Articles

దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు – ఎన్నికల మాయాజాలం.

1.4kviews

సహజంగా మన దేశంలో రాజకీయ నాయకులు ఎన్నికల ముందు అమాయక ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక రకాల వాగ్దానాలు చేస్తుంటారు. కానీ ఆ వాగ్దానాలలో చాలావరకూ ఆచరణాత్మకంగా ఉండవు. ఎన్నికలు జరిగిన తరువాత, అదే రాజకీయ నాయకులు తమ వాగ్దానాలను అమలు చేయలేకపోవడానికి అనేక కుంటిసాకులు చెప్తారు. ప్రజలు కూడా వాటిని చాలా త్వరగా మర్చిపోయి, ఎన్నికయిన నాయకులు తమకు ఇచ్చిన వాటితో తృప్తిపడుతుంటారు.

ఇలాంటి శుష్క వాగ్దానాలకి తాజా ఉదాహరణ ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇస్తానన్న దళిత క్రైస్తవులకి రిజర్వేషన్. రాజ్యాంగ పరంగా అది సాధ్యం కాదన్న విషయము ఆయనకీ తెలుసు, ఇంకా ప్రజలలో కూడా చాలా మందికి తెలుసు.

ఈ సందర్భంగా ‘దళితులు’ అంటే ఎవరో ఒకసారి పరిశీలిద్దాము. సమాజంలోని నాలుగు అగ్రవర్ణాల వాళ్ళు ఎవరినైతే తమని తాకడానికి వీలు లేదు అని దూరంగా పెట్టారో అలాంటి నిమ్నకులాల వారిని సహజంగా దళితులు అని వ్యవహరిస్తున్నాము. భారతీయ సంస్కృతిలో వీళ్ళని ‘పంచములు’ (అంటే మొదటి నాలుగు
వర్ణాలైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్ర కులాలకు చెందని వాళ్ళు) అని కూడా వ్యవహరిస్తుంటారు. వీళ్ళు మిగిలిన నాలుగు వర్ణాల వారిచే వాడుకోబడి, అణగతొక్కబడటం జరిగింది.

మనకి స్వాతంత్య్రం సిద్ధించినాక, డాక్టర్ బీ.ఆర్.అంబెడ్కర్ లాంటి మేధావులు వీళ్ళ దుస్థితిని వెలుగులోకి తీసుకొచ్చి, వీళ్ళు కూడా సమాజంలోని మిగిలిన నాలుగు వర్గాలవారితో సమానంగా అభివృద్ధి చెందడం కోసం రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగా ఎవరైతే షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు ఉన్నారో, వాళ్లకి విద్య, రాజకీయ, ఉపాధి రంగాలలో ప్రత్యేక అవకాశాలను కల్పిస్తూ రిజర్వేషన్లను ప్రవేశ పెట్టబడినాయి. అదే సమయములో మన రాజ్యాంగ నిర్మాతలు, ఈ రిజర్వేషన్లు హిందూ మతాన్ని అవలంబిస్తున్న నిమ్న కులాల వారికి మాత్రమే వర్తిస్తాయి అని స్పష్టంగా పేర్కొనడం ఇక్కడ మన దేశం లో
అవలంభింపబడుతున్న మిగిలిన ప్రధాన మతాలైన ఇస్లాం, క్రైస్తవ మతాలలో కుల ప్రసక్తే లేదు కాబట్టి, ఇంకా కుల ప్రాతిపదికన అణగతొక్కడం అనే ప్రశ్నే తలెత్తదు అని వాళ్ళ అభిప్రాయం. తరువాతి కాలంలో ఈ రిజర్వేషన్లని సిక్కు, బౌద్ధ మతం అవలంబిస్తున్న దళితులకు కూడా వర్తింపచేయడం జరిగింది. కాబట్టి ఈ మూడు మతాలను అవలంబిస్తున్న దళితులకు మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయి. దళితులు కనుక తమ మత విశ్వాసాన్ని మార్చుకున్న పక్షంలో, రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను వాళ్ళు కోల్పోతారు.

అయితే, మతం మార్చుకున్న దళితులు చాలా కాలంగా తమకు కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని అడుగుతూనే ఉన్నారు. ఓట్ల కోసం వారిని సమర్ధించే రాజకీయ నాయకులు, మతం మారినంత మాత్రాన వాళ్ళ సామాజిక హోదా మారదు కాబట్టి, వాళ్లకి కూడా రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే అని సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉన్నారు.
ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, సమాజంలోని దోపిడీకి, అణచివేతకు గురయిన కొన్ని కులాల వాళ్ళను షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చడం జరిగింది. వాళ్ళు కూడా మిగిలిన కులాల వారితో సమానంగా ఎదిగేందుకు అవకాశం కల్పిస్తూ రిజర్వేషన్లను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సత్యాన్ని దృష్టిలో ఉంచుకుని, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు వర్తిస్తాయా? అన్న ప్రశ్నను మనం పరిశీలిస్తే, సులభంగా ఒక అవగాహనకు రాగలము. ఎప్పుడైతే దళిత కులాలకు చెందిన వాళ్ళు తమ మత విశ్వాసాన్ని మార్చుకుని బయటకు వస్తారో,అప్పుడు వాళ్ళు ఆ మతంలో ఉన్న దురాచారాలనించి కూడా బయటకి వచ్చేసినట్టే. ఇక వాళ్ళు ఏ మాత్రం దళితులు (ఈ పదం అణగదొక్కబడిన నిమ్న కులాల వారికి వర్తింపచేశారు) కాజాలరు. కాబట్టి దళితులు అన్న మాట ఇక వాళ్లకి ఏ మాత్రం వర్తించదు. కాబట్టి వాళ్లకి ప్రత్యేక రాజ్యాంగ రక్షణ అవసరం
ఉండదు.

దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లను వర్తింపజేస్తే, అది ఖచ్చితంగా తమ ధర్మాన్ని మార్చుకోని దళితుల మీద ప్రభావాన్ని చూపుతుంది. పైగా ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలంచడం కోసం దీనిని రాజ్యాంగ ధర్మాసనానికి అప్పచెప్పడం జరిగింది. కాబట్టి, దానినుంచి స్పష్టమైన తీర్పు వచ్చేవరకు దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు అమలు చేయడం అసాధ్యం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎవరైనా దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లుఇస్తామంటే, అది పట్టపగలు వాళ్ళని దారుణంగా మోసం చేసినట్టే.