News

ఎంగేజ్మెంట్ అయిపోయింది.. కాబోయే వధూవరులు సెల్ఫీ తీసుకున్నారని తెలియడంతో..!

80views

ఇస్లామాబాద్: పాకిస్తాన్ లోని పరిస్థితులకు అడ్డం పట్టే సంఘటన ఇది. అప్పటికే ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇంకొద్ది రోజుల్లో పెళ్లి చేసుకొని ఒకటవబోతున్నారు. అయితే వారు తీసుకున్న సెల్ఫీ ఏకంగా వారి ప్రాణాలు తీస్తుందని అసలు ఊహించి ఉండరు. ఎందుకంటే సెల్ఫీలు దిగి పరువు తీశారని భావించిన వరుడి తండ్రి కుమారుడుని చంపేశాడు.. అయితే వధువు తండ్రి కూడా మరో రాక్షసుడు అయిపోయాడు. ఆమెకు ఏకంగా విషం పెట్టి చంపించేశాడు. ఈ దారుణ ఘటన పాకిస్థాన్ లో చోటుచేసుకుందని ప్రముఖ డాన్ పత్రిక ప్రచురించింది.

నిశ్చితార్థమైనప్పటికీ, వివాహం కాకుండా కలుసుకోవడమే కాకుండా, సెల్ఫీలు దిగి తమ పరువు తీశారని.. ఇలా చేయడం ఇస్లాం మత సంప్రదాయాలకు విరుద్ధమని భావించిన ఆ జంట తండ్రులు ఇలా వారిని చంపేశారు. వీరిద్దరూ దగ్గరి బంధువులే కావడం గమనార్హం. వీరి చర్యతో తమ పరువు పోయిందన్న ఉక్రోషంతో తమ బిడ్డల ప్రాణాలు తీశారు. తన కుమార్తెను చంపిన తండ్రి విషం తాగి మరణించిందని అందరినీ నమ్మించాడు. హడావుడిగా మృతదేహాన్ని ఖననం చేయించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించగా మొత్తం విషయం బయటకు వచ్చింది. ఎంగేజ్ మెంట్ జరిగిన తరువాత తన కాబోయే భార్య ఇంటికి వెళ్లిన యువకుడు.. ఆమెతో మాట్లాడటంతో పాటు సెల్ఫీలు దిగడం వారి ప్రాణాలు తీసే దాకా వెళ్ళింది. ఈ ఘటన ప్రపంచానికి తెలియడంతో ఆ కసాయి తండ్రులను కఠినంగా శిక్షించాలని పలువురు అంటున్నారు.

Source: Bharath Today.