News

IPL : వివో పోయి టాటా వచ్చె ఢాం ఢాం ఢాం

310views
  • IPL నుంచి చైనా కంపెనీకి ఉద్వాసన

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు కొత్త స్పాన్సర్ వచ్చింది. అది కూడా భారత కంపెనీ..! ఐపీఎల్ 2022 సీజన్ నుంచి టాటా గ్రూప్ స్పాన్సర్ గా వ్యవహరించనుంది. ఇప్పటివరకు స్పాన్సర్ గా వ్యవహరించిన చైనా కంపెనీ వివోతో ఐపీఎల్ ఒప్పందం ముగిసింది. లీగ్ నూతన స్పాన్సర్ గా టాటా గ్రూప్ వ్యవహరించనుందని ఐపీఎల్ చైర్మన్ బ్రజేష్ పటేల్ వెల్లడించారు. ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 2018-2022 వరకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ కోసం వివో బీసీసీఐతో రూ.2,200 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, 2020 సీజన్ సమయంలో భారత్, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనగా, ఆ ఏడాది వివోను స్పాన్సర్ గా తప్పించారు. మరుసటి సీజన్ లో వివో మళ్లీ స్పాన్సర్ గా కొనసాగింది. కొత్త స్పాన్సర్ టాటా గ్రూప్ బీసీసీఐకి ఎంత చెల్లించనుందన్నది ఇంకా తెలియరాలేదు.

ఐపీఎల్‌-2022కు సంబంధించిన వేదిక, షెడ్యూల్‌ గురించి కూడా ఐపీఎల్ పాలకమండలి చర్చించినట్లు తెలుస్తోంది. “ప్రస్తుతం మా దృష్టి అంతా ఐపీఎల్ వేలాన్ని విజయవంతంగా నిర్వహించడంపైనే ఉంది. గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో అందుకు అనుగుణంగా ముందుకు వెళ్లే మార్గాలను చర్చిస్తాం” అని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపారు. ఐపీఎల్ మెగా వేలం ఫిబ్రవరి 12,13, తేదీల్లో బెంగళూరులో నిర్వహించాలని బీసీసీఐ భావించింది. కానీ బెంగళూరులో కోవిడ్‌ తీవ్రత దృష్ట్యా వేదికను తరలించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్-2022 నుంచి మరో రెండు కొత్త జట్లు చేరనున్నాయి. లక్నో, అహ్మదాబాద్ కొత్త ఫ్రాంచైజీలుగా ఈ సారి లీగ్ లో సందడి చేయనున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.