
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో జిల్లా ప్రచారక్, విభాగ్ ప్రచారక్, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత ప్రచారక్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల సేవా ప్రముఖ్…. ఇలా వివిధ స్థాయిలలో పనిచేసి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యంలో ఎందరో కార్యకర్తలకి ప్రేరణగా నిలిచిన స్వర్గీయ శ్రీ సోమేపల్లి సోమయ్య గారి జీవిత చరిత్ర “స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమయ్య” పేరుతో నవయుగ భారతి ప్రచురణ సంస్థ ద్వారా ప్రచురితమైంది.
ఈ పుస్తకం యొక్క ఆవిష్కరణ సభ మార్చి 26 శనివారం సాయంత్రం హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ స్మారక విద్యాలయాల ప్రాంగణంలోని సర్దార్ పటేల్ హాల్ లో జరుగనున్నది. ఆ సభలో భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ పుస్తకం ఆవిష్కరింపబడుతుంది. శ్రీ వెంకయ్య నాయుడికి స్వర్గీయ సోమయ్య గారితో ఆత్మీయ అనుబంధం ఉన్నది. రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో తన ప్రస్థానం, రాజకీయాలలో తాను సాధించిన ప్రగతికి స్వర్గీయ సోమయ్య, స్వర్గీయ భోగాది దుర్గాప్రసాద్ వంటి మహోన్నత, ఆదర్శనీయ కార్యకర్తల సాంగత్యము, వారి నుంచి లభించిన ప్రేరణ, వారందించిన ఉత్తమ సంస్కారాలే కారణమని ఆయన తరచూ చెబుతూ ఉంటారు. ఈ కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సంఘ, భాజపా, వాటి అనుబంధ సంస్థల ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.
స్వర్గీయ శ్రీ సోమేపల్లి సోమయ్య గారి గురించి సంక్షిప్తంగా..…
సోమయ్యగారి స్వగ్రామం ప్రకాశం జిల్లాలోని చీమకుర్తికి సమీపంలోగల పల్లామిల్లి గ్రామం. 1927లో సోమేపల్లి వెంకమ్మ, ఆది నారాయణ దంపతులకు జన్మించారు. వారిది చాలా పేద కుటుంబం కావడం చేత బ్రతుకు తెరువు కోసం తల్లిదండ్రులు స్వగ్రామం విడిచిపెట్టి గుంటూరు జిల్లాలోని తెనాలికి వచ్చి చిన్న కట్టెల దుకాణం పెట్టుకొని జీవిస్తూ అక్కడే స్థిరపడ్డారు.
శ్రీ సోమయ్య గారు గణితంలో దిట్ట. 1942 లో సంఘ పరిచయమైంది. 1944లో వారు ప్రథమవర్ష సంఘ శిక్షావర్గ పూర్తి చేశారు. ప్రముఖ వారపత్రిక జాగృతి ప్రారంభంలో శ్రీ సోమయ్య ప్రధాన భూమిక పోషించారు. 1950 లో నెల్లూరు జిల్లాకు ప్రచారక్ గా వెళ్ళారు. 1959లో ప్రాంత ప్రచారక్ గా నియుక్తులయ్యారు. ఎమెర్జెన్సీ సంక్షోభ సమయంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో శ్రీ సోమయ్య సంఘాన్ని సమర్థవంతంగా నడిపించారు. కార్యకర్తలను ఎంతో ఆప్యాయంగా పలుకరించేవారు. సంఘపనిలో వారికేవైనా సమస్యలెదురయితే చిటికెలో పరిష్కారం చెప్పేవారు.1989 నుంచి వారు కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా (దక్షిణ, ఆగ్నేయ క్షేత్రాలు) రాష్ట్రాల సేవాప్రముఖ్ గా నియుక్తులయ్యారు.
1995 జులై 25 ఉదయం న్యూస్ పేపరు కొనడానికై కేరళలోని ఆల్వాయ్ స్టేషన్ లో రైలు దిగిన సోమయ్య గారు తిరిగి అప్పటికే కదిలిన రైలెక్కే క్రమంలో కాలు జారి రైలు క్రింద పడి ప్రాణాలు విడిచారు. ఎందరో స్వయం సేవకులను తీర్చిదిద్దిన కుశల సంఘటనా నిర్మాత శ్రీ సోమయ్య గారు. అపారమైన మేధా సంపత్తి తో పాటు విశిష్టమైన వ్యవహార శైలి వారి సొత్తు.





