
న్యూఢిల్లీ: శ్రీలంకలో బతకలేక అక్కడి తమిళులు పడవ మార్గంలో తమిళనాడులోని ధనుష్కోటికి చేరుకున్నారు. వీళ్లకు ఆశ్రయం కల్పించే విషయంలో భారత్ ఇంకా స్పష్టమైన నిర్ణయమేదీ తీసుకోలేదు. అయితే, రాబోయే రోజుల్లో లంకేయుల రాకలు పెరగొచ్చనే అంచనాల నేపథ్యంలో ఇండియా ఏం చేయబోతోందనేది ఆసక్తికరంగా మారింది. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం దెబ్బకు నిత్యావసరాల ధరలు భారీగా పెరిగి, సామాన్యులు బతకలేని పరిస్థితి నెలకొంది.
అధిక ధరలకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనల బాటపట్టారు. ఆందోళనలు హోరెత్తడంతో కేంద్ర కేబినెట్ మొత్తం రాజీనామా చేసింది. కానీ, ప్రధాని మహీంద రాజపక్స, ఆయన సోదరుడైన అధ్యక్షుడు గొటబయ రాజపక్స మాత్రం ఇంకా పదవుల్లోనే కొనసాగుతున్నారు. లంకలో పరిస్థితులు చేయిదాటిపోయిన తరుణంలో పెద్దన్నలా భారత్ ఆదుకుంటున్నది. శ్రీలంకకు భారీ ఎత్తున ఇంధనం, బియ్యాన్ని సహాయంగా అందిస్తున్నది భారత్. అయితే, లంకలో బతకలేమంటూ ఇండియాకు వచ్చేస్తోన్నవారి సంఖ్య ఇప్పుడు క్రమంగా పెరుగుతోంది.
శ్రీలంకలోని జాఫ్నా, మున్నార్ ప్రాంతాల్లో తమిళులు ఎక్కువ సంఖ్యలో జీవిస్తారని తెలిసిందే. ఎల్టీటీఈ ఉద్యమం జోరుగా సాగిన కాలంలో ప్రత్యేక దేశం కోసం పోరాడిన తమిళులు.. ప్రభాకరన్ మరణం, ఎల్టీటీఈపై శ్రీలంక సైన్యం ఉక్కుపాదం తర్వాత ఆందోళనలకు స్వస్తి చెప్పడం విదితమే. కాగా, ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో బతకలేకపోతున్నామంటూ ఇండియాకు శరణార్థులుగా వస్తున్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





