News

జగద్గురు స్వామి హంసదేవాచార్య ఆకస్మిక మృతి.

825views

ప్రయాగ రాజ్ కుంభమేళా లో పాల్గొని తిరుగు ప్రయాణమైన జగద్గురు రామానందాచార్య హంసదేవాచార్య మహరాజ్ కారు ప్రమాదంలో ఆకస్మికంగా మృతి చెందారు. స్వామీజీ వారి పూర్తి జీవితాన్ని సనాతన ధర్మ రక్షణకు , ఉద్దరణకు, ప్రచారానికే వెచ్చించారు.  “మానవ సేవయే మాధవ సేవ” అని తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఆజన్మాంతము మనో వాక్కాయ కర్మణా ఆచరించి తరించారు. స్వామీజీ ఈ రోజు ఉదయం ప్రయాగ రాజ్ నుంచి హరిద్వార్ కు కారులో బయలుదేరారు. దారిలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాల మధ్య స్వామీజీని లక్నోలోని ఒక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వామి తుది శ్వాస విడిచారు. ఆయనతోపాటు వాహనంలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయట పడ్డారు. సాధు సమాజంలో ప్రముఖుడైన పూజ్య హంసదేవాచార్య అయోధ్య రామ మందిర నిర్మాణ ఉద్యమంలో కూడా కీలక భూమిక పోషిస్తున్నారు. స్వామీజీ మరణ వార్త విని అఖాడా పరిషద్ అధ్యక్షులు మహంత్ నరేంద్ర గిరిజీ, శంకరాచార్య స్వరూపానంద సరస్వతిజీ ప్రతినిధి స్వామి అవిముక్తేశ్వరానందజీ, స్వామి ఆనంద గిరిజీ, సాధు బాబా ఆశ్రమ మహంత్, మహామండలేశ్వరులు సంతోష్ జీ తదితరులు తమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. యావత్ సాధు సమాజము శోక సంద్రంలో మునిగిపోయింది.