News

క్రిస్టియన్ ఎన్జీవోల లైసెన్సుల గడువు పొడిగింపుకు నో అన్న సుప్రీం

434views

FCRA లైసెన్స్ ‌లను కొనసాగించాలని కోరుతూ 6,000 క్రైస్తవ NGO లు కలసి చేసుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు మంగళవారం (25/1/2022) తిరస్కరించింది. కటాఫ్ తేదీలోపు దరఖాస్తు చేసుకున్న 11,594 NGOల FCRA రిజిస్ట్రేషన్లు పొడిగించబడ్డాయంటూ సొలిసిటర్ జనరల్ ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందిన కోర్టు ఆ మేరకు నిర్ణయాన్ని వెలువరించింది. 30.09.2021 నాటికి చెల్లుబాటయ్యే సంస్థలన్నిటిపైనా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ నిషేధం కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది.

ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద 6000 పైగా ఎన్జీవోల లైసెన్సుల గడువు ముగిసిపోయింది. ఆ గడువును పొడిగించాలని కోరుతూ ఆ 6000 NGOలు సుప్రీంను ఆశ్రయించాయి.

పిటిషనర్-NGO తరఫు సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే, NGOలు వచ్చే రెండు వారాల్లోపు దరఖాస్తు చేసుకుంటే వారి FCRA లైసెన్సులను పొడిగించేలా ప్రత్యామ్నాయ ఆదేశాల కోసం కోర్టును  అభ్యర్ధించారు.

అయితే ఆ విధంగా మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ సీటీ రవికుమార్, జస్టిస్ దినేష్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. అవకాశముంటే పిటిషనర్ అధికారులను అభ్యర్ధించుకోవచ్చని, అధికారులు కూడా పిటిషనర్ల అభ్యర్ధనను పరిశీలించవచ్చని బెంచ్ పేర్కొంది.

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచనల ఆధారంగా, కటాఫ్ తేదీలోపు లైసెన్స్ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకున్న 11,594 NGOల FCRA లైసెన్స్‌లను పొడిగించినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి తెలిపారు.

“భారత్ లోని NGOల లైసెన్సుల గడువు పొడిగించకపోతే హూస్టన్ లోని సంస్థ ఆందోళన చెందడమేంటి?” అని పిటిషన్ వేసిన సంస్థ యొక్క కేంద్రాన్ని, దాని ఉద్దేశ్యాలను కూడా సొలిసిటర్ జనరల్ ప్రశ్నించారు. “ఈ PIL వేయడం వెనుక వారి ఉద్దేశ్యం ఏమిటో నాకు తెలియదు. ఎక్కడో ఏదో తేడా ఉంది” అని సొలిసిటర్ జనరల్ అన్నారు.

6000 సంస్థల లైసెన్సులను భారత ప్రభుత్వం నిలిపివేసినట్లు గుర్తించినందునే పిటిషనర్ కోర్టు ముందుకు వచ్చినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది హెగ్డే కోర్టుకు వివరించారు. ఇటీవల సవరింపబడిన FCRA చట్టం ప్రకారం తాము లైసెన్సు గడువును పెంచడానికి అనుమతులు కోరడానికి సదరు NGOలు అన్నీ విముఖత చూపుతున్న విషయాన్ని కూడా కోర్టు గుర్తించింది.

బెంచ్ ఈ క్రింది ఉత్తర్వులను జారీ చేసింది:

“మేము NGOలు కోరుతున్న మధ్యంతర ఉపశమనంపై ఇరు పక్షాల న్యాయవాదుల వాదనలూ విన్నాము. పిటిషనర్లు 30.09.2021 నాటికి FCRA లైసెన్స్ చెల్లుబాటు అయ్యే అన్ని సంస్థల లైసెన్సులనూ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగించాలని మధ్యంతర ఆదేశాలు ఇవ్వవలసినదిగా కోర్టును కోరారు. వారి వాదనకు ప్రతిస్పందనగా, కట్-ఆఫ్ సమయం లోపు దరఖాస్తు చేసుకున్న 11, 594 NGOల లైసెన్సు గడువును పొడిగించామని తెలుపుతూ సదరు వివరాలను సొలిసిటర్ జనరల్ కోర్టుకు సమర్పించారు. అధికారులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాదని మేము మీరు కోరినట్లుగా ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులనూ వెలువరించాలని భావించడం లేదు. అవకాశముంటే పిటిషనర్లు అధికారుల ముందు ఒక రిప్రజెంటేషన్‌ను దాఖలు చేయవచ్చు. తమ విచక్షణాధికారం మేరకు అధికారులు ఆ విజ్ఞప్తులను పరిశీలించవచ్చు.

FCRA సవరణలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కోర్టు తీర్పు వెలువరించిన తర్వాత ఈ రిట్ పిటిషన్ మళ్ళీ పరిశీలనకు వస్తుంది.

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ప్రధాన కార్యాలయం వుండి, భారత్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా కార్యాలయాలున్న గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ అనే సంస్థ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. ప్రముఖ సువార్తికుడు డాక్టర్ కె.ఎ. పాల్ దాని వ్యవస్థాపకుడు.

విదేశీ విరాళాల నియంత్రణ చట్టం, (FCRA) 2010లోని సెక్షన్ 50 ప్రకారం కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను వినియోగించుకునేలా ఆదేశించాలని, కోవిడ్-19 నిబంధనలు కొనసాగినంత వరకు విపత్తు నిర్వహణ చట్టం కింద అవసరమైన అత్యవసర సేవలకుగానూ అన్ని ప్రభుత్వేతర సంస్థలను (NGO) సవరించిన FCRA చట్టం పరిధి నుంచి మినహాయించాలని పిటిషనర్లు కోర్టును కోరారు.

గతంలో ఈ NGOలు చేసిన పని మిలియన్ల మంది భారతీయులకు సహాయపడిందని, ఇలా వేలాది NGOల FCRA రిజిస్ట్రేషన్ ఆకస్మిక, ఏకపక్ష రద్దు వలన ఆ సంస్థలు, వారి కార్మికులు వారి సేవలను పొందే మిలియన్ల భారతీయుల హక్కులకు ఇది భంగం కలిగిస్తుందని కూడా పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఎన్జీవోల పాత్రను కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ మరియు ప్రధానమంత్రి కార్యాలయాలు స్వయంగా గుర్తించాయని పిటిషన్‌లో పేర్కొంది. అయినప్పటికీ పిటిషనర్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

Source : LiveLaw.in

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.