
-
క్రైస్తవంలోకి కొడుకు, కూతుళ్ళు..
-
కలత చెందిన కుటుంబ యజమాని
-
అంత్యక్రియలపై అనుమానం
-
ఆలయానికి రూ. 2 కోట్ల విలువైన ఇంటిని విరాళంగా ప్రకటించిన తండ్రి
చెన్నై: దేశంలోని పచ్చని హిందూ కుటుంబాల్లో ‘శిలువ’ చిచ్చు రేపుతోంది. చట్ట వ్యతిరేకంగా మతమార్పిడిలు ఎక్కువవుతుండడంతో పలు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోతున్నాయి. వృద్ధాప్యం వచ్చాక బతికేది ఎలా అంటూ ఆయా ప్రాంతాల్లోని వృద్ధులు మానసికంగా కుంగిపోతున్నారు. ఇటువంటి దుర్ఘటనే తమిళనాడులో సంభవించింది.
కన్న కొడుకు, కూతుళ్ళు క్రైస్తవ మతంలోకి మారిపోవడంతో కలత చెందిన ఓ వ్యక్తి తన రూ.2 కోట్ల విలువైన ఇంటిని ఆలయానికి విరాళంగా ఇచ్చేశాడు. మతం మారిన తన పిల్లలు హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించరని ఆ వృద్ధుడు మనస్తాపానికి గురై, తాను కష్టపడి సంపాదించిన ఆస్తిని ఆలయానికి విరాళంగా ప్రకటించాడు.
తమిళనాడులోని కాంచీపురంలో నివాసముంటున్న వేలాయుధం అనే 85 ఏళ్ల వృద్ధుడు తన పిల్లలు క్రైస్తవ మతాన్ని స్వీకరించడం బాధాకరమని స్థానిక దినపత్రిక దినమలర్‌తో మాట్లాడుతూ ఆవేదన చెందాడు. అతను TN ప్రభుత్వంలో హెల్త్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశాడు. తన సంపాదనతో ఇప్పుడు రూ. రెండు కోట్ల విలువైన ఇంటిని నిర్మించాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరంతా క్రైస్తవులను వివాహమాడి క్రైస్తవ మతంలోకి మారిపోయారు.
వేలాయుధం మాట్లాడుతూ, “హిందూ ధర్మాన్ని అనుసరించే వ్యక్తిగా నా పిల్లలు నా అంత్యక్రియలు నిర్వహించాలని కోరుకున్నాను. నా కూతుళ్లిద్దరూ క్రైస్తవులను పెళ్లి చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. నా కొడుకు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతను కూడా క్రైస్తవ స్త్రీని వివాహం చేసుకున్నాడు. ముగ్గురూ క్రైస్తవ మతంలోకి మారారు. కాబట్టి వారు హిందూ సంప్రదాయాల ప్రకారం నా అంత్యక్రియలు చేయరు.. అని చెప్పారు.
“నాకు 2,680 చదరపు అడుగుల ఆస్తిలో ఇల్లు ఉంది, దాని విలువ ఇప్పుడు రూ. 2 కోట్లు. మతం మారిన వారికి ఇల్లు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను దానిని నా వంశ దైవమైన కుమారక్కొట్టం మురుగన్ ఆలయానికి విరాళంగా ఇచ్చాను. క్రైస్తవ మతంలోకి మారిన వారు నేను చనిపోయినప్పుడు కూడా ఎటువంటి కర్మలు చేయరు. కాబట్టి నా ఆస్తిని వారికి ఇవ్వడం ఇష్టం లేదు. నా రెండో కొడుకు, కూతురు ఇంట్లో కొంతభాగంలో ఉంటున్నారు. నేను, నా భార్య జీవించి ఉన్నంత కాలం వారు ఇక్కడ జీవించగలరు. నేను కాలం చేశాక గుడి ఆ ఇంటిని తీసుకుంటుంది”… అని తెలిపారు. కాగా, వేలాయుధం తన ఇంటి ఆస్తి హక్కులను ఆలయానికి అప్పగించి, పత్రాలను హెచ్‌ఆర్‌సిఇ మంత్రికి ఇచ్చారు.
Source: Hindupost





