News

ఆర్మీలో డ్రైవర్‌గా చేరి బిపిన్ రావత్ సెక్యూరిటీగా ఎదిగాడు

397views
  • అమరుడైన తెలుగు వ్య‌క్తి సాయి తేజ

చిత్తూరు: ఆర్మీలో ఒక మామూలు డ్రైవర్‌గా చేరి త్రివిధ దళాధిపతి వ్యక్తిగత భద్రత సిబ్బంది స్థాయికి ఎదగడం అంటే సాధారణ విషయం కాదని అందరికీ తెలిసిందే. కానీ సాయి తేజ ఆ విషయంలో ఎంతో కష్టపడ్డాడు.. ఏకంగా రక్షణ దళాల అధిపతిని మెప్పించాడు. ఆయనతో పాటే విమాన ప్రమాదంలో అమరుడయ్యాడు. తమిళనాడులోని కూనూరు వద్ద ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో జనరల్ బిపిన్ రావత్ మరణించారు. మిలిటరీ హెలికాప్టర్ కూలి 13 మంది మృతి చెందగా.. ఓ వ్యక్తి తీవ్రంగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఈ దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కూడా ఉన్నాడు.

చిత్తూరు జిల్లా కురుబలకోట వాసి సాయితేజ ఈ ప్రమాదంలో అమరుడయ్యాడు. లాన్స్‌ నాయక్‌ హోదాలో సాయితేజ్‌ రావత్‌ పర్సనల్‌ సెక్యూరిటీ అధికారిగా పనిచేస్తున్నాడు. సాయితేజ్‌ భార్యతో చివరిసారిగా బుధవారం ఉదయం ఫోన్‌లో మాట్లాడినట్టు తెలుస్తోంది. సీడీఎస్ బిపిన్‌ రావత్‌‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా సాయితేజ్ విధులు నిర్విహిస్తున్నాడు. 2013లో ఆర్మీలో జాయిన్ అయ్యాడు సాయితేజ్. సాయితేజ్ మరణంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

సాయితేజ్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. చివరిసారిగా వినాయక చవితికి సాయితేజ్ స్వగ్రామానికి వచ్చినట్టు బంధువులు తెలిపారు. మెరుపు దాడుల్లో దిట్టైన సాయి తేజ బెంగళూరుతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో పనిచేశాడు. సాయితేజ శక్తి సామర్థ్యాలను గుర్తించిన బిపిన్ రావత్.. తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరిగా నియమించారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి