News

ప్రభుత పట్టెను హారతి – జనత తెలిపెను సమ్మతి – పులకించెను భారతి.

658views
పలు రంగాల్లో అత్యున్నత సేవలు అందించిన వారికి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర స‌ర్కార్ పద్మ పురస్కారాలను ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలందించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆర్ఎస్ఎస్ నేత నానాజీ దేశ్‌ముఖ్ (మరణానంతరం), అస్సామీ జానపద గాయకుడు భూపేన్ హజారికా (మరణానంతరం)లకు కేంద్రం భారతరత్న ప్రకటించింది.
ప్రఖ్యాత సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రిని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు వ్యక్తులకు ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. వీరిలో ఇద్దరు ఆంధప్రదేశ్‌కు, ఇద్దరు తెలంగాణకు చెందినవారున్నారు. ఏపీ నుంచి ప్రముఖ చెస్‌ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, వ్యవసాయ రంగం నుంచి ఎడ్లపల్లి వేంకటేశ్వరరావు, తెలంగాణ నుంచి సిరివెన్నెలతోపాటు భారత ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ ఆటగాడు సునీల్‌ ఛెత్రిలను పద్మ శ్రీ ద‌క్కింది.
2019వ సంవత్సరానికి పౌర పురస్కారాలను కేంద్రం ప్ర‌భుత్వం శుక్రవారం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన ప్రముఖులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. కళలు, సాహిత్యం, సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్, పరిశ్రమలు, ఆరోగ్యం–వైద్యం, వర్తకం, క్రీడలు, సామాజిక సేవ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి ఆయా రంగాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖలను కేంద్రం పద్మ అవార్డులతో సత్కరించనుంది. మొత్తం 112 మందికి ఈ పురస్కారాలు ప్రకటించింది.
వీరిలో నలుగురికి పద్మ విభూషణ్, 14 మందికి పద్మభూషణ్, 94 మందికి పద్మ శ్రీ పురస్కారాలు దక్కాయి. జానపద గాయకురాలు తీజన్‌ బాయి, జిబౌటీకి చెందిన ఇస్మాయిల్‌ ఒమర్‌ గులేహ్, ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ ఏఎం నాయక్, మహారాష్ట్రకు చెందిన బల్వంత్‌ పురందరేలను పద్మ విభూషణ్‌ విజేతలుగా కేంద్రం ఎంపిక చేసింది. అవార్డులు దక్కించుకున్న వారిలో 21 మంది మహిళలు, 11 మంది విదేశీయులు, ముగ్గురు దివంగతులు, ఒకరు ట్రాన్స్‌జెండర్‌ ఉన్నారు. పురస్కారాలకు ఎంపికైన వారికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మార్చి, ఏప్రిల్‌లో రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేయనున్నారు. సినీ నటుడు మోహన్‌ లాల్‌(కేరళ)కు పద్మ భూషణ్, నటుడు, డాన్స్‌ మాస్టర్‌ ప్రభుదేవా(కర్ణాటక)కు నృత్యంలో పద్మ శ్రీ లభించింది.