News

ప్రధాని మోడీ కాన్వాయ్ ని ఆపింది మేమే – ఎస్ ఎఫ్ జే వెల్లడి

308views
  • విచారణ జరిపారో ఖబడ్దార్… న్యాయవాదులకు బెదిరింపులు

  • జాతీయ భద్రత, సమగ్రతనే దెబ్బతీస్తామంటూ బెదిరింపులు

పంజాబ్ లో రోడ్డుపై ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్ దాదాపు 20 నిమిషాల పాటు నిలిచిపోవడానికి కారణం తామేనంటూ సిక్కు వేర్పాటువాద సంస్థ ప్రకటించుకున్నట్లు సమాచారం.

ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యాలపై జరుగుతున్న దర్యాప్తును నిలిపివేయాలంటూ.. అమెరికా కేంద్రంగా పనిచేసే ఖలిస్థానీ అనుకూల వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ ఎఫ్​జే) నుంచి అనేక ఫోన్ కాల్స్ వచ్చాయని సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం ధర్మాసనానికి నివేదించింది. ప్రధాని కాన్వాయ్ ని అడ్డగించింది తామేనని ఎస్ ఎఫ్ జే పేర్కొందంటూ.. సోమవారం ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ ఘటనపై ఓ ఎన్ జీ ఓ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరపవద్దని న్యాయమూర్తులనూ బెదిరించారని వివరించింది.

‘అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ ఆఫ్ సుప్రీంకోర్టు సభ్యులకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ముందస్తుగా రికార్డు చేసిన బెదిరింపు కాల్స్ వచ్చాయి. జనవరి 10న ఉదయం 10.40 గంటలకు, మధ్యాహ్నం 12.36 గంటలకు ఈ కాల్స్ చేశారు. హుస్సానిన్ వాలా ఫ్లై ఓవర్ పై ప్రధాని కాన్వాయ్ ని అడ్డుకోవడం వెనక తమ హస్తం ఉందని పేర్కొన్నారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో దోషులను శిక్షించడంలో సుప్రీంకోర్టు విఫలమైందని, వేలాది మంది సిక్కు రైతులు చనిపోయినా ఎవరూ నోరు మెదపలేదని అన్నారు. అలాంటి న్యాయస్థాణానికి దీనిపై విచారణ చేపట్టే అర్హత లేదని వారు తమ ఫోన్ కాల్ లో హెచ్చరించారు’ అని న్యాయవాదుల సంఘం ధర్మాసనానికి లేఖ వ్రాసింది.

విచారణ చేపడితే జాతీయ భద్రత, సమగ్రతను దెబ్బతీసే అత్యంత ప్రతికూల చర్యలు ఎదుర్కొంటారని భయపెట్టినట్లు అందులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరింది. సుప్రీంకోర్టు కేసు వివరాలు, బ్యాంకు ఖాతాల సమాచారాన్ని అడ్వకేట్లు తమ ఫోన్లలో నిక్షిప్తం చేస్తారని, వారి ఫోన్లు హ్యాకింగ్ ‌కు గురైతే ఇవన్నీ దుర్వినియోగమవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయవాదులందరికీ ఇలాంటి కాల్స్‌ వస్తున్నాయంటూ దీపక్‌ ప్రకాశ్‌ అనే లాయర్‌ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.