
ఆ కలియుగ ప్రత్యక్ష దైవం, ఆపదమొక్కులవాడు, అనాథ రక్షకుడు, అడుగడుగు దండాల వాడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఏడుకొండల స్వామిని తనివితీరా దర్శించుకుని తరించాలని ఎవరికుండదు?
కానీ జీవితంలో ఒక్కసారైనా ఏడుకొండలూ ఎక్కి ఆ స్వామిని దర్శించుకోగలమా? అని దిగులు చెందే వారెందరో.… ఎందుకంటే…. చాలీచాలని బ్రతుకులతో పూట గడవడమే కష్టంగా ఉన్న అభాగ్యులు వారు.
“మనసేమో నీకోసం పరుగులెడతది… చిల్లు కాసయినా లేని జేబు తిరగబడతది….”
అని పాడుకుంటూ ఆ శుభఘడియ కోసం ఆర్తిగా ఎదురుచూసేవారు.
అలాంటి వారందరికీ పవిత్ర బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ అనాథ రక్షకుణ్ణి, ఏడుకొండల స్వామిని మనసారా దర్శించుకునే భాగ్యాన్ని “దివ్య దర్శనం” కార్యక్రమం ద్వారా కలిగించింది సమరసతా సేవా ఫౌండేషన్ (SSF).




రాష్ట్ర వ్యాప్తంగా కొండల్లో, కోనలలో, గ్రామ సీమలలోని హరిజన, గిరిజన, మత్స్యకార సోదరులకు ఆ తిరుమల గిరివాసుని దర్శించుకునే అవకాశాన్ని కల్పించింది SSF. వాడ వాడల నుంచి ఆ ఏడుకొండలవాడి దర్శనానికి భక్తకోటి తరలివచ్చింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి జిల్లాకి 500 మంది చొప్పున ఎంపిక చేసిన షుమారు 6500 మంది పేద SC, ST భక్తులను ప్రత్యేక బస్సులలో తిరుమలకు తరలించి వారికి దివ్య దర్శన భాగ్యాన్ని కల్పించారు. వచ్చిన వారికి రవాణా, వసతి సౌకర్యాలను TTD ఏర్పాటు చేసింది. వారందరికీ ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసింది.



ఆ స్వామి దర్శనంతో వారు పులకించిపోయారు.పరమానంద భరితులయ్యారు. గిరిజన సోదరులు ఆనందంతో సంప్రదాయ ధింసా నృత్యం చేసి వెంకన్నకు మొక్కులు చెల్లించారు.
“అయ్య బాబో ఇక్కడున్నావా?
ఏడు కొండలెక్కి బాగ కూసున్నావా?
ఎన్ని మైళ్ళు రావాలి? ఎన్ని రైళ్లు మారాలి? సామీ…
నిన్ను సూడాలంటే… సూదంటు రాయంటి సూపున్న సామి”
అని పాడుతూ పారవశ్యంతో చిందులేశారు.
ఈ విధంగా ఎన్నో వైవిధ్యభరిత కార్యక్రమాలను చేపడుతూ మారుమూల పల్లెల్లోని ప్రజలలో ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక చైతన్యాన్ని కలిగించే ప్రయత్నం నిరంతరం కొనసాగిస్తున్నది సమరసతా సేవా ఫౌండేషన్.





