్రకారులు చెబుతారు.
ఇక కుంభమేళాలో ప్రధాన ఆకర్షణ నాగా సాధువులు. అర్థకుంభమేళాలో నాగసాధువుల కోలాహలం అంతాఇంతా కాదు. సాధువులు, సన్యాసులు, మతపెద్దలు ఉండే అఖాడాలకు నాగా సాధువులు కేంద్రంగా ఉంటారు. సనాతన మత ధర్మాలను పరిరక్షించేందుకే సాధువుల సంప్రదాయం ప్రారంభమైందని చెబుతారు. ఏళ్ల క్రితం ప్రారంభమైన అఖాడా సంప్రదాయంలో మొదట పది అఖాడాలే ఉండేవి, కానీ, మెల్లమెల్లగా వాటి సంఖ్య పెరిగింది. ఇప్పుడు 15 అఖాడాలు ఉన్నాయి. సనాతన ధర్మానికి చెందిన శివ, వైష్ణవ సంప్రదాయాలను ఆచరించే అఖాడాలతోపాటు, సిక్కులకు కూడా తమ సొంత అఖాడా ఉంది. అది 1855 నుంచే కుంభమేళాలో పాల్గొంటోంది.

కొత్తగా ఏర్పడిన అఖాడాల్లో మహిళా సాధువులు మాత్రమే ఉండే దానిని పరీ అంటారు. అంటే దేవకన్యల అఖాడా అని అర్థం. ఇక ట్రాన్స్‌ జెండర్, హిజ్రాల కు కూడా అఖాడా ఉంది. ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఈ అఖాడాలు చాలా పోరాటాలు చేసిన తర్వాత కుంభమేళాలో పాల్గొనడానికి స్థానం సంపాదించాయి. పరీ అఖాడాకు ప్రయాగలో 2013లో జరిగిన కుంభమేళాలో ప్రాధాన్యం లభించింది. ఇక హిజ్రాల అఖాడాకు తొలిసారిగా ప్రయాగ అర్థ కుంభమేళా వేదికైంది. ప్రయాగరాజ్ కుంభమేళాకు ఉన్న ప్రత్యేక ఆకర్షణ.. ఇక్కడ జరిగే కల్పవాస్. లైఫ్ మేనేజ్‌మెంట్, టైమ్ మేనేజ్‌మెంట్ లాంటి వాటిని నేర్పించే ఈ కల్పవాస్ చేయడానికి దేశవ్యాప్తంగా లక్షల మంది హాజరయ్యారు. ఇప్పుడు ఇది చాలా మంది విదేశీయులను కూడా బాగా ఆకర్షించింది. ప్రభుత్వం, చాలా మంది సాధువులు, ఎన్నో ఇతర సంస్థలన్నీ కలిసి కల్పవాస్ కోసం కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశాయి. పూరి గుడిసె నుంచి ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాల వరకూ ఉన్న గదులను యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.