-
ఆర్.ఎస్.ఎస్ ప్రాంత సహ కార్యవాహ యుగంధర్
నంద్యాల: హిందువులు సమిష్టిగా జీవిస్తూ, తమ ఉన్నత కోసం పాటుపడాలని, సమాజంలోని మత మార్పిడులను, లవ్ జిహాద్ లాంటి దారుణాలకు అడ్డుకట్ట వేసి, కులవృత్తులను మెరుగుపరుచుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్(ఆర్.ఎస్.ఎస్) ప్రాంత సహ కార్యవాహ యుగంధర్ అన్నారు.
కర్నూలు జిల్లా, నంద్యాల ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో నంద్యాల పరిసర ప్రాంత కుల సంఘాల పెద్దల సమావేశం నంద్యాలలో సోమవారం జరిగింది. ప్రధాన వక్తగా యుగంధర్ హాజరై, మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా మనమంతా ఒక్కటిగా మన సంస్కృతీసంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, వస్త్రధారణను గౌరవించుకోవాలని పేర్కొన్నారు.
కులాల అనే అడ్డుగోడలు ఛేదించుకొని మనమందరం ఏకంకాకపోతే మనలను కబలించడానికి ఎడారి దొంగలు, సముద్రపు దొంగలు, గోతికాడి నక్కల్లా కాచుక్కున్నాయని హెచ్చరించారు.
దేశ సంక్షేమం దృష్ట్యా మనమందరం నిరంతరం చైతన్యవంతులమై, చూట్టూ ఉన్న వారిని చైతన్యపరుస్తూ… సమాజంలోని ఇతర సమూహాలను ఏకీకృతం చేస్తూ అఖండ శక్తిగా ఆవిర్భవించి, ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా స్థానిక ప్రముఖ న్యాయవాది రామచంద్రరావు, ధర్మ జాగరణ ప్రాంత నిధి ప్రముఖ్ శివ రామకృష్ణ, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.