
-
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించింది కేంద్రం. దిల్లీలోని ఇండియా గేట్ వద్ద అబ్బురపరిచే నేతాజీ హాలోగ్రామ్( బీమ్ లైట్లతో ఏర్పాటు చేసే 3డీ చిత్రం) విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఆ స్థానంలో గ్రానైట్‌తో తయారు చేసే విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.
నేతాజీకి భారత్ రుణపడి ఉంటుందని, ఇందుకు విగ్రహమే తార్కాణమని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పూర్తిస్థాయి విగ్రహం రూపొందే వరకు ఈ ప్రదేశంలో నేతాజీ హాలోగ్రామ్ విగ్రహం ఉంటుందని మోదీ తెలిపారు.
“స్వాతంత్య్రం పోరాడి సాధించాలి.. అభ్యర్థించేది కాదని నేతాజీ అనేవారు. బ్రిటిషర్లకు తలొగ్గడాన్ని ఆయన ఎప్పుడూ తిరస్కరించేవారు. త్వరలోనే హాలోగ్రామ్ విగ్రహం స్థానంలో గ్రానైట్ విగ్రహం ఏర్పాటు చేస్తాం. నేతాజీ విగ్రహం.. ప్రజాస్వామ్య విలువలను గుర్తు చేస్తుంది. భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. స్వతంత్ర భారతావనిని తీసుకువచ్చే ఆకాంక్షను ఎప్పటికీ కోల్పోవద్దని, భారత్‌ను కదిలించే శక్తి ఎవరికీ లేదని నేతాజీ చెప్పేవారు.
స్వతంత్ర భారత్ కలలను సాకారం చేయటమే మన ముందు ఉన్న లక్ష్యం. 100వ స్వాతంత్య్ర దినోత్సవంలోపు నవ భారత్‌ను రూపొందించాలి. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన రహస్య దస్త్రాలను బయటపెట్టే అవకాశం మా ప్రభుత్వానికి లభించటం అదృష్టంగా భావిస్తున్నా’ అని ప్రధాని అన్నారు. అనంతరం 2019, 2020, 2021, 2022 ఏడాదికి సుభాష్ చంద్ర బోస్ అప్డా ప్రబంధన్ పురస్కారాలను ప్రదానం చేశారు మోదీ.
Source: EtvBharat





