News

శివరాత్రి సందర్భంగా చిత్తూరు జిల్లా వి. కోటలో ఆరెస్సెస్ కార్యకర్తల కవాతు

1.5kviews

ప్రతి ఏడాది శివరాత్రి సందర్భంగా చిత్తూరు జిల్లా వి.కోట ఖండ ఆరెస్సెస్ కార్యకర్తల కవాతు జరుగుతుంది. ఈ ఏడాది కూడా అదే విధంగా మండల పరిధిలోని పత్రపల్లె నుంచి లాంగ్ బజార్, అంబేద్కర్ సర్కిల్ మీదుగా వేణుగోపాల స్వామి దేవాలయం వరకు ఆరెస్సెస్ కార్యకర్తలు ఉత్సాహంగా కవాతు నిర్వహించారు. ఈ కవాతులో 82 మంది సుశిక్షితులైన ఆరెస్సెస్ కార్యకర్తలు ఆరెస్సెస్ యూనిఫాంతో పాల్గొన్నారు. మిలిటరీ తరహా బ్యాండుతో క్రమశిక్షణాయుతంగా జరిగిన ఈ కవాతు ప్రజలను ఆకట్టుకుంది.

అనంతరం స్థానిక వేణుగోపాలస్వామి దేవాలయంలో జరిగిన సమావేశంలో తిరుపతి విభాగ్ ప్రచారక్ శ్రీ గౌతం మాట్లాడుతూ కుల, మత, వర్గ, ప్రాంత భేదాలకు అతీతంగా ప్రజలందరూ ఒక్కటై జాతీయ భావాన్ని పెంపొందింకోవాలన్నారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతిగా మన సైన్యం ఉగ్రవాద స్థావరాలపై జరిపిన దాడిని, మన సైన్యం యొక్క ధైర్య సాహసాలను ప్రశంసించాల్సింది పోయి కొందరు రాజకీయ నాయకులు లేని పోని అనుమానాలను వ్యక్తం చెయ్యడం సమంజసం కాదని తెలిపారు. నేటి యువత పాశ్చాత్య నాగరికత వైపు మొగ్గు చూపి , మన దేశ సంస్కృతీ సాంప్రదాయాలను విస్మరిస్తూ వుండడం బాధాకరమన్నారు. హిందుత్వంలోనే  లౌకిక వాదం వున్నదని, “సర్వేజనా సుఖినోభవంతు” అని చెప్పడమే అందుకు ఉదాహరణ అని చెప్పారు. ఓటు హక్కును ఉపయోగించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ‘నోటా’ నొక్కడం ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ అయిపోతోందని, నోటా నొక్కడం వల్ల ఒరిగేదేమీ లేదని అన్నారు. నోటా నొక్కడం వల్ల అనర్హుల గెలుపును అడ్డుకోలేమని, ఉన్నవారిలో ఉత్తములను ఎన్నుకోవడమే సరియైన పద్ధతని అభిప్రాయపడ్డారు.