
భూసార పరీక్షల ఇబ్బందులను దూరం చేసే అద్భుత సాధనాన్ని భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. రోజుల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేకుండా.. 90 సెకన్లలోనే ఫలితాన్ని అందించడం దీని ప్రత్యేకత. ఈ పరీక్ష కోసం 5 గ్రాముల మట్టి నమూనాలు సరిపోతాయి. కాన్పుర్‌లోని ఐఐటీ శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు.
‘నియర్ ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కొపీ’ సాంకేతికతో ఈ సాధనాన్ని అభివృద్ధి చేశారు. ఇది నేల తీరుతెన్నులను అప్పటికప్పుడు విశ్లేషించి, ఆ సమాచారాన్ని స్మార్ట్ ఫోన్ పై అందిస్తుంది. ఇందుకోసం ‘భూ పరీక్షక్’ పేరుతో ఒక మొబైల్ యాప్ ను రూపొందించారు. దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి పొందొచ్చు.
ఈ మొబైల్ యాప్ ను యూజర్ ఇంటర్‌ఫేస్ ద్వారా చాలా సులువుగా వాడగలిగేలా తీర్చిదిద్దారు. రైతులకు స్థానిక భాషల్లోనూ ఇది సమాచారం ఇస్తుంది. 8వ తరగతి చదివిన వ్యక్తి కూడా దీన్ని సులభంగా ఉపయోగించగలుగుతాడు. ఒక్క సాధనంతో దాదాపు లక్ష నమూనాలను పరీక్షించొచ్చు.





