News

భారత సైన్యం చేతిలో ముగ్గురు ఉగ్రవాదులు హతం: శ్రీనగర్ శివారులో ఘటన.

417views

శ్రీనగర్: ‌భారత భద్రతా బలగాలు శ్రీనగర్‌ శివారులో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. ముజ్‌గంద్‌లో భద్రతా బలగాలు సోదాలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కంటపడ్డారని తెలిపారు. హతమైన ఉగ్రవాదుల నుంచి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ‘‘శనివారం సాయంత్రం నుంచి శ్రీనగర్‌-బందిపొరా రహదారికి సమీపంలోని ముజ్‌గంద్‌లో భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో కొందరు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి’’ అని సంబంధిత అధికారులు మీడియాకు తెలిపారు.

‘‘ఉగ్రవాదులు తప్పించుకుని పారిపోకుండా శనివారం రాత్రంతా సోదాలు నిర్వహించారు. ఆదివారం ఉదయం భద్రతా బలగాలు మరోసారి కాల్పులు జరిపి ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు’’ అని అధికారులు వివరించారు. భద్రతా బలగాల చేతిలో హతమైన ఉగ్రవాదులు ఏ ఉగ్ర సంస్థకు చెందిన వారన్న విషయంపై ఇప్పటి వరకు వివరాలు అందలేదు. ఈ ఘటనతో శ్రీనగర్‌లో వదంతులు వ్యాపించకుండా ఉండేందుకు అంతర్జాల సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ కాల్పుల్లో ఐదుగురు భద్రతా బలగాలకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలోని ప్రతి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ఆందోళనకారులు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Source: Eenadu.

http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break87