
* 8000ల బైకులు, 15000ల మంది యువకులతో భారీ బైక్ ర్యాలీ
* శ్రీ భువనేశ్వరీ పీఠాధిపతి పూజ్య కమలానంద భారతీ స్వామి, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ తిరుపతయ్యల ప్రసంగాలు
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ జరిగింది. 10 కిలోమీటర్ల పాటు జరిగిన ఈ బైక్ ర్యాలీలో సుమారు 8000ల బైకులలో 15000ల మంది యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజమండ్రి పురవీధులలో వేలాది మందితో జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాల మధ్య అంగరంగ వైభవంగా, కోలాహలంగా, ఉత్సాహభరితంగా సాగిన బైక్ ర్యాలీని రాజమండ్రి పురవాసులు భక్తిప్రపత్తులతో, ఆసక్తిగా తిలకించారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ శ్రీ భువనేశ్వరీ పీఠాధిపతి పూజ కమలానంద భారతీ స్వామి, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ తిరుపతయ్య పాల్గొని ప్రసంగించారు.


పూజ్య కమలానంద భారతీ స్వామి మాట్లాడుతూ భారతదేశంలో హిందూత్వ శక్తులు బలపడితేనే హిందూ సమాజానికి, యావత్ దేశానికి రక్షణ లభిస్తుందని, భారతదేశం యొక్క సౌభాగ్యం కారణంగానే యావత్ ప్రపంచంలో శాంతి సౌఖ్యాలు వెల్లివిరుస్తాయని పేర్కొన్నారు. హిందూత్వ శక్తులు బలంగా ఉన్న చోట జాతి వ్యతిరేక, తిరోగమన వాద శక్తులు తోక ముడుచుకుని పారిపోతున్న వైనాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. హిందుత్వ శక్తులు బలం సాధించిన చోట తీవ్రవాద శక్తులు, మతోన్మాద శక్తులు, జాతి వ్యతిరేక, తిరోగమన వాద శక్తులను మూలాలతో సహా పెకలించివేయడం సాధ్యమవుతున్నదని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తో సహా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో అదేవిధంగా హిందుత్వ శక్తులు బలపడితే అక్కడ విశృంఖలంగా జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న దుష్ట శక్తులను పునాదులతో సహా పెకలించి వేయవచ్చునని, భవిష్యత్తులో అలా ఖచ్చితంగా జరిగి తీరుతుందని స్వామీజీ జోస్యం చెప్పారు.


మన పూర్వీకులెందరో మనదేశ ధర్మాల రక్షణ కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా సమర్పించారని, మనమందరమూ వారి వారసులమని, వారి ప్రేరణతో, వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని మనందరమూ కూడా దేశ ధర్మ రక్షణకై సమయాన్ని కేటాయించి పనిచేయాలని, ఆ దిశగా మన వారసులను సైతం ప్రోత్సహించాలని వారు ఉద్బోధించారు. ధర్మరక్షణ ద్వారానే దేశ రక్షణ సాధ్యమవుతుందని, భారత దేశ రక్షణతోనే యావత్ ప్రపంచం యొక్క సౌఖ్యం, సౌభాగ్యం ముడిపడి ఉన్నదని స్వామీజీ ఈ సందర్భంగా సెలవిచ్చారు.


ఆంధ్రప్రదేశ్ ప్రాంత ధర్మజాగరణ ప్రముఖ్ శ్రీ తిరుపతయ్య మాట్లాడుతూ… సనాతన హిందూ ధర్మాన్ని విడనాడి విదేశీ అన్యమతాలను అవలంబిస్తున్న వారు ఈ భూమిని తల్లిగా భావించి, పూజించే పవిత్ర భారతీయ సంస్కృతికి దూరమవుతున్నారని, వారి ప్రార్థనాలయాలలో విషం నూరిపోస్తున్న కారణంగా నెమ్మది నెమ్మదిగా వారిలో మన భూమిపట్ల, దేశం పట్ల, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, వేషభాషల పట్ల, శ్రద్ధా కేంద్రాల పట్ల భక్తి భావన తొలగి విముఖత, వ్యతిరేకత ఏర్పడుతున్నాయని, మనకంటే పాశ్చాత్యులే అధికులనే దురభిప్రాయానికి సైతం వారు లోనవుతున్నారని, అనంతర కాలంలో విదేశీ, విధర్మీయ, విద్రోహ శక్తులకు గట్టి సమర్థకులుగానూ, అనుయాయీలుగానూ కూడా వారు మారిపోతున్నారని తెలిపారు.

హిందువులే భారతీయ సంస్కృతికి వారసులని, కనుక ఈ సంస్కృతిని, విశ్వాసాలను, ఆచార విచార వ్యవహారాలను, వేషభాషలను సంరక్షించుకోవాల్సిన గురుతర బాధ్యత హిందువులందరిపైనా, హిందువులపైన మాత్రమే ఉన్నదని ఆయన నొక్కి చెప్పారు. హిందువులలో ఈ దేశంపట్ల, ధర్మం పట్ల సహజంగానే ఉన్న భక్తిని, మాతృభావనను తిరిగి మేల్కొలపాలని ఆయన అన్నారు.

హైలైట్స్…
* ఈ బైక్ ర్యాలీలో ఓ 1000 మంది మహిళలు కూడా ఉత్సాహంగా పాల్గొనడం విశేషం.
* చిన్నారులు, పెద్దలు భారతమాత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు వంటి పురాణ పురుషుల వేషధారణలో కనువిందు చేశారు.
* రామనవమి సందర్భంగా రాజమండ్రి పురవాసులకు రాముడు పూనాడా అన్నంతగా వారిలో ఉత్సాహం నెలకొంది. దివ్యాంగులు తమ వైకల్యాన్ని సైతం లెక్కచేయకుండా ర్యాలీలో పాల్గొన్నారు. జైశ్రీరాం, భారత్ మాతాకీ జయ్ నినాదాలతో గొంతు కలిపి పులకించిపోయారు.
* అనేకమంది యువకులు డీజే సౌండ్స్ తో శృతికలిపి ఆనంద తాండవం చేశారు. మ్యూజిక్ కి అనుగుణంగా, ఉత్సాహభరితంగా వారు చేసిన నృత్యం పుర ప్రజలను అలరించింది.
నగరమంతటా కాషాయ శోభ…
బైక్ ర్యాలీ సందర్భంగా నగరమంతటా కాషాయ జెండాలతో తోరణాలతో కనులపండువగా మారిపోయింది. నగరమంతటా పెద్దఎత్తున హనుమాన్ జెండాలు, శివాజీ జెండాలు, రాముని జెండాలు, కాషాయ తోరణాలు వెలిశాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రాజమండ్రి నగరమంతా కాషాయమయమైపోయింది. నగరమంతటా కాషాయ వర్ణపు శోభ అలముకుంది. రాజమండ్రిలో జరిగిన ఈ బైక్ ర్యాలీయే ప్రస్తుతం రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మారడం వేశేషం.






