న్యూఢిల్లీ: భారత్‌లో చోరీకి గురై అక్రమంగా తమ దేశంలోకి వచ్చిన 29 కళాఖండాలను ఆస్ట్రేలియా తిరిగి భారత్‌కు అప్పగించింది. ఆ కళాఖండాలను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం స్వయంగా పరిశీలించారు. ఈ కళాఖండాల్లో శిల్పాలు, ఫోటోలు, పెయింటింగ్‌లు వంటివి ఉన్నాయి.
వీటిలో కొన్ని 12వ శతాబ్దానికి చెందినవి కూడా ఉన్నాయి. చోరీ, లేదా అక్రమ రవాణా మార్గంలో ఇవి ఆస్ట్రేలియాకు చేరినట్టు గుర్తించారు. భారత్‌కు వీటిని తిరిగి అప్పగించడం ఒక చారిత్రకమైన చర్యగా అధికార వర్గాలు తెలిపాయి.
ఈ కళాఖండాల్లో శివుడు, శక్తి, విష్ణువు, వారి అవతారాలు, జైన్ సంప్రదాయం, చిత్తరువులు, అలంకరణ వస్తువులు సైతం ఉన్నాయి. శాండ్‌స్టోన్, కంచు, ఇత్తడి, పేపర్ వంటి మెటీరియల్‌తో రూపొందించిన కళాఖండాలివి.
ఇవన్నీ రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమబెంగాల్‌లోని కళలు, సంస్కృతిని ప్రతిబింబిస్తుండటం విశేషం. వీటి విలువ 22 లక్షల డాలర్ల వరకూ ఉంటుందని అంచనా. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మొర్రిసన్‌లు సోమవారం వర్చువల్ సమావేశంలో మాట్లాడుకున్నారు.
Source: Nijamtoday