ArticlesNews

ప్రకృతిలో పరమాత్మని దర్శించిన పాకలపాటి గురుదేవులు

1.9kviews

న చుట్టూ ఉండే ప్రకృతి. ఇదే పరమాత్మ యొక్క మరొక రూపం. అటువంటి ఈ ప్రకృతిలో దైవాన్ని దర్శించుకునేవారు మాత్రం కొందరే. అటువంటి వారిలో ప్రముఖులు పాకలపాటి గురుదేవులు. ఈయన ప్రకృతిలోని గాంభీర్యాది గుణాలతో తాదాత్మ్యం చెంది భగవత్ సాక్షాత్కారం (ప్రకృతిని) పొందారు.

పాకలపాటి గురువుగారు 11-6-1911 విరోధినామ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధపౌర్ణమి ఆదివారం జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించారు. పశ్చిమగోదావరిజిల్లా ఏలూరు – జంగారెడ్డిగూడెం దారిలో ముండూరు అగ్రహార వాస్తవ్యులయిన దామరాజు గంగరాజు, వెంకమ్మగారి మూడవ సంతానమాయన. వీరు శ్రీవత్సవ గోత్రీకులు, తిరువేలనియోగులు, అసలు పేరు వెంకటరామయ్య, ఈయన అన్నలు సోమేశ్వరరావు, విశ్వేశ్వరరావులు. వెంకట రామయ్యగారు 6వ ఏటనే తల్లిని పోగొట్టుకున్నారు. 9వ ఏట తండ్రిని పోగొట్టుకున్నారు. ఆయన విద్యాభ్యాసం మేనత్త రామాయమ్మగారి ఆధ్వర్యంలో స్వగ్రామంలోనే జరిగింది. ఏలూరులో మోతేవారి సత్రంలో ఉండి 8వ తరగతి చదువుకున్నారు. చిన్నవయస్సులోనే అరిషడ్వర్గాలతో కొట్టుమిట్టాడే పెద్దలను సంస్క రించే ప్రయత్నం చేసేవాడు. అపార గ్రహణధారణ శక్తి కలవాడని పండితుల మన్ననలందుకున్నాడు.

బాల్యంలోనే సమరస భావ వికాసం

భూస్వామి గారపాటి పుల్లయ్య, వెంకట రామయ్య గారిని చేరదీశాడు. పుల్లయ్య తల్లి ఇచ్చే స్వయంపాకంతో వెంకటరామయ్య తానే వండుకుని తినేవారు. చిన్ననాటి స్నేహితుడు పలపాల సూరన్నతో కలిసి తిరిగేవాడు. కులభ్రష్టుడు అయినాడని వెంకటరామయ్యను బంధువులు, సాటి బ్రాహ్మణులు వెలివేశారు. బంధువుల ఆంక్షలను వెంకటరామయ్య లెక్కచేయలేదు. సూరన్న, పుల్లయ్యలు వెంకటరామయ్యను బాబు గారని పిలిచేవారు. బాబుగారనే పేరు జగత్ ప్రసిద్ధినొంది తల్లితండ్రులు పెట్టిన వెంకటరామయ్య అనే పేరు మరుగునపడిపోయింది. బాబుగారి భూమిని అమ్మగావచ్చిన డబ్బును పెద్దమనిషి చేజిక్కించుకోగా తిరిగి దానిని బాబుగారికి ఇప్పించాడు పుల్లయ్య. ఆ డబ్బుతో బొంబాయి (ముంబాయి)లోని వింతలు, విశేషాలు చూసి ఒట్టిచేతులతో తిరిగి పుల్లయ్య ఇంటికి చేరారు బాబుగారు.

వేదన నుంచి శోధన

ఒకరోజు అర్ధరాత్రి బాబుగారు వెక్కివెక్కి ఏడ్వసాగారు. కారణం ఏమని అడగగా అనాథగా ఈ భారపు బ్రతుకు ఈడ్వడం కంటే ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. ఆత్మహత్య చేసుకోరాదని, అది మహాపాపమని ధైర్యం చెప్పి తన పక్కలో బాబుగారిని పడుకోబెట్టుకున్నాడు పుల్లయ్య. తెల్లవారి చూస్తే బాబుగారు కనపడలేదు. మధ్యరాత్రి పారిపోయి వుంటాడని బాబును కలకాలం క్షేమంగా ఉంచమని దేవుడుని ప్రార్థించాడు. బతికివుంటే ఎప్పుడైనా కలుసుకోవచ్చు అనుకున్నాడు.

ఇంట్లో నుండి వెళ్ళిపోయిన బాబుగారు పలపాల సూరన్నతో కలిసి ఏలూరు రైల్వేస్టేషన్ చేరుకున్నారు. కలకత్తా మెయిల్ అనుకోకుండా అక్కడ ఆగడంతో స్నేహితునికి వీడ్కోలు చెప్పి రైలెక్కేశాడు. గోదావరి బ్రిడ్జిమీద నుండి వెళుతుందేమో గోదావరిలోదూకి చనిపోదామనుకున్నాడు. నర్సీపట్నంలోనే టి.సి. వచ్చి టికెట్టులేని బాబుగారిని చెంపలు వాయించి రైల్లోనుండి దింపేశాడు. ఆనాడు బాబుగారిని టి.సి రైల్లో నుండి దింపివేయకపోయి వుంటే ఆంధ్రదేశం ఒక మహోన్నత వ్యక్తిని కోల్పోయి ఉండేది.

తెగిన గాలిపటంవలే బాబుగారు నర్సీపట్నంలో రైలుదిగి, ఊళ్ళు, కొండలు, కోనలు తిరిగారు. కొన్ని సంవత్సరాల తరువాత బొబ్బిలి సమీపంలోని కలువరాయికి చేరారు. ఆ రోజుల్లో కావ్యకంఠవాశిష్ఠ గణపతిముని కలువరాయిలో ఉండేవారు. ఈయన మంత్ర, తంత్ర జపయోగ సాధనలలో ఆరితేరిన ఆధునిక బ్రహ్మర్షి. బాబుగారు అనేక విద్యలలో ఆరితేరి గాయత్రి మంత్ర జపానుష్ఠానాలలో మంత్ర సిద్ధులు అయినది వీరి శుశ్రూషలోనే. బాబుగారి పూర్వజన్మలోని అన్ని ఆత్మ విద్యానిక్షేపాలు అక్కడే ఆవిష్కరింపబడ్డాయి. ఎదుటివారి కళ్ళజోడు అద్దాలలో కనపడే అక్షరాలను పొల్లుబోకుండా చదివేవారు. అత్యాధునిక యంత్ర పరికరమయిన కంప్యూటర్ వంటి మేధస్సు ఆయనది. ఆయన ముఖంలో బ్రహ్మవర్చస్సు తాండవించేది. దివ్యకాంతులు కళ్ళలో మెరిసేవి. విశాలమైన నుదురు వింతకాంతులీనేది. మానసిక, శారీరక వ్యాధిగ్రస్తులకు మందులు మాకులు, విభూతి, తీర్థాలు ఇచ్చేవారు.

ప్రకృతితో తాదాత్మ్యం

చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు వచ్చి బాబుగారి దర్శనం చేసుకునేవారు. ఒకసారి ఉన్నట్లుండి ఆయన ఆసేతు హిమాచలం తిరగాలని కలువరాయి నుండి బయలుదేరి అరణ్యాలు, పర్వతాలు, నదీనదాలు, తీర్థప్రదేశాలు, భూములుదాటి వెళ్ళారు. త్రివిష్టపం, బర్మా, రంగూన్, సిలోన్లలోని సుందరారణ్యాలను కూడా చూసి ప్రకృతిలో తాదాత్మ్యం పొందారు. వారాల తరబడి నిద్రాహారాలుమాని ప్రకృతి అందాలనుచూసి పరవశులయ్యేవారు. ఈ సమయంలోనే ఆయన ఇతిహాస, వేద, పురాణ, జోతిష్య, సాహిత్య, మంత్ర, మూలికావైద్యం, పాకశాస్త్రం… ఇలా అన్నింటిలోనూ ఆరితేరారు. రమణమహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, టిబెట్ యోగులు, కొత్తలంకయోగి, బాలయోగి, అల్లూరి సీతారామరాజులను కలుసుకున్నారు. బాబుగారిని తమ చెంతనే ఉంచుకోవాలని ఎందరో శ్రీమంతులు, జమీందార్లు ప్రయత్నించి విఫలులయినారు. ఆయన గాలిపటం వలే తన కిష్టమయిన పల్లెలు, అడవులు, గిరిజనులను చూసేవారు. తాను సాధించిన దివ్యశక్తులతో ఆటవికుల బాధలు తొలగించేవారు. దీనితో ఆయన వారికి ఆరాధ్యదైవం అయ్యారు. బాబుగారికి రామాయణ పారాయణం, రామపట్టాభిషేకోత్సవం చేయించడం, అర్హులయిన వారికి రామ మంత్రోపదేశం చేయడం ఇష్టమైనవి. ఆయన అస్ఖలిత బ్రహ్మచారి. భిక్షపాత్ర ధరించి అడవుల దగ్గర వున్న గ్రామాలలో తిరిగేవారు.

జ్ఞాని, మహిమాన్వితుడు

కలువరాయి గ్రామాన్ని విడిచి శిరిడి, పాలకొండ, టెక్కలి, సాలూరు, బొబ్బిలి, విశాఖపట్నంలలో కొంతకాలం గడిపారు. కస్పా జగన్నాథపురంలో పాలకుర్తి కృష్ణమూర్తిగారి మేడకు శంకుస్థాపన చేశారు. ఒక పెద్ద శ్రీమంతుడయిన వడ్డాది మాడుగుల, బాబుగారి కోసం ఒక పెద్ద ఇల్లు దానిలో 10,000రూపాయల అమూల్య గ్రంథాలు ఏర్పాటుచేశారు. కూరుమిల్లి సత్యనారాయణ మాడగుల సంస్థానానికి మేనేజరు. ఈయనకు బాబుగారంటే అమిత భక్తి. ఆ జమిందారీలో ఉన్న అన్ని అడవులలో బాబుగారు తిరిగారు. 1930, 1931లో నర్సీపట్నం వచ్చి లంబసింగి ఆశ్రమంలో బాబుగారు స్థిరపడ్డారు. కుసర్లపూడిలో ఒక భజన సంఘాన్ని, లౌకికపారమార్థిక జ్ఞానాన్ని ప్రబోధించటానికి మఱ్ఱనన్నమ్మ, లాలం అప్పలస్వామి, అప్పన్నపాలెం, కుసర్లపూడి, తానారిపాలెం, కటిమలగాలికొండ, భూసురకోట, కృష్ణాపురం, భీమసింగి, నిమ్మగడ్డ, కొత్తూరు, నిమ్మగడ్డ కొబ్బరితోట, వెంకట రామాపురంలలో ఆశ్రమాలు స్థాపించారు. 900గ్రామాల్లో దేవాలయాలు స్థాపించారు. కిటిమల నుండి అడ్డసరం వరకు వందకుపైన గిరిజన ప్రాంతాలలో సంచరించి గిరిజనుల ఆపద్భాందవుడయినాడు.

ఒక పేరు మోసిన పండితుడు నర్సీపట్నం దగ్గరలోని పాకలపాడు గ్రామంలో శ్రీమద్భాగవత ప్రవచనాన్ని చెప్పసాగాడు. చింకిగుడ్డలు, భిక్షపాత్ర ధరించిన బాబుగారు ఆ పండితుడు చెప్పిన తాత్పర్యం (పద్యభావం) సరిగా లేదని ఆ పద్యంలోని విశేషాలను ఎంతోమనోహరంగా, అనర్గళంగా చెప్పారు. సభలోని ప్రముఖులు, దిగ్గతులు అందరూ కూడా బాబుగారు తపస్సంపన్నులని, మహాపండితులని తెలుసుకుని తగిన మర్యాదలు చేశారు. పండితుల కోరిక మీద బాబుగారు పాకలపాడులో వారు నిర్మించిన ఆశ్రమంలోనే ఉండిపోయారు. అప్పటి నుండి ఆయన పాకలపాటి గురువుగా ప్రసిద్ధులయినారు. కొందరు పండితులుగారని, కొందరు రామయోగి అని పిలిచేవారు. బాబుగారు నిద్రాహారాలు మాని ఈ ఆశ్రమంలో ఎన్నో నెలలు కఠోరతపస్సు చేశారు. నిత్యం గాయత్రి మంత్ర పఠనం చేసేవారు. పాకలపాటి గురువుగారు గొప్ప తపశ్శక్తి సంపన్నులని, ఆధ్యాత్మిక జ్ఞాన ప్రకాశకులని ఆ ప్రాంతంలో కీర్తి వచ్చింది. ఆయన పాదం మోపినచోట ప్రకృతిమాత ఆనందంతో పులకించిపోయేది. అపర ఋష్యశృంగులు ఈయన. ఋష్యశృంగ మహర్షి పాదం మోపినచోట సుభిక్షంగా ఉన్నట్లు ఈయన పాదం మోపినచోట సుభిక్షంగా ఉండడమే కాక క్రూరమృగాలు సైతం వాటి సహజ క్రౌర్యాన్ని, వైరాన్ని విస్మరించి ప్రశాంతంగా ఉండేవి. బాబుగారు కొండ మీద తపస్సు చేసుకునేటప్పుడు రెండు పులులు గొడుగులాగా తమ తలలను ఉంచేవి.

విక్రమదేవవర్మ తమ ఆస్థానంలో గొప్పవిద్వత్కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కవిసమ్మేళనానికి ఉద్దండులయిన తిరుపతి వేంకట కవులు, కొప్పరపు కవులు వచ్చారు. మహారాజుగారిచ్చిన జటిలసమస్యను పూరించ డానికి పండితులు వ్యవధి అడుగగా బాబుగారు లేచి ఆ సమస్యను అవలీలగా పూరించారు. సభలోని వారందరూ (మహారాజుతోసహా) సాధువాదములు పలికారు. మహారాజు ఆస్థాన కవిగా బాబుగారిని ప్రకటించి సత్కరించారు. ఈ వార్త చదవి అపురూప అమూల్యరత్నాన్ని పోగొట్టుకున్నామని ముండూరి ప్రజలు తెలుసుకొన్నారు. బాబుగారి జాడ తెలిసిన తరువాత చిన్ననాటి స్నేహితుడు గారపాటి పుల్లయ్యవచ్చి దర్శనం చేసుకుని వెళుతుండేవాడు. ఆయనను బాబుగారు తన గురువుగా అందరికీ పరిచయం చేశారు.

పాకలపాటి గురువుగారు ఒకే కాలంలో అనేక చోట్ల కనిపించేవారు. విక్రమదేవవర్మ ఆస్థానం జయపురంలో ఉంటూ విశాఖపట్నం సముద్రరేవులో స్నానం చేస్తుండేవారు. రాజుగారు ఇది నిజమని గుప్తచారుల ద్వారా రూఢి చేసుకున్నారు. జయపురం సాహిత్యగోష్ఠికి స్వస్తి చెప్పి నర్సీపట్నం అడవులలో భీమసింగిలో ఆశ్రమం ఏర్పరచుకుని గిరిజనుల పాలిట దేవుడైనాడు. సీలేరు విద్యుత్కేంద్రం నిర్మాణమపుడు, కాంట్రాక్టరు గుంటూరు కన్నబ్బాయి చేపట్టిన పనులు ప్రారంభోత్సవానికి, గిరిజన నాయకుడు దేవూరి కొండలరావు పొలంలోనికి పులులు రాకుండా నివారించడానికి ఒకే ముహుర్తంలో గురువుగారు (పాకలపాటి) కొబ్బరికాయ కొట్టినట్లు నిదర్శనాలున్నాయి.

గిరిజనుల ఆరాధ్య దైవం

బాబుగారు గిరిజనులవి పవిత్ర హృదయాలు, వారు అమాయకులు, ఋషి సంతానమని భావించేవారు. ప్రత్యేకంగా కోయలను బాబుగారు దైవంగా భావించేవారు. అడవులలో ఉండే మంత్రగాళ్ళు, కట్టుబోతు విద్యలవారు, వెజ్జులు ప్రదర్శించే క్షుద్రశక్తులు బాబుగారి తపఃశ్శక్తి ముందు సూర్యుని ముందు దివిటీ అయ్యేవి. నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతాలలోని కోయవాళ్ళు ఆయన్ను ‘రామయోగి’ అని కూడా పిలిచేవారు. ‘మర్లపులి’ అన్న క్షుద్రవిద్యను రామయోగి తన జీవితంలో ఎదుర్కొని, దానిని ప్రయోగించిన కోయ మంత్రగాళ్ళను తన శక్తితో నిర్వీర్యులను చేశాడు. మర్లపులి అనేది పగలు మనిషిలా అడవిలో తిరుగుతూ రాత్రిళ్ళు పులిగా మారి మనుషులను చంపుతూ ఉండే క్షుద్రశక్తి. కోయలలో కొందరు మహా మంత్రగాళ్ళు దీనిని ప్రయోగించడంలో సిద్దహస్తులు.

వ్యవసాయ యోగ్యమైన భూములను వెదికి, గిరిజనులకు అప్పగించాదమేగాక, వారికి ఆధునిక వ్యవసాయం నేర్పారు. దాదాపు 300 పల్లెలలో వ్యవసాయ పద్ధతులను గిరిజనులకు నేర్పారు. ప్రతిగ్రామంలో మేకు పాతిపెట్టించి రామభజన చేయించేవారు. ఆ దీప శిఖలలో తనశక్తిని నిలిపేవారు. ఆటవికులు తమ కష్టాలను ఆ దీపంతో చెప్పుకుంటేనే తమ సమస్యలు తీరిపోయేవి. బాబుగారి చేత్తో ఏ ఆకు ఇచ్చినా ఎటువంటి రోగమైనా సమసిపోయేది. ఎవరైనా గూడెం ప్రజలొచ్చి ‘అయ్యా! పులొచ్చి మా పశువుల్ని ఎత్తుకుపోతున్నదయ్యా’ అని మొరపెట్టుకుంటే ఆ దిక్కుకు చూచి ‘ఇకరాదులే పో’ “అనేవాడు. ఆ గ్రామం ఛాయలకు మళ్లీ పులి వచ్చేది కాదు.అటువంటి శక్తి సంపన్నుడాయన. ఎక్కిరాల భరద్వాజ, చిట్టిబాబు, నర్సీపట్నం చినబాబు, పి.ఎస్.ఎస్.వర్మ గిరిజన గ్రామాలలో తిరిగి ఈ అద్భుతాలను చూశారు.

విలక్షణ జీవన శైలి

పాకలపాటి గురువుగారి వేషధారణ, అలవాట్లు చాలా విశిష్టమైనవి. తలను క్రాఫ్ చేసి, కాళ్ళకు బూట్లు, చేతిలో సిగరెట్టు, గ్లాస్కో పంచె, చొక్కా, చేతికి గడియారం ధరించి ఆధునిక సంపన్న గృహస్థువలే కనపడేవారు. ఉదయమే స్నానం, జపం ముగించి ఇస్త్రీ బట్టలు ధరించి తమ దర్శనం కోసం వచ్చిన వారితో కలిసి కాఫీ, టిఫెన్ తీసుకుంటూ పురాణాలలోని ప్రబంధాలను వినిపించి వ్యాఖ్యానించేవారు. ఎవరి వద్దా డబ్బులు తీసుకునేవారు కాదు. ఆయనతో ప్రయాణంచేసే వారి ఖర్చులు కూడా ఆయనే భరించేవారు. ఆశ్రమానికి వచ్చే వారికి చక్కని భోజనం తినిపించేవారు. చాకలికి, మంగలికి పుష్కలంగా డబ్బు ఇచ్చేవారు. వందల మందికి సునాయాసంగా మంచి వంటలు చేసి వడ్డించేవారు. చూడటానికి మంచి తిండిపుష్టి వున్న మనిషిలా కనిపించినా నిజానికి చాలా తక్కువ తినేవారు.

పట్టుదల, నిర్భీకత, అనుకున్న పని పూర్తయ్యేవరకూ నిద్రపోకపోవడం వీరి విశిష్ఠ గుణాలు . ఈయన రాత్రిపూట తిరుగుతూ ఉంటే పల్లె ప్రజలకు ఒక కాంతివంతమైన దీపం తిరుగుతున్నట్లు కనిపించేదట. కావ్యకంఠ గణపతిమునులు, రమణమహర్షి, స్వామి శివానంద మొదలైన వారు పాకలపాటి గురువుగారికి అత్యంత పూజ్యులు. పాకలపాటి గురువులు పరబ్రహ్మ అనుభవంలో మునిగి ఉండటం వలన ఏ పటం లేకపోయినా స్నానంచేసి అగరువత్తి వెలిగించి నమస్కరించేవారు.

పి.ఎస్.ఎస్.వర్మగారు గురువుగారితోపాటు 7 రోజులు పర్యటించినపుడు 20వేల సంవత్సరాల కాలగతి, దాని పరిణామాలు, సముద్రాల్లో మార్పులు, 60వేల సంవత్సరాల కాలపరిమితిలో ధ్రువాలు, భూమధ్యరేఖగాను, భూమధ్యరేఖ ధ్రువాలుగా మారటం, జీవ పరిణామం, భూఖండాలలో మార్పులు, చాలా వివరంగా చెప్పారు. చెప్పకూడనిది, చెప్పదలచని విషయముపై మౌనం పాటించేవారు లేదా వేరే విషయాల వైపుకు మరల్చేవారు. అమాయకులైన పల్లెవాసులు, గిరిజనులు ఋషులని వారి భక్తి నాగరికులు చేసే పాపాలకు, అధర్మానికి విరుగుడని ఇది భూభారాన్ని సమతుల్యం చేస్తుందని చెప్పేవారు.

అపరిమిత అనురాగం, అనుగ్రహం

ఒక గిరిజన పల్లెలో బాలందొర అనే గిరిజనుడు ఉండేవాడు. భక్తుడు. పదహారు మంది సంతానం. అందరికీ సమానమైన భాగమిచ్చాడు. ఒక రోజు గురువుగారు అతనితో, “ఒరే, ఫలానా సంవత్సరం, ఫలానా అమావాస్యనుంచి రెండు రోజుల తర్వాత రోజున నీవు కాలంచేస్తే చెయ్యొచ్చును రా” అన్నారు. ఇలా చాలా సంవత్సరాల ముందే చెప్పారు. ఈలోగా, తాను చెయ్యాల్సిన పనులన్నీ చక్కగా గురువు గారి అనుగ్రహం వల్ల నెరవేర్చాడు బాలందొర. 82 సంవత్సరాల వయస్సులో కూడా పిడుగులా ఉన్నాడు. అప్పుడు కూడా చేలోకి వెళ్లి దుక్కి చేసుకుంటున్నాడు. ఇంకా నాలుగు రోజుల్లో చనిపోతాడనగా, ఒక చెట్టు నీడన వట్టి గడ్డి పేర్పించి దానిమీద పడుకున్నాడు. పిల్లలకు ఏమీ చెప్పలేదు. వానికేమీ జబ్బు లేదు. పిల్లల్లో ఎవరో వెళ్లి బాబుగారికి ఈ విషయం చెప్పారు. సరిగ్గా అతడు శరీరం విడుస్తాడనే రోజుకు వెళ్లారు బాబు. “యేమిరా ఇలా పడుక్కున్నావ్? నీకేం పోయే కాలమా?” అన్నారు. “పడుకోవలనిపించింది, పడుకున్నా” అన్నాడు ఆ అపర భీష్ముడు. అప్పటి వరకూ పడుకున్నవాడు లేచి కూర్చున్నాడు. మొత్తం కొడుకులను కూతుళ్ళను పిలిచాడు. అందరినీ చేతులు పట్టుకుని నుంచోమన్నాడు. గురువుగారి చెయ్యి కూడా మధ్యలో పెట్టించి, అలా జరిగి, తన తల గురువుగారి తొడ మీద పెట్టుకుని, ఠక్కున చచ్చి పోయాడు. బాబుగారు స్నానం చేసి అగ్నిహొత్రం పట్టుకుని కొంత దూరం నడిచారు. చినబాబుకి అగ్నిహొత్రమిచ్చి, శవానికి ఒక కొమ్ము కాసి, కొంత దూరం పాడె మోశారు. ఒక గిరిజనునికి బాబుగారు స్వయంగా అగ్ని సంస్కారం చేశారు. నర్సీపట్నం నుంచి సరుకులు తెప్పించి కొన్ని వేలమందికి సమారాధన చేయించారు. ఎప్పుడు చనిపోతామో తెలియకపోయినా, తామొకనాడు చనిపోతామన్న విషయం అందరికీ తెలుసు. కానీ బాలందొరలా ఏ కొందరో తమ జీవితాన్ని సాఫల్యం చేసుకుంటారు. బాలందొర కేవలం మాన్య జీవి కాడు, ధన్య జీవి.

దేహం విడిచిన దివ్యాత్మ

పాకలపాటి గురువుగారు ఎప్పుడు సిద్ధి పొందేదీ శిష్యులకుగాని, ఆశ్రమ వాసులకు గాని తెలియజేయలేదు. ఆశ్రమం నుండి విశాఖపట్నం వచ్చి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారి ఇంట్లో ప్రసంగిస్తున్నప్పుడు తాను త్వరలో దేహం చాలించే సూచనలున్నాయని అన్నారు. 6-3-1970 సౌమ్యనామ సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి శుక్రవారం శివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో ఆయన తనువు చాలించారు.

గురుదేవుల వల్ల అనేక వందల కోయగూడేలకు ఎంతో మేలు జరిగింది. ఉత్త మాటలు చెప్పే రాజకీయ నాయకులకంటే ఆయన తన మౌనమైన జీవితంద్వారా, నిస్వార్ధమైన సేవద్వారా ఎన్నో వందల కోయ, చెంచు, గూడేలకు మనం ఊహించలేనంత మేలు చేశారు.

గురువుగారు తన శరీరం చాలించినా స్థూలరూపంలో దర్శనమిచ్చి తన భక్తులకు అండగా నిలిచేవారు. ఒకనాడు ఇద్దరు భక్తులు లంబసింగి రాతి మీద గురువు గారిని చూసి భయపడిపోయారు. గురువుగారు అలవాటు ప్రకారం వారిపై చేయివేసి భీమసింగి వైపు నడిచారు. వారు భయంతో వణకడం చూసి భయమెందుకురా ఇలా ఎందుకు వణుకుతారు? అని ప్రశ్నించారు. వారు…. మీరు సిద్ధిపొందారు కదండీ? అనగా…… “మిమ్మల్ని వదిలి నేనెక్కడికిపోతానురా? నేను ఎపుడూ మీదగ్గరే ఉంటాను” అన్నారు. ఆశ్రమంలో గురువుగారు కాళ్ళు కడుక్కోవటానికి ఒకరు నీళ్ళు, మరొకరు తువ్వాలు తేవడానికి లోపలికి వెళ్ళేసరికి ఆయన అంతర్థానమయ్యారు. ఇటువంటి మరోఅనుభవం ఎక్కిరాల భరద్వాజగారికి, పి.ఎస్.ఎస్. వర్మగారికి జరిగింది. గురువుగారు గాయత్రి మంత్రసిద్ధులు, సంకల్ప సిద్ధులు, ఆటవికుల ఆరాధ్యదైవం, కోయల పాలిట కొంగుబంగారు.

ఇటువంటి మహానుభావులు ఈనాటికీ మన దేశంలో పుడుతూ ఉండటంవల్లే ఈదేశం పుణ్యభూమి అనిపించుకోగలుగుతున్నదన్నమాట వాస్తవం. అతీత సిద్ధులున్న మహర్షులూ, జ్ఞానసంపన్నులైన మహానుభావుల ఉనికి, పురాణాలు కట్టుకథలనీ, కల్పితాలనీ మనం అనుకుంటాం. అలాంటి వారు అసలు పుడతారా? అనుకుంటాం. వారు పుట్టినది నిజమే. మన మధ్యన తిరిగినదీ నిజమే. వారు వస్తారు వెడతారు. మనం మాత్రం ఇలాగే ఉంటాం. అలాంటివారు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ మన దేశంలో ఉంటూనే ఉంటారు. ఇదే మన దేశపు నిజమైన అదృష్టం.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.