
మంగుళూరు: మంగళూరు ప్రాంతంలోని ఓ మసీదుకు సంబంధించిన మరమ్మతు పనులు జరుగుతూ ఉండగా హిందూ నిర్మాణ శైలికి సంబంధించిన పిల్లర్స్ బయటపడ్డాయి. గురువారం మంగళూరు శివార్లలోని పురాతన మసీదు కింద హిందూ దేవాలయం లాంటి నిర్మాణ డిజైన్ కనుగొనబడింది. మంగళూరు శివార్లలోని మలాలిలోని జుమా మసీదు పునరుద్ధరణ పనులు చేస్తూ ఉండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
మసీదు అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. అయితే, ఈ ప్రదేశంలో హిందూ దేవాలయం ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. పత్రాలను ధ్రువీకరించే వరకు పనులు నిలిపివేయాలని విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) నాయకులు జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు.
తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు యథాతథంగా కొనసాగించాలని దక్షిణ కన్నడ కమిషనరేట్ ఆదేశించింది. అధికారులు భూ రికార్డులను పరిశీలిస్తున్నారని, శాంతిభద్రతలు కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. “ఈ ఘటన గురించి క్షేత్రస్థాయి అధికారులు, పోలీసు శాఖ నుండి నాకు సమాచారం అందింది. జిల్లా యంత్రాంగం పాత భూ రికార్డులు, యాజమాన్య వివరాలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తోంది.
మేము ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్, వక్ఫ్ బోర్డు నుండి నివేదికలు తీసుకుంటాము.. ”అని దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర చెప్పారు. ఈ విషయంపై వివిధ తనిఖీలను చేపడతామని.. అతి త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. అప్పటి వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
Source: NationalistHub





