News

తిరుమలకు మూడో ఘాట్‌ రోడ్డు

517views

లిపిరి-తిరుమల ఘాట్ ‌రోడ్లలో రద్దీ నియంత్రణలో భాగంగా ప్రత్యామ్నాయంగా మూడో ఘాట్ ‌రోడ్డును అభివృద్ధి చేయనున్నారు.
ఇందులో భాగంగా కడప జిల్లా కోడూరు సమీపంలోని బాలపల్లి చెక్ ‌పోస్టు నుంచి శేషాచలం అటవీ ప్రాంతం మీదుగా తిరుమల చేరే అన్నమయ్య కాలిబాట మార్గాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించామని తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. శనివారం స్థానిక అన్నమయ్య భవనంలో నిర్వహించిన తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.

* అన్నమయ్య కాలిబాటను అభివృద్ధి చేసి రోడ్డు, కాలినడక మార్గాలు నిర్మించాలి. త్వరలో నివేదిక రూపకల్పన.
* నూతన సంవత్సరంలో సంక్రాంతి తర్వాత శ్రీవారి సర్వదర్శనానికి ఎక్కువ మంది భక్తులకు అనుమతి, పరిమిత సంఖ్యలో భక్తులను శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతించే విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాయాలని నిర్ణయం.
* వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తులకు జనవరి 13 నుంచి 10 రోజులు వైకుంఠద్వార దర్శనం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకారులకు ఉచిత దర్శనం.
* శ్రీశైలం ఆలయంలో శివాజీ గోపుర కలశాలకు బంగారు తాపడం చేయించడం.
* సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయ నిర్మాణం. ఇందుకోసం ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు విరాళాలు అందించే దాతలకు ఉదయాస్తమాన సేవా టికెట్ల కేటాయింపు.
* తిరుమలలో హనుమంతుని జన్మస్థలమైన అంజనాదేవి ఆలయం పూర్తిస్థాయిలో అభివృద్ధి.
* నాద నీరాజనం వేదికను దాతల విరాళాలతో భక్తులకు సౌకర్యవంతమైన మండపంగా తీర్చిదిద్దడం.
* ప్రముఖ నగరాల్లో కార్తిక దీపోత్సవం, శ్రీనివాస కల్యాణాలు.
* కడప జిల్లా రాజంపేటలోని అన్నమయ్య డ్యామ్‌ పరీవాహకంలో ధ్వంసమైన ఏడు ఆలయాలను పునర్నిర్మించడం.
* ఎస్వీ వేదవిశ్వవిద్యాలయంలో శ్రీ వేంకటేశ్వర తాళపత్ర గ్రంథ ప్రాజెక్టు ఏర్పాటు.
* రూ.10 కోట్లతో స్విమ్స్‌లోని సెంట్రల్‌ గోదాము భవన నిర్మాణం
* కల్యాణకట్ట క్షురకులకు పీస్‌ రేట్‌ను రూ.11 నుంచి రూ.15కు పెంచేందుకు ఆమోదం.
* వర్షాలకు దెబ్బతిన్న శ్రీవారిమెట్టు మార్గం రూ.3.6 కోట్లతో, రెండో ఘాట్‌రోడ్డును రూ.3.95 కోట్లతో పునరుద్ధరణ.
* భక్తులకు శ్రీ వేంకటేశ్వర నామకోటి పుస్తకాల పంపిణీ.

ఔట్ ‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌లో చేర్చుకోలేం

తితిదేలో కాంట్రాక్టర్ల కింద పనిచేసే ఎఫ్‌ఎంఎస్‌ కార్మికులను తితిదే ఔట్ ‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌లో చేర్చుకోలేమని విలేకరుల సమావేశంలో తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కార్మికుల ఆందోళనతో వసతి గృహాల్లో పారిశుద్ధ్యానికి ఎదురవుతున్న ఇబ్బందులను ఛైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లగా.. సంబంధిత కాంట్రాక్టు ఏజెన్సీలు కార్మికులను ఏర్పాటు చేసుకోవాలని, లేకుంటే వారిపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.

–  ఈనాడు సౌజన్యంతో…

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.