News

కేరళలో ఇద్దరు హిందూ బాలికల అదృశ్యం

766views

తిరువ‌నంత‌పురం: యుక్తవయస్సులో ఉన్న ఇద్దరు హిందూ బాలికలు వారి సహవిద్యార్థులు అర్షద్‌, అఫ్జల్‌తో అదృశ్యమయ్యారు. అలత్తూరుకు చెందిన సూర్య కృష్ణ(21) అదృశ్యమైన నెలరోజుల తర్వాత అటువంటిదే మరో సంఘటన చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతంలో ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నలుగురు పొల్లాచ్చి మీదుగా తమిళనాడులోకి ప్రవేశించారు. ఇంకా వారిని పోలీసులు గుర్తించలేదు. నలుగురు కలిసి ప్రయాణిస్తున్నట్టు సీసీటీవీ విజువల్స్‌ నిర్ధారించాయి. గతంలో జరిగిన జస్నా, సూర్య కృష్ణ అదృశ్యం కేసులతో సహా ఇతర మిస్సింగ్‌ కేసులతో తాజా కేసుకు పోలికలు ఉండటంతో బాలికల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఈ నలుగురు ఏఎస్‌ఎం హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో తొమ్మిదో తరగతి విద్యార్థులు. ఈ నెల మూడో తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు వారు పాలక్కాడ్‌ పట్టణానికి చేరుకున్నట్టు సీసీటీవీ ఫుటేజీలు చూపించాయి. తల్లిదండ్రుల ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అలత్తూరు పోలీసు అధికారి రియాజ్‌ చక్కేరి మాట్లాడుతూ, ‘అమ్మాయిలు తమ స్నేహితులకు తాము టూర్‌ ప్లాన్‌ చేస్తున్నామని చెప్పారు. అయితే, ఎక్కడకు వెళ్తున్నారన్న విషయం మాత్రం చెప్పలేదు. బాలికలు తీసుకెళ్లే మొబైల్‌ ఫోన్‌ గురించి వారి కుటుంబ సభ్యులకు తెలియదు. వారు ప్రైవేట్‌గా ఫోన్‌ని ఉపయోగిస్తున్నారని మేము అనుమానిస్తున్నాము. మేము ఈ ఫోన్‌ వివరాలను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాము’ అని తెలిపారు.

గతంలో…

ఆగస్టు 30న అలత్తూరుకు చెందిన రాధాకృష్ణన్‌ కుమార్తె సూర్యకృష్ణ పుస్తకాలు కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లి అదృశ్యమైంది. సూర్య కృష్ణ పాలక్కాడ్‌లోని మెర్సీ కాలేజీలో రెండో సంవత్సరం బీఏ(సాహిత్యం) విద్యార్థి. సూర్య కృష్ణ అదృశ్యమయ్యే ముందు ఫోన్‌లో ఎక్కువ సమయం గడిపిన తర్వాత గోవాను సందర్శించినట్టు నివేదికలు సూచిస్తున్నాయి. మార్చి 22, 2018న కంజిరాపల్లిలోని సెయింట్‌ డొమినిక్‌ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్న జస్నా మరియ జేమ్స్‌ పతనంతిట్ట జిల్లా రాణిలోని తన ఇంటి నుంచి అదృశ్యమైంది. మంగుళూరులోని ముస్లిం సెమినరీలో జస్నా కనిపించినట్టు ఇటీవలి నివేదికలు సూచించాయి. ఈ సంఘటనలు బలవంతపు మతమార్పిడులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

Source: Opindia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి