News

అయోధ్య, కాశీ, మధురలలో మందిరాలు నిర్మించి తీరుతాం: విశాఖలో సాధుసంతుల ఉద్ఘాటన

67views

అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణం కోసం విశాఖలో నిర్వహించబడిన “హిందూ శంఖారావం”.

తేది 09.12.2018న విశాఖపట్టణంలోని ఆళ్వార్ దాస్ ప్రాంగణంలో విశ్వ హిందూ పరిషద్ ఆధ్వర్యంలో “హిందూ శంఖారావం” పేరుతో సభ జరిగింది. భారత పార్లమెంటు సభ్యులందరూ పూనుకుని అయోధ్యలో భవ్య శ్రీరామ మందిర నిర్మాణం నిమిత్తం చట్టం చేయాలని ఈ సభలో వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

శ్రీ కమలానంద భారతీ స్వామివారు మాట్లాడుతూ- స్తబ్ధుగా ఉన్న హిందూ సమాజాన్ని మేలు కొలపడానికే ఇటువంటి ఉద్యమాలు అవసరమని తెలిపారు. చిత్రంగా, భారత గౌరవనీయ సర్వోత్తమ న్యాయాలయం ఇచ్చిన తీర్పులే ఇటువంట ఉద్యమాలు ఏర్పడానికి కారణమౌతున్నాయని, చైనా, రష్యా, అలాగే వివిధ క్రైస్తవ దేశాల నుండి ఈ ఉద్యమానికి మద్దత్తు లభిస్తూ ఉండగా భారత దేశంలోని కమ్యూనిష్టులు, సెక్యులరిస్టులమని చెప్పుకునేవారు వ్యతిరేకిస్తుండడం శోచనీయమని, ఈ దేశంలో చట్టాన్ని తప్పక ఆచరించేవాళ్ళు హిందువులే నని, మిగిలిన వర్గాల వారిని పోలీసులు, కోర్టులు ఏమీ చేయలేక పోతున్నాయన్నారు. 30 సంవత్సరాల తరువాత ప్రపంచంలో హిందువులు అత్యధిక సంఖ్య కలవారిగా అవుతారని చెప్పారు. ఆర్.ఎస్.ఎస్. ప్రాంత కార్యకారిణి సదస్యులు శ్రీ తులసీ ప్రకాష్ గారు మాట్లాడుతూ హిందువులను రెచ్చగొట్టే కోర్టు తీర్పులు కారణంగానే బాబరీ కట్టడం కూలిపోయిందని, ఈ నాడు కూడా కోర్టు తీర్పు కారణంగానే రామాలయం నిర్మాణానికి పార్లమెంటులో చట్టం చేయాలని ఉద్యమం ప్రారంభమైందని, చట్టం చేయకపోతే ఉద్యమం ఉధృతమౌతుందని చెప్పారు. సభలో శ్రీ లోకేశ్వరానంద మహరాజు వారు, శ్రీ సాయి సుధాకర పూర్ణానంద స్వామి వారు, శ్రీ మహేశ్వరానంద స్వామి వారు, విశ్వ హిందూ పరిషత్ సహ ప్రాంత కార్యదర్శి శ్రీ గాంగేయులు సుబ్రహ్మణ్యం గారు తదితరులు ప్రసంగిస్తూ అయోధ్యలో రామాలయ నిర్మాణం దేశానికి శ్రీ రామ రక్షా అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హిందూ సంస్థల కార్యకర్తలు, మాతృమూర్తులు, విద్యార్ధులు, కార్మికులు, కర్షకులు అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీ పరానంద స్వామి వారు, తదితర మఠాధిపతులు, స్వామీజీలు పాల్గొని ప్రసంగించారు. వి.హి.ప., ప్రాంత ఉపాధ్యక్షులు శ్రీ టి.పి. వేంకటేశ్వరరావు గారు, వి.హి.ప., జిల్లా అధ్యక్షులు శ్రీ నీలకంఠం గారు, వి.హి.ప., జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ మట్టపల్లి విశ్వేశ్వరరావు, , వి.హిం.ప. జిల్లా కార్యదర్శి శ్రీ అప్పల రాజు, విశాఖపట్టణం దుర్గా పీఠానికి చెందిన ఉమాదేవి గారు తదితరులు వేదికని అలంకరించి శ్రీ రామ మందిర నిర్మాణానికి తమ మద్దతు తెలిపారు.