ArticlesNews

ఇవిగో మూడువేల ఏళ్ళనాటి మన పూర్వీకుల అవశేషాలు

102views

న పూర్వీకుల జీవన విధానాన్ని తెలిపే ఆనవాళ్లు, అతిపురాతన వస్తువులు.. అబ్బుర పరిచే అవశేషాలు తెలంగాణలోని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట, పాలమాకుల, మగ్దుంపూర్‌ గ్రామాల్లో బయటపడ్డాయి. ఆనాటి సమాధి, వారు వాడుకున్న సామాగ్రీ వెలుగు చూశాయి. ఇవి సుమారు 3000 వేల సంవత్సరాల క్రితం నాటి ప్రజలు వినియోగించినట్లు పురావస్తుశాఖ అధికారులు పేర్కొన్నారు.

2017 ఫిబ్రవరి నుంచి మూడు నెలల పాటు నంగునూరు మండలంలోని నర్మెట, పాలమాకుల, మగ్దుంపూర్‌ గ్రామాల్లో పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు చేపట్టగా అతి పురాతన వస్తువులు, అప్పటి ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ అవశేషాలను హైదరాబాద్‌లోని పురావస్తుశాలకు తరలించి భద్రపరిచారు.

1.క్యాప్ ‌స్టోన్ ‌గా అతిపెద్ద బండరాయి..

ఈ చిత్రంలో కనిపిస్తున్నపెద్ద బండరాయి సమాధిపై ఉన్న క్యాప్ ‌స్టోన్‌. ఇది సుమారుగా 3 వేల సంవత్సరాల కిందటిదిగా పురావస్తుశాఖ అధికారులు భావిస్తున్నారు. సమాధిపై కప్పిఉన్న బండరాయి (క్యాప్ ‌స్టోన్‌) 6.70 మీటర్ల పొడవు, 4 మీటర్లు వెడల్పు, 65 సెంటీమీటర్లు మందంతో 43 టన్నుల బరువు ఉంది. దీన్ని క్రేన్‌ సహాయంతో లేపేందుకు ప్రయత్నించగా దాని సామర్థ్యం సరిపోలేదు. దీంతో 80 టన్నుల బరువును లేపే సామర్థ్యం ఉన్న క్రేన్‌ సహాయంతో 2 గంటల పాటు కష్టపడి బండను తొలగించారు.

2.శంఖాలు (కౌంచ్‌)

సుద్దరాళ్లలాగా కనిపిస్తున్న ఈ వస్తువులు తవ్వకాల్లో బయటపడ్డ శంఖాలు. ప్రాచీన మానవుడు ప్రార్థన చేసేందుకు, వ్యక్తి చనిపోయిన తరువాత అంత్యక్రియల సమయంలో గౌరవ సూచకంగా వీటిని వాడేవారని పురావస్తుశాఖ అధికారులు తెలిపారు. నాటి నుంచి నేటి వరకు కొన్ని తెగల్లో ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది.

3.కుండలు పెట్టుకునే కుదుర్లు‌

ఆదిమానవులు వంట పాత్రలను పెట్టుకునే స్టాండ్‌ ఇది. వంటలు చేయగానే కుండలు పడిపోకుండా, క్రిమికీటకాలు కుండల్లోకి పోకుండా ఇలాంటి ఎరుపు రంగు కల్గిన కుదర్లు (రింగ్ ‌స్టాండ్‌) వాడేవారు. చూడడానికి ఢమరుకం లాగ కనబడుతున్నా వాస్తవానికి మట్టికుండలు పెట్టుకునే ఉపయోగించే రింగ్ ‌స్టాండ్‌ ఇది.

4.నక్షత్ర సమూహాలను గుర్తించే కఫ్ ‌మాక్స్‌

నక్షత్ర సమూహాలు గుర్తించేందుకు ప్రాచీన మానవుడు బండరాళ్లపై కఫ్ ‌మాక్స్‌ లను చెక్కేవారు. ప్రస్తుతం నడుస్తున్న కాలం, తర్వాత వచ్చే సీజన్, ఋతువులను తెలుసుకునేందుకు ఇలాంటి గుర్తులను వారు నివసిస్తున్న ప్రాంతంలో రాతి బండ లపై చెక్కేవారు. (పురావస్తుశాఖ అధికారులు గుంతల్లో ఉప్పు పోయడంతో స్పష్టంగా కనిపిస్తున్నాయి).

5.తవ్వకాల్లో బయటపడుతున్న మృణ్మయ పాత్రలు

ఎరుపు, నలుపుతోపాటు రెండు రకాల రంగులు కల్గిన మిశ్రమ మృణ్మయ బయటపడ్డాయి. రెండు సమాధుల్లో తవ్వకాలు జరుపగా ప్రాచీన మానవులు వాడిన అనేక పాత్రలు, ఎంతో కీలకమై సమాచారం లభించింది.

6.అద్భుతమైన మట్టికుండ

ప్రాచీన మానవుడు వాడిన ఎరుపు రంగు మట్టికుండ నర్మెటలో జరిపిన తవ్వకాల్లో బయటపడింది. వేల సంవత్సరాల కిందట తయారు చేసిన మట్టి కుండకు చుట్టూ అలంకారంగా సర్కిళ్లు చెక్కగా… అవి ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ కుండను వారు తాగునీటి కోసం ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు.

7 కుంపటి, మృణ్మయ పాత్రలు

ధాన్యం, విలువైన వస్తువులు మట్టికుండల్లో దాచేవారు. చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన పదార్థాలను కుండల్లో పెట్టి సమాధి చేసేవారు. అలాగే కుంపటి (ఫైర్ ‌స్టాండ్) పై ఆహార పదార్థాలు వేడి చేసుకోవడమే కాకుండా ధూపం వేసుకునేందుకు కూడా వీటిని వాడినట్లు తెలుస్తోంది.

8. స్వస్తిక్‌ ఆకారంలో సమాధులు

పాలమాకులలో పురావస్తుశాఖ అధికారులు తవ్వకాలు చేపట్టగా అందంగా పేర్చినట్లు కనబడుతున్న బండ రాళ్లు తవ్వకాల్లో బయటపడ్డాయి. సుమారుగా 3 వేల సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో ఆదిమానవులు జీవించినట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిని సమాధి చేసి నాలుగు వైపుల బండలను స్వస్తిక్‌ ఆకారంలో ఏర్పాటు చేసేవారు. దాని చట్టూ రెండు వరుసలుగా వృత్తాకారంలో బండరాళ్లను పేర్చారు.

9.గుంతలు కావు గ్రూవ్స్‌

మగ్దుంపూర్‌లో ఓరైతు వ్యవసాయ బావి వద్ద ప్రాచీన మానవుడు ఏర్పాటు చేసుకున్న 12 గ్రూవ్స్‌ గుర్తించారు. జంతువులను వేటాడేందుకు ఉపయోగించే రాతి ఆయుధాలను పదును పెట్టేందుకు వీటిని ఉపయోగించేవారు.

10.గిన్నెల తయారీ అద్భుతం

ప్రాచీన మానవులు ఆహారాన్ని నిల్వ చేసుకునేందుకు ఎరుపు, నలుపు రంగు మట్టి గిన్నెలను ఉపయోగించేవారు. ఇవి ఇతర మట్టిపాత్రలకు భిన్నంగా రెండు రంగులు కల్గి ఉండగా… అవి ఇప్పటికీ చెక్కుచెదరలేదు. మెన్‌హీర్‌ సమీపంలో ఉన్న రెండవ సమాధిలో ఇవి బయటపడ్డాయి.

11.చెక్కు చెదరని దంతాలు

తెగలోని పెద్ద మహిళదిగా బావిస్తున్న మెన్‌హీర్‌ వద్ద ఉన్న పెద్ద సమాధిలో 60 సెంటీమీటర్ల కాలు ఎముక లభించింది. అలాగే 20 సెంటీమీటర్ల దంతంతో కూడిన దవడ భాగం బయటపడింది. దానికి ఉన్న దంతాలు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. సీసీఎంబీ శాస్త్రవేత్తలు జరపనున్న పరిశోధనల్లో ఈ రెండు భాగాలూ కీలకంగా మారనున్నాయి.

12.ఎముక ఆభరణాలు

అప్పటి ప్రజలు ఎముకలతో తయారు చేసిన అభరణాలు వాడినట్లుగా తెలుస్తోంది. సుమారుగా 20 వరకు డైమండ్‌ ఆకారంలో ఉన్న ఎముకతో తయారు చేసిన పూసలు మెన్‌హీర్‌ వద్ద పెద్ద సమాధిలో జరిపిన తవ్వకాల్లో బయపడ్డాయి. ఇలాంటి ఆకృతి మొదటిసారిగా ఈప్రాంతంలోనే బయట పడ్డట్లు అధికారులు తెలిపారు.

సాక్షి సౌజన్యంతో…..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.