News

చైనాలో ఘోర విమాన ప్రమాదం – 133 మంది మృతి

595views

చైనాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 133 మంది ప్రయాణికులతో వెళ్తోన్న బోయింగ్‌ 737 విమానం చైనాలో గుయాన్జి ప్రాంతంలో కుప్పకూలింది.

ప్రమాద సమయంలో విమానంలో 123 మంది ప్రయాణికులు, మిగతా సిబ్బంది ఉన్నారు. స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 1.11 గంటల ప్రాంతంలో కున్మింగ్‌ నగరం నుంచి గుయాంగ్‌ఝౌ నగరానికి బయల్దేరిన చైనా ఈస్ట్రన్‌ సంస్థకు చెందిన బోయింగ్‌ 737 విమానం మధ్యాహ్నం 2.22 గంటల సమయంలో రాడార్‌తో సంబంధాలు తెగిపోయింది. ఆ సమయంలో విమానం 3225 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నట్లు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ వద్ద సమాచారం ఉంది. ఆ వెంటనే గుయాంగ్జి ప్రాంతంలోని వుజౌ నగర సమీపంలో ఓ పర్వతాన్ని ఢీకొట్టి కూలినట్లు తెలుస్తోంది. ఈ విమానం 3.05 గంటలకు ల్యాండ్‌ అవ్వాల్సి ఉంది. ఈలోపే ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.

విమానం కూలిన ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగినట్లు చైనా మీడియా కథనాలు పేర్కొన్నాయి. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి బయల్దేరారు. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. అయితే.. ప్రమాద తీవ్రతను బట్టి విమానంలో ఉన్న వారు ఎవరూ బతికే అవకాశం లేదని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.

గతంలో 2010లో చైనాలోని యిచున్‌ ప్రాంతంలో విమానం కుప్పకూలిన ఘటనలో 42 మంది చనిపోయారు.

– ఈనాడు సౌజన్యంతో,,,

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.