
26/1/2019, శనివారం విజయవాడ కేదారేశ్వర పేటలోని కృష్ణరాజ అపార్ట్ మెంట్ రెండవ అంతస్తులో “సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ స్పిరిట్” పేరుతో రాజకీయ, సామాజిక అధ్యయన కేంద్రం [గ్రంధాలయం] ప్రారంభమయింది. శ్రీ శ్రీరామశాయి గారి స్వగృహంలో ప్రారంభించబడిన ఈ గ్రంథాలయ ప్రారంభంలో ఏకలవ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ సామాజిక కార్యకర్త శ్రీ పెరమారెడ్డి వేణుగోపాల్ రెడ్డి, ప్రముఖ రచయిత, హైదరాబాద్ నవభారతి ప్రచురణల నిర్వాహకులు శ్రీ వడ్డి విజయ సారధి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రముఖ రచయిత, కాలమిస్టు డా|| దుగ్గరాజు శ్రీనివాస రావు మాట్లాడుతూ జాతీయవాద భావజాలం కలిగిన వ్యక్తులలో అధ్యయన శీలత తక్కువగా కనిపిస్తున్నదని, ఎంత విషయ పరిజ్ఞానమున్నప్పటికీ వివిధ అంశాలపై అధ్యయనం చెయ్యడం అందరికీ అవసరమని తెలిపారు. ఉత్సాహ వంతులైన సామాజిక కార్యకర్తలకు విషయావగాహన కల్పించాలని, ఎంతో విలువైన గ్రంధాలలోని సమాచారం భావితరాలకు అందించాలనే సంకల్పం తనకు నాలుగేళ్ల క్రిందటే కలిగిందని, ఇటీవల తన మనస్సులోని భావనను రామశాయి గారి ముందు పెట్టగా వారు వెంటనే అంగీకరించి మొదటగా తన దగ్గరున్న వేయి పుస్తకాలతో తమ ఇంటిలోనే గ్రంథాలయం ప్రారంభించటానికి అంగీకరించారని తెలిపారు.
శ్రీ వడ్డి విజయ సారధి మాట్లాడుతూ జ్ఞానాన్ని తర్వాతి తరాలకు ధారణ ప్రక్రియ ద్వారా అందించడం అనేది వేద కాలం నుంచి వున్నదని, జ్ఞానం ఆచంద్ర తారార్కంగా నిలవాలనే సంకల్పంతో ఒక తరం నుంచి మరో తరానికి గురు ముఖతః కంఠస్థం చెయ్యడం ద్వారా నేర్చుకుని భావి తరాలకు అందించారని తెలిపారు. అలాగే జాతీయ వాద సాహిత్యం భావి తరాలకు అందాలంటే ఇలాంటి ప్రయత్నం అవసరమని తెలిపారు. ఔత్సాహికుల అధ్యయనానికి తగిన వాతావరణం కల్పిస్తే ఈ గ్రంథాలయం పది కాలాల పాటు జ్ఞాన ప్రదాయినిగా నిలుస్తుందని తెలిపారు.
శ్రీ వేణు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాన్ని నేటి తరం యువత అవసరాలకు, ఆసక్తులకనుగుణంగా ఇంటర్నెట్ సౌకర్యం, తగినన్ని కంప్యూటర్లు మొదలైన వాటితో ఆధునీకరించాలని తెలిపారు. నేడు తెలుగు చదవగలిగిన, రాయగలిగిన వారు అరుదుగా వున్నారని, ఈ గ్రంథాలు చదవడం ద్వారా విషయ పరిజ్ఞానమున్న వారు వారి భావాలను గ్రంథస్తం చేసే అలవాటు కూడా అలవరచుకోవచ్చని తెలిపారు.
డా|| శ్రీరామశాయి మాట్లాడుతూ దుగ్గరాజు శ్రీనివాస రావు గారి మదిలో మెదలిన ఆలోచన తనకు ఈ సంకల్పాన్ని ఇచ్చిందని, దానితో మొదటగా తన దగ్గరున్న దాదాపు వెయ్యి పుస్తకాలతో ఈ గ్రంథాలయం ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ “సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ స్పిరిట్” కు ప్రముఖ రచయిత, కాలమిస్టు శ్రీ దుగ్గరాజు శ్రీనివాస రావు అధ్యక్షులుగా కొనసాగుతారని ప్రకటించారు.