
యాదగిరి: యాదగిరి గుట్ట దేవాలయానికి వచ్చే వారి వాహనాలకు ఖరారు చేసిన పార్కింగ్ ఫీజుపై విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) తీవ్రంగా మండిపడింది. హిందూ దేవాలయాలను తెలంగాణ ప్రభుత్వం కేవలం తమ ఖజానా నింపే ఆర్థిక వనరుగా మాత్రమే చూస్తుందనేందుకు ఈ నిర్ణయం నిలువెత్తు సాక్ష్యమని వీహెచ్‌పీ తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు ఎం.రామరాజు, ప్రాంత కార్యదర్శి బండారి రమేష్, బజరంగ్‌దళ్ ప్రాంత ప్రముఖ్ శివరాములు మండిపడ్డారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవాలంటే సామాన్య భక్తులకు చుక్కలు చూపిస్తున్నారు. భక్తులు తాము వచ్చిన కారుతో కొండపైకి వెళ్ళాలంటే ఆదివారం నుండి రూ.500 కట్టాల్సిందే అంటూ నిర్ణయించడం సర్వత్రా ఆందోళనకు దారితీస్తుంది. కొండపైన గంటకు పైగా వాహనం నిలిపితే మరో రూ.100 చెల్లించాల్సిందే.
ఎన్ని గంటలు కొండపైన ఉంటే ఆ మేరకు ఒక్కో గంటకు రూ.100 చొప్పున అదనంగా కట్టాల్సిందే. దీనికి సంబంధించిన కొత్త నిబంధనలను ఆలయ ఈవో గీతారెడ్డి శనివారం అకస్మాత్తుగా విడుదల చేశారు. కొత్తగా విడుదల చేసిన ఉత్తర్వులు ఈ నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి తీసుకొచ్చారు. బహుశా దేశంలో మరే ప్రార్ధన స్థలం వద్ద ఇటువంటి పార్కింగ్ ఫీజులను వసూలు చేయడం లేదని వీహెచ్‌పీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సహితం ఇంత భారీగా పార్కింగ్ ఫీజులు లేకపోవడం గమనార్హం.
యాదాద్రిలో పార్కింగ్ ఫీజుల పెరిగే హిందువులను దోచుకోవడమే ముఖ్యమంత్రి కేసీఆర్ విధానమా అన్ని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ ప్రశ్నించారు. భక్తుల సౌకర్యాలపై కాకూండా ఆదాయ వనరులపై దేవాదాయ శాఖ దృష్టి సారించడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.
Source: Nijamtoday





