News

ప్రపంచానికి దారి చూపే రామానుజాచార్యుల బోధనలు

482views
  • ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ

భాగ్య‌న‌గ‌రం: రామానుజాచార్యుల బోధనలు ప్రపంచానికి దారి చూపిస్తాయని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌ని దివ్యక్షేత్రంలో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఆవిష్కరించి జాతికి అంకితమివ్వడంతో పాటు 120 కిలోల స్వర్ణ శ్రీమూర్తికి ప్రధాని పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ చినజీయర్ స్వామి తనతో విష్వక్సేనేష్ఠి యజ్ఞం చేయించారని ఆ యజ్ఞఫలం 130 కోట్ల ప్రజలకు అందాలనే అభిలాషను వ్యక్తం చేశారు. రామానుజాచార్యుల బోధనల్లో ఒకవైపు జ్ఞాన సముపార్జనకు మార్గాలున్నాయనీ.. మరోవైపు భక్తి మార్గాన్ని ఎలా అనుసరించాలో తెలిపారనీ ప్రధాని చెప్పారు. సన్యాసాన్ని స్వీకరించి సిద్ధి పొందడానికి ఒక పరంపరను సృష్టించిన మహానుభావుడు రామానుజాచార్యుడని తెలిపారు. దేశ ఏకతకు రామానుజాచార్యులు స్ఫూర్తి ఎంతో అవసరమని చెబుతూ సమాజంలో అంతరాలను రామానుజాచార్య వెయ్యేళ్ల క్రితమే తొలగించారని గుర్తు చేసారు.

అందరినీ సమానంగా చూశారని, అనాడే ఆయన ఆదర్శాలు దేశవ్యాప్తంగా విస్తరించాయని ప్రధాని పేర్కొన్నారు. రామానుజాచార్యులు దళితులను ఆలయ ప్రవేశం చేయించారని, మనిషికి జాతి కాదు.. గుణం ముఖ్యమని లోకానికి చాటారని మోదీ చెప్పారు. రామానుజాచార్యుల సమతాసూత్రం మన రాజ్యాంగానికి స్ఫూర్తి అని ప్రధాని వివరించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి