చీకటిలో చిరు దివ్వెలు విద్యా భారతి పాఠశాలలు : విద్యా భారతి క్షేత్ర సంఘటనా మంత్రి శ్రీ లింగం సుధాకర్ రెడ్డి

డిగ్రీ, పీజీ చదివిన విద్యావంతులు కూడా విడిగా వ్యక్తిత్వ వికాస తరగతులకు హాజరవుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని విద్యా భారతి క్షేత్ర [ కర్ణాటక, తెలంగాణా, ఆంధ్ర ప్రాంతాలు] సంఘటనా మంత్రి శ్రీ లింగం సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. “అంటే ఇన్నాళ్ళూ వాళ్ళు అభ్యసించిన విద్య వారిలో వ్యక్తిత్వాన్ని వికసింపజెయ్యలేదా?” అని సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. జనవరి 12,13 తేదీలలో విజయవాడలో రెండు రోజుల పాటు విద్యా భారతి ప్రచార విభాగం కార్యకర్తల శిక్షణ నిమిత్తం ఇక్కడికి విచ్చేసిన సుధాకర్ రెడ్డి పిల్లలలో బాల్య దశలోనే వ్యక్తిత్వ వికాసం జరగాలని, వారిలో మౌళిక విలువల నిర్మాణం జరగాలని చెప్పారు. కఠినమైన చట్టాలు చేసినంత మాత్రాన సమాజం సజావుగా నడవదని, వాటిని ఆచరించే పౌరులలో నిబద్దత వుండాలని స్వర్గీయ అబ్దుల్ కలాం చెప్పేవారని, ఆ నిబద్దత బాల్యంలోనే నిర్మాణం కావాలని తెలిపారు.
మనకంటే ఆరు నెలలు ఆలస్యంగా స్వాతంత్ర్యం వచ్చిన గడ్డి కూడా మొలవని దేశం ఇజ్రాయిల్ అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటిగా వుందని, అన్ని వనరులూ వున్న మన దేశం మాత్రం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల వరుసలోనే వున్నదని అబ్దుల్ కలాం ఆవేదన వ్యక్తం చేసేవారని తెలిపారు. పరిస్థితులు మెరుగవ్వాలంటే నైతిక విలువలను బోధించే విద్యా వ్యవస్థ అవసరమని పెద్దలెందరో చెబుతున్నారని, మన దేశ పౌరులలో నైతిక విలువలు, దేశ భక్తి లోపించడం వల్లనే మనం ఇంకా ఆ పరిస్థితులలో ఉన్నామని, ఆ చీకట్లను పారద్రోలే చిరు దివ్వెలే విద్యాభారతి పాఠశాలలని శ్రీ సుధాకర్ రెడ్డి తెలిపారు. 1952వ సంవత్సరంలో స్వర్గీయ భావూరావు దేవరస్ గారిచే గోరఖ్పూర్ లో మొట్టమొదటిగా సరస్వతి శిశుమందిర్ ప్రారంభించబడినదని తెలిపారు. ప్రస్తుతం విద్యాభారతి అధ్వర్యంలో 12 వేల పాఠశాలలు, మరో 12 వేల ఏకోపాధ్యాయ, సంస్కార కేంద్రాలు కలిపి మొత్తం 24 వేల పాఠశాలలు దేశం మొత్తం మీద విద్యాభారతి అధ్వర్యంలో నడుస్తున్నాయని తెలిపారు.
ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ఆశించకుండా విద్యా రంగంలో ఇంత పెద్ద ఎత్తున కృషి చేస్తున్నా కూడా ప్రచారం కోసం ఎలాంటి ప్రయత్నమూ చెయ్యకపోవటం వల్ల తమ సంస్థలు కనీస ప్రచారానికి నోచుకోవటంలేదని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఎందరో పెద్దలు శీల నిర్మాణానికి దోహదపడే విద్య అవసరమని అభిప్రాయపడి, ఆ విధమైన విద్యా సంస్థల స్థాపనకు, వ్యాప్తికి ప్రయత్నిస్తున్న నేపధ్యంలో దాదాపు 6 దశాబ్దాలుగా ఆ విధమైన కృషి చేస్తున్న తమ విద్యా సంస్థల బోధనా శైలి, కార్య కలాపాలు ప్రజలకు తెలియడం అవసరమని భావించి విద్యా సంస్థల కార్యకలాపాలకు ఎప్పటికప్పుడు ప్రచారం కల్పించేందుకు రాష్ట్ర స్థాయి నుంచి పాఠశాల స్థాయి వరకు సంవాద్ దాత, ప్రచార ప్రముఖ్, సోషల్ మీడియా ప్రముఖ్ లను నియమించామని తెలిపారు. వారికి ఈ రెండు రోజుల పాటు వార్తను రాయడం, ప్రెస్ నోట్ తయారు చెయ్యడం, ఫొటోగ్రఫీలో మెళకువలు, సోషల్ మీడియా సాయంతో క్రింది వరకు సమాచారాన్ని చేర వెయ్యడం తదితర ప్రచార విభాగానికి సంబంధించిన అంశాలలో పత్రికా రంగ ప్రముఖులు, ఫోటో గ్రఫీ నిపుణులు తదితర పెద్దలచే శిక్షణ ఇస్తామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమానికి విద్యాభారతి ఆంధ్ర రాష్ట్ర సంఘటనా మంత్రి శ్రీ హనుమంత రావు, ఆంధ్రప్రదేశ్ శైక్షణిక్ ప్రముఖ్ శ్రీ కోవెల శ్రీనివాసాచార్యులు, ప్రచార విభాగం యొక్క రాష్ట్ర కార్యదర్శి శ్రీ సుబ్బారావు తదితరులు నేతృత్వం వహించారు.





